వారంతే..!
ABN, Publish Date - Feb 05 , 2025 | 01:10 AM
పోలీస్ కమిషనరేట్‌లో అధికారులు ఒక థీమ్‌తో పనిచేస్తుంటే స్టేషన్లకు ఎస్‌హెచవోలుగా వ్యవహరిస్తున్న ఇన్‌స్పెక్టర్లు మరొక ఆలోచనతో అడుగులే స్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కమిషనరేట్ చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల పనితీరుపై అధికారుల అసంతృప్తి
వైసీపీ వాసనలు ఇంకా పోలేదని వ్యాఖ్యలు
కేసులను సమగ్ర విచారణ చేయకుండానే మూసేస్తున్న ఎస్‌హెచవోలు
అధికారుల ఆదేశాలను వదిలేస్తున్న ఇన్‌స్పెక్టర్లు
కేసులు దర్యాప్తులో లోపాలను గుర్తిస్తున్న అధికారులు
ఇకనుంచి ఉపేక్షించకూడదని నిర్ణయం
-గాంధీనగర్‌లోని ఈ-సేవా కేంద్రంలో పనిచేసే అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గవర్నరుపేటలోని ఒక లాడ్జికి తీసుకెళ్లి కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత మరో యువతిని వివాహం చేసుకొని ముఖం చాటేశాడు. దీనిపై బాధితురాలు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును గవర్నరుపేట పోలీసులకు పంపారు. ఫిర్యాదును చదివి సమగ్రంగా విచారణ చేయాల్సిన గవర్నరుపేట పోలీసులు మొక్కుబడిగా నివేదిక ఇచ్చారు. గవర్నరుపేటలోని లాడ్జిలో అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంటే అమ్మాయి, అబ్బాయికి మధ్య పరిచయం గాంధీనగర్‌లోని ఈ-సేవా కేంద్రంలో జరిగినందు వల్ల ఈ ఫిర్యాదు తమ పరిధిలోకి రాదని అధికారులకు నివేదిక ఇచ్చారు. వాళ్ల మధ్య పరిచయం జరిగిన ప్రదేశం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన పరిధిలోకి వస్తుందని ఫిర్యాదును ఆ పోలీస్‌స్టేషన్‌కు పంపాలని గవర్నరుపేట పోలీసులు అభిప్రాయాన్ని రాశారు. అధికారులు ఫిర్యాదును, గవర్నరుపేట పోలీసులు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా చదివిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఇది.
- గడచిన ఏడాది మేలో నున్న పోలీస్ స్టేషన పరిధిలో ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు పేలవంగా జరిగిందని స్వయంగా పోలీస్ కమిషనర్ గుర్తించారు. దీనిపై పునఃవిచారణ చేయాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన ఇది.
- ‘మా కాలనీలో గంజాయి తాగిన వ్యక్తి దొంగతనాలు చేస్తుంటే పట్టుకుని అప్పగించాం. రెండు రోజులు మీ దగ్గర పెట్టుకుని సైకో అని చెప్పి వదిలేశారు. తర్వాత కొన్నిరోజులకు మళ్లీ అదే పనిచేయడం మొదలుపెట్టాడు. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత ఇవ్వడానికి ఉన్నారా? ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉన్నారా?’ అంటూ సెంట్రల్ జోన్‌లో ఓ ఎస్‌ఐను వాసవీకాలనీకి చెందిన సంక్షేమ సంఘం ప్రతినిధి అడిగిన ప్రశ్నలు ఇవి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
పోలీస్ కమిషనరేట్‌లో అధికారులు ఒక థీమ్‌తో పనిచేస్తుంటే స్టేషన్లకు ఎస్‌హెచవోలుగా వ్యవహరిస్తున్న ఇన్‌స్పెక్టర్లు మరొక ఆలోచనతో అడుగులే స్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కమిషనరేట్ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఇందులో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు రాజకీయ సిఫార్సులతో పోస్టింగులు సాధించుకున్నారు. మరి కొంతమందిని అధికారులు ఏరికోరి నియమించుకున్నారు. ఇలా వచ్చిన ఇన్‌స్పెక్టర్లు ఇప్పుడు తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయడం లేదన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. నెలవారీగా నిర్వహించే నేర సమీక్ష సమావేశాల్లోనూ, నిత్యం నిర్వహించే సెల్ కాన్ఫరెన్స్‌ల్లో ఇన్‌స్పెక్టర్ల డొల్లతనం బయటపడుతున్నట్టు తెలిసింది. వైసీపీ హయాంలో ఇన్‌స్పెక్టర్లతోపాటు పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు సరత్రా విమర్శలకు తావిచ్చింది. ఆ మచ్చను తొలగించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి వివిధ రకాల కాన్సెప్ట్‌లతో అధికారులు అడుగులు వేస్తున్నారు. అధికారులు చెప్పిన ఆలోచనలకు సమావేశాల్లో తల ఊపుతున్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తర్వాత వాటి గురించి పట్టించుకోవడంలేదన్న చర్చ అధికారుల మధ్య నడుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఉన్న కొంతమంది ఇన్‌స్పెక్టర్లు రాజకీయ నేతలు చేసిన సిఫార్సులను ఆదేశాలుగా భావిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలికాలంలో ఉత్తర మండలంలో అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న లారీలను ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా వదిలేశారు. ఈ విషయం తెలిసి అధికారులు ప్రశ్నించినప్పుడు ఆ పోలీసులు ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న స్టేషన్లలోను ఇలాంటి ఘటనలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హెచ్చరికలు జారీ చేసి వదిలేసిన అధికారులు ఇకపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
చెరోదారి
కమిషనరేట్ పరిధిలోని కొన్ని స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ల దారి ఒకలా ఉంటే, ఎస్‌ఐల దారి మరోలా ఉంటోంది. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సెక్టర్ ఎస్‌ఐలకు అప్పగిస్తారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి, విచారించి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాల్సిన ఎస్‌ఐలు ఆ పని చేయడం లేదు. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు న్యాయస్థానాల్లో చార్జిషీట్లు దాఖలు చేయడం లేదు. దీనితో చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య పెరుగుతోంది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల పెండింగ్ సంఖ్యను తగ్గించాలని అధికారులు నిత్యం నిర్వహించే కాన్ఫరెన్స్‌ల్లో హెచ్చరిస్తున్నారు. దీనితో సెక్టర్ ఇన్‌చార్జిలుగా ఉన్న ఎస్‌ఐలు ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. సీఐడీ, విజిలెన్స్ వంటి విభాగాలకు వెళ్లిపోవడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించమని చెప్పే సరికి బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కోరుకున్న విభాగాలకు వెళ్లాలంటే పోలీసు కమిషనర్ అనుమతి ఇవ్వాలి. ఇలా చేయాల్సిన పనిని వదిలేసి వెళ్లిపోవాలనుకున్న వారికి బ్రేక్‌లు వేయాలని డీసీపీలు భావిస్తున్నారు. ఇక నుంచి అధికారుల ఆదేశాలను పాటించకుండా విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరించిన వారిపై కచ్చితం ఉన్నతాధికారులకు రిపోర్టు రాయాలని నిర్ణయించారు.
Updated Date - Feb 05 , 2025 | 01:10 AM