Hens: ఆ కోళ్లకు ఏమైంది?
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:55 PM
Chickens Incident గోదావరి జిల్లాలో ఇటీవల బర్డ్‌ఫ్లూ సోకి చాలా కోళ్లు మృతి చెందాయి. కానీ రణస్థలం మండలంలో మాత్రం గతేడాది నవంబరు నుంచీ తరచూ వందల సంఖ్యలో నాటుకోళ్లు, పెరటి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.
మృత్యువాత పడుతున్న నాటుకోళ్లు
ఆందోళనలో పెంపకందారులు
రణస్థలం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి):
రణస్థలం మండల కేంద్రానికి చెందిన యిజ్జిరోతు కోటేశ్వరరావు ఇంట్లో పెంచుకున్న కోళ్లకు ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇటీవల ఒకేసారి మృత్యువాత చెందాయి. గతంలో కునుకు జబ్బుతో కోళ్లు చనిపోయేవి. కానీ ఇప్పుడు కారణం తెలియకుండానే ఒకేసారి కోళ్లు మృత్యువాత చెందాయని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.....................
జేఆర్ పురం పరిధిలో ఓ పెంట గుమ్ముల వద్ద ఉన్న కోళ్లు ఇటీవల ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాయి. అవి పాముకాటుకు గురైనట్టు అంతా భావించారు. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారణం తెలియక పెంపకందారులు బాధపడుతున్నారు.
...............
లావేరు మండలంలో అగ్రహారం గ్రామానికి చెందిన రమణకు కోళ్ల పెంపకం అంటే ఆసక్తి. తాను పెంచుకున్న నాటుకోళ్లు ఇటీవల అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పగలంతా మేత కోసం బయటకు వెళ్లిన కోళ్లు.. రాత్రి సమయంలో ఒక్కసారిగా మృతి చెందుతున్నాయని వాపోతున్నాడు.
...............
గోదావరి జిల్లాలో ఇటీవల బర్డ్‌ఫ్లూ సోకి చాలా కోళ్లు మృతి చెందాయి. కానీ రణస్థలం మండలంలో మాత్రం గతేడాది నవంబరు నుంచీ తరచూ వందల సంఖ్యలో నాటుకోళ్లు, పెరటి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం అనేది సాధారణ ప్రక్రియ. గతంలో ప్రతి ఇంట్లో కోళ్లు పెంచేవారు. ఇప్పుడు క్రమేపీ తగ్గినా.. కొంతమంది మాత్రం ఉపాధి మార్గంగా కోళ్ల పెంపకం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నాటుకోళ్లకు డిమాండ్ ఎక్కువ. ఒక్కో కోడి కిలో రూ.400కుపైగా పలుకుతుండడంతో చాలా మంది వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. కాగా.. ఇటీవల తెలియని వ్యాధికి గురై కోళ్లు మృత్యువాతపడుతుండడంతో వాటికి ఏమైందోనని పెంపకందారులు కలవరపడుతున్నారు. సాధారణంగా కునుకు వ్యాధితో కోళ్లు మృత్యువాత పడడం సహజం. అలాగే చనిపోయి ఉంటాయని పెంపకందారులు భావించారు. కానీ ఆ ఆనవాళ్లు లేకుండా మేత కోసం తిరుగాడే క్రమంలో చనిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలు, కాలుష్యం మూలంగా కోళ్లు అనారోగ్యానికి గురై ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
వరుసగా చనిపోతున్నాయి..
ఇటీవల మేము పెంచుకున్న కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు మేతకు వెళ్లి అక్కడే కన్ను మూస్తున్నాయి. అయితే పాముకాటుతో అని భావించాం. కానీ మా ప్రాంతంలో పదికిపైగా కోళ్లు ఒకేసారి మృతిచెందాయి. గతేడాది నవంబరు నుంచి ఇదే పరిస్థితి ఉంది. అధికారులు దృష్టిపెట్టాలి.
- టేకు లక్ష్మణరావు, కోళ్ల పెంపకందారుడు, రణస్థలం
బర్డ్ ఫ్లూ లేదు
జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది లేదు. నాటుకోళ్లు చనిపోవడం అక్కడ ఉన్న పరిస్థితులే కారణం కావచ్చు. పూర్తిస్థాయి విచారణ చేపడతాం. నాటు కోళ్లు విషయంలో పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిపై అవగహన కల్పిస్తాం. ప్రజలు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
- దుర్గారావు, పశుసంవర్థక శాఖ ఏడీ, రణస్థలం
Updated Date - Feb 16 , 2025 | 11:56 PM