‘దొంగ’తనం బట్టబయలు
ABN, Publish Date - Feb 05 , 2025 | 01:11 AM
‘కష్టార్జితాన్ని పొదుపు చేసుకుని రూపాయి రూపాయి పోగేసుకున్నాం. పిల్లల వివాహాలకు ఉపయోగపడతాయని ఇంట్లో రూ.36లక్షలు పెట్టుకున్నాం. నేను షాపునకు వెళ్లిపోయాను. నా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. ఈలోగా ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.36 లక్షలు దోచుకుపోయారు.’ అంటూ వత్సవాయి పోలీసులకు కొద్దిరోజుల కిందట ఓ ఆటో మెకానిక్ ఇచ్చిన ఫిర్యాదు ఇది. పోలీసులు సాంకేతికంగా ఎన్ని మార్గాల్లో దర్యాప్తు చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు. తర్వాత అసలు నిజంగా దొంగతనం జరిగిందా అని దర్యాప్తు చేయడం మొదలుపెడితే మెకానిక్ ఆడిన నాటకం బయటకు వచ్చింది.
నేరం జరగకపోయినా పోలీసులకు ఫిర్యాదు
రూ.36లక్షలు దొంగిలించారని హడావుడి
సాంకేతికంగా దొరికిపోయిన కుటుంబం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
‘కష్టార్జితాన్ని పొదుపు చేసుకుని రూపాయి రూపాయి పోగేసుకున్నాం. పిల్లల వివాహాలకు ఉపయోగపడతాయని ఇంట్లో రూ.36లక్షలు పెట్టుకున్నాం. నేను షాపునకు వెళ్లిపోయాను. నా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. ఈలోగా ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.36 లక్షలు దోచుకుపోయారు.’ అంటూ వత్సవాయి పోలీసులకు కొద్దిరోజుల కిందట ఓ ఆటో మెకానిక్ ఇచ్చిన ఫిర్యాదు ఇది. పోలీసులు సాంకేతికంగా ఎన్ని మార్గాల్లో దర్యాప్తు చేసినా ఎలాంటి క్లూ దొరకలేదు. తర్వాత అసలు నిజంగా దొంగతనం జరిగిందా అని దర్యాప్తు చేయడం మొదలుపెడితే మెకానిక్ ఆడిన నాటకం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే... వత్సవాయికి చెందిన ఓ ఆటోమెకానిక్ సంపాదించిన మొత్తాన్ని భార్యకు పొదుపు చేయమని ఇచ్చేవాడు. ఈ డబ్బులను బీరువాలో భద్రంగా ఉంచుతున్నట్టు ఆమె భర్తకు చెప్పేది. భార్యకు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చాడో ఆయన రాసుకునేవాడు. దీని ప్రకారం భార్యకు రూ.36లక్షలు ఇచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. డిసెంబరు నెలలో డబ్బులు అవసరమవ్వడంతో ఇవ్వమని భార్యను అడిగాడు. అప్పటికే భర్తకు తెలియకుండా భార్య, తల్లికి తెలియకుండా పిల్లలు బీరువాలో ఉన్న డబ్బులను ఖర్చు చేశారు. భర్త డబ్బులు అడిగే సరికి బీరువా లాకర్‌లో ఏమీ లేకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. డబ్బులు లేవని చెప్తే భర్త గొడవ చేస్తాడని భావించిన ఆమె దొంగతనం నాటకానికి తెరతీసింది. బీరువాలో చీరలను చిందరవందరగా పడేసి, లాకర్ తలుపులు తీసేసి, అందులో ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేసింది. బీరువా తలుపులు తీసి ఉంచి ఇంటి నుంచి పిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లినట్టుగా బయటకు వెళ్లింది. కాసేపటికి ఇంటికి వచ్చి దొంగలు పడ్డారని హడావుడి చేసింది. భర్తకు ఫోన్‌చేసి తాము ఆస్పత్రికి వెళ్తే దొంగలు పడి డబ్బులు దొంగిలించారని చెప్పింది. ఇంటికి వచ్చి పరిశీలించుకుని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీరువాలో ఉన్న రూ.36లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన వత్సవాయి పోలీసులు వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా కాల్‌డేటాను పరిశీలించారు. దీనితోపాటు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు కొత్త వ్యక్తులు వెళ్లినట్టు కనిపించలేదు. కాల్‌డేటాలోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. బీరువాలోని లాకర్‌ను పరిశీలిస్తే అందులో రూ.36లక్షలు పట్టేంత ప్రదేశం లేదని గుర్తించారు. దీనితో పోలీసులకు అనుమానం వచ్చింది. తర్వాత పోలీసులు ఆ ఇంటికి తరచుగా వెళ్లే వ్యక్తిని విచారించారు. దీనితో అసలు విషయం వెలుగులోకి వస్తే మొదటికే ప్రమాదం వస్తుందని భావించిన మెకానిక్ కుటుంబం వాస్తవాన్ని అంగీకరించింది.
Updated Date - Feb 05 , 2025 | 01:12 AM