TTD: రథసప్తమికి తిరుమలలో పటిష్ట ఏర్పాట్లు
ABN, Publish Date - Feb 01 , 2025 | 05:23 AM
రథసప్తమి ఏర్పాట్లపై చర్చించేందుకు టీటీడీ బోర్డు తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. సమావేశం అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
ఆర్జిత సేవలు, సిఫారసు దర్శనాలు రద్దు
3 నుంచి 5 వరకు ఎస్‌ఎ్‌సడీ టోకెన్ల జారీ నిలిపివేత
‘తిరుపతి’లో తొక్కిసలాటపై న్యాయ విచారణ జరుగుతోంది: టీటీడీ చైర్మన్
తిరుమల, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకలకు తిరుమలలో పటిష్ట ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై చర్చించేందుకు టీటీడీ బోర్డు తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. సమావేశం అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఫిబ్రవరి 4న జరిగే రథసప్తమి వేడుకలకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై పలు సమావేశం నిర్వహించామన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో భద్రతా ఏర్పాట్లపై చర్చించామని, గతేడాది రథసప్తమికి 650 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఉంచగా, ఈసారి 1,300 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రథసప్తమి సందర్భంగా అష్టదళపాదపద్మారాధన, ఊంజల్‌సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను, ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. ఇక, తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) టోకెన్ల జారీని కూడా నిలిపివేస్తామన్నారు. వైకుంఠద్వార దర్శన టికెట్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం న్యాయ విచారణకు కమిటీ వేసిందని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు. అలాంటప్పుడు టీటీడీ నుంచి మరో విచారణ కమిటీ వేయడం సరికాదని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బీఆర్ నాయుడు సమాధానమిచ్చారు.
ఉద్యోగి ఆచూకీ కోసం గాలింపు
కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన ఉద్యోగి దీపాలి సుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటికే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టీటీడీ సీవీఎస్వో కూడా విజిలెన్స్ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా సుబ్రహ్మణ్యం కోసం వెతుకుతున్నారని చెప్పారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 01 , 2025 | 05:23 AM