ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NTR Vardhanti : ప్రజలిచ్చిన తీర్పు గౌరవం పెరిగేలా పనిచేద్దాం

ABN, Publish Date - Jan 19 , 2025 | 06:00 AM

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలకు కనీవినీ ఎరుగని తీర్పిచ్చారని, ఆ తీర్పునకు గౌరవం పెరిగేలా పనిచేద్దామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

పార్టీ ఎమ్మెల్యేలకు అచ్చెన్నాయుడు పిలుపు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలకు కనీవినీ ఎరుగని తీర్పిచ్చారని, ఆ తీర్పునకు గౌరవం పెరిగేలా పనిచేద్దామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి అనిత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు అశోక్‌ బాబు, ఇతర పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ‘రాజకీయం కొన్ని వర్గాలకు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైన రోజుల్లో ఎన్టీఆర్‌ దానిని ప్రజల్లోకి తెచ్చారు. కనుచూపు మేర కాంగ్రె్‌సకు ప్రత్యమ్నాయం లేని రోజుల్లో దానిని కూకటివేళ్లతో పెకిలించారు’ అని అన్నారు. ‘42 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ చెక్కు చెదరకుండా నిలిచి ఉండటానికి చంద్రబాబు నాయుడు శ్రమ, కార్యకర్తల కష్టం కారణమన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తెలుగునేలలో సామాన్యులకు కూడా రాజకీయ చైతన్యం కలిగించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దువ్వారపు రామారావు, ఏఎస్‌ రామకృష్ణ, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ అంటే ఒక వైబ్రేషన్‌:పెమ్మసాని

కాంగ్రెస్‌ కంచుకోటను కూల్చి సంచలనం సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ అంటే పేరు కాదని, ఒక వైబ్రేషన్‌ అని, కాంగ్రెస్‌ కంచుకోటను కూల్చిన సెన్సేషన్‌ అని, తెలుగువారి గుండెల్లో నిలిచిన ఒక ఎమోషన్‌ అని అన్నారు.

టీడీపీ కోటి సభ్యత్వాలతోనే ఎన్టీఆర్‌కు ఘన నివాళి: రామ్మోహన్‌నాయుడు

యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు కొనియాడారు. శనివారం, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి తన కార్యాలయంలో పూలమాల వేసి, నివాళులర్పించారు. లోకేశ్‌ నాయకత్వంలో కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ అతిపెద్ద కుటుంబంగా ఆవిర్భవించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇదే నిజమైన నివాళి అని అన్నారు.


మరణం లేని మహానేత : పురందేశ్వరి

విజయవాడ(పటమట), జనవరి 18(ఆంధ్రజ్యోతి): జననమే తప్ప మరణం లేని మహానాయకుడు ఎన్టీఆర్‌ అని ఆయన కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే లక్ష్యంతో జనతా వస్త్రాలు, రూ.2లకే కిలో బియ్యం, పక్కా గృహాలు అందించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాముడు, కృష్ణుడు అంటే ఇప్పటికీ ఎన్టీఆర్‌ గుర్తుండి పోతారని పేర్కొంటూ.. ఎప్పటికీ నీ కడుపునే పుట్టాలని ఉంది నాన్న’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్‌, కిలారు దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి తరానికి ఆదర్శం : పవన్‌ కల్యాణ్‌

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ నటుడుగా స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మొదలుతాయని, రాజకీయ నేతగా తలంపుకొస్తే ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా పవన్‌ ఒక ప్రకటన ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ‘సినీ, రాజకీయ రంగాల్లో బలీయమైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌ తెలుగు వారైనందుకు తెలుగువారందరికీ గర్వకారణం. ఆ మహాపురుషుడి వర్ధంతి సందర్భంగా నీరాజనాలర్పిస్తున్నాను. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం, ఆచరణీయం’ అని కొనియాడారు.

Updated Date - Jan 19 , 2025 | 06:00 AM