Ganjai Smuggling: గంజాయి.. గుట్టురట్టు
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:14 AM
Cannabis Smuggling పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లా మీదుగా గంజాయి ముంబై, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం గంజాయి ముఠా సభ్యులు రైల్వే మార్గాన్ని ఎంచుకున్నారు.
పోలీసులు దాడులు చేస్తున్నా.. ఆగని అక్రమ రవాణా
ఒడిశా నుంచి జిల్లా మీదుగా ముంబై, తమిళనాడుకు తరలింపు
పలాస, మందస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో పట్టుబడిన నిల్వలు
మొత్తంగా ఏడుగురు అరెస్టు..
పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లా మీదుగా గంజాయి ముంబై, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం గంజాయి ముఠా సభ్యులు రైల్వే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రైల్వేస్టేషన్లల్లో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఉదయం పలాస, మందస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో గంజాయి నిల్వలు పట్టుబడ్డాయి. మొత్తంగా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో గంజాయి నివారణకు చర్యలు చేపడుతున్నామని, ముఠా సభ్యులు వదిలిపెట్టేది లేదంటూ కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు స్పష్టం చేశారు.
పలాస, హరిపురం, ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం మూడు గంటల వ్యవధిలో రెండు వేర్వేరు కేసులకు సంబంధించి 11 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఒడిశా వాసులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా ముంబైలో ఉన్న గంజాయి కొనుగోలుదారుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో.. ఒడిశా రాష్ట్రం పట్టుపుర్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన విక్రమ్ మండల్, సునందన్‌సబర్‌లు 8 కిలోల గంజాయి ప్యాకెట్లను ముంబై తరలిస్తుండగా సాధారణ తనిఖీల్లో ఉన్న కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణకు పట్టుబడ్డారు. దీనిపై సీఐ ఆరా తీయగా.. ‘ఒడిశా రాష్ట్రం బురైపహడా గ్రామానికి చెందిన జోరషిమాన్ (గంజాయి పండించిన వ్యక్తి) వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేశాం. ముంబైలో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన జాఫర్‌కు గంజాయి అందిస్తుంటాం. అక్కడ తమకు డబ్బులు ఇస్తార’ని విక్రమ్ మండల్, సునందన్‌సబర్ తెలిపారు. ఈ మేరకు వారిద్దరి కోసం కూడా గాలిస్తున్నామని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.
అదే రోడ్డులో తనిఖీలు ముమ్మరం చేయగా.. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గండాహతి(ఒడిశా) గ్రామానికి చెందిన గౌరవ్‌పొరిచ్ఛా, హైదరాబాద్‌లో ఉంటున్న గంగవైన ఉదయ్‌కుమార్ మూడు కిలోల గంజాయి లగేజీ బ్యాగులో వేసుకొని వెళ్తుండగా సీఐ సూర్యనారాయణకు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేయగా ఈ కేసుకు సంబంధించి మెయిన్, చింటూ అనే వ్యక్తులు పరారీ అయ్యారు. వీరంతా గంజాయి సేవిస్తూ అదే గ్రామంలో ఉండే సబీర్ అనే వ్యక్తితో పరిచయమయ్యారు. సబీర్ గంజాయి పండిస్తు విక్రయిస్తుంటాడు. ఆయన వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ప్యాకెట్లుగా విక్రయిస్తామని నిందితులు తెలిపారు.
డీఎస్పీ మాట్లాడుతూ ‘ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీములను ఏర్పాటు చేశాం. గంజాయి లేని జిల్లాగా తీర్చిదిద్దుతాం. గంజాయి సేవించినా, అమ్మినా, పండించినా నేరం. అటువంటి వారిని విడిచిపెట్టేది లేదు’ అని తెలిపారు. గంజారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ సూర్యనారాయణ, పోలీసులను ఆయన అభినందించారు.
మందస రైల్వేస్టేషన్‌లో.. తమిళనాడు ముఠా
మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్, సీఐ తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. ఈక్రమంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు ముఠా సభ్యులు మైఖేల్, రాజరాజన్‌లు 2.6 కిలోల గంజాయితో పట్టుబడ్డారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల నిఘా పెంచటంతో గంజాయి ముఠా సభ్యులు రూటు మార్చారు. చిన్న రైల్వేస్టేషన్లు లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. దీంతో ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ముఠాసభ్యులు రైలు ద్వారా తమిళనాడుకు తరలించేందుకు మందస రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు దాడులు చేసి చాకచక్యంగా వారిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితులపై ఎన్‌పీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇచ్ఛాపురంలో..
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా చుడంగపూర్‌కు చెందిన మిలన్ పరిచ్చా.. ముంబైకి 6.22 కిలోల గంజాయి తరలిస్తూ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డాడని కాశీబుగ్గ డీఎస్పీ పి.వెంకట అప్పారావు తెలిపారు. మిలన్ పరిచ్చా శనివారం ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయితో బస్సులో బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ నుంచి గంజాయి మూటలతో బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అనుమానస్పదంగా కనిపించటంతో తనిఖీలు చేయగా అతను వద్ద ఉన్న గంజాయిని గుర్తించి సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిని ముంబైలో ఉన్న ప్రేమానంద్‌కు అందించేవాడని.. ఒకసారి గంజాయి తీసుకెళ్తే రూ.5వేలు ఇచ్చేవాడని.. తమ దర్యాప్తులో తేలిందన్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నమనాయుడు, ఎస్సై ముకుందరావు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 12:14 AM