Temparature : మార్చిలోనే భగభగలు
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:15 PM
March heatwave జిల్లాలో మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. పేదల ఊటీగా పేరుగాంచిన జిల్లాలో వడగాల్పులు ఆరంభమయ్యాయి. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలతో జిల్లావాసుల బెంబేలు
పొందూరులో 38 డిగ్రీలు దాటేసిన వైనం
వడగాల్పులుంటాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరిక
శ్రీకాకుళం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. పేదల ఊటీగా పేరుగాంచిన జిల్లాలో వడగాల్పులు ఆరంభమయ్యాయి. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదేరీతన వడగాల్పులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరికలు జారీచేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పొందూరు మండలంలో గురువారం 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఏడు మండలాల్లో..
జిల్లాలో ఏడు మండలాల్లో వడగాల్పులు వీచాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రానికి కాస్త చల్లగాలులతో కాస్తంత ఉపశమనం లభిస్తోంది. పగటిపూట మాత్రం భానుడి ప్రతాపంతో తట్టుకోలేని పరిస్థితి. అలాగే శుక్రవారం 9 మండలాల్లో, శనివారం 5 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. గురువారం ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, గార, ఎల్‌ఎన్ పేట, పొందూరు, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా వడగాల్పులు వీచాయి.
ప్రతిఏటా మే నెలలో..
ప్రతిఏటా మే నెలలో భానుడి భగభగలు ఉండేవి. అంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యేవి. ఇప్పుడు మార్చి నెలలోనే మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లపై ప్రజలు తిరగలేక పోతున్నారు. ఎండవేడిమిని తట్టుకోలేక.. వేగంగా పనిముగించుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు. వాతావరణంలో గాలి వేడెక్కడంతో వడగాల్పులు అంతటా వీస్తున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎలా భరించాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లలో చెట్లను నరికివేయడం.. నీటిని ఆదా చేయకపోవడం.. పైగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. -5శాతం వర్షపాతం.. వంటి కారణాలతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు..
.............................................
మండలం ఉష్ణోగ్రత
.............................................
ఆమదాలవలస 36.8
బూర్జ 37.1
ఎచ్చెర్ల 35.8
జి.సిగడాం 35.1
గార 35.9
హిరమండలం 36.9
ఇచ్ఛాపురం 33.9
జలుమూరు 35.3
కంచిలి 33.6
కవిటి 32.4
కోటబొమ్మాళి 32.8
కొత్తూరు 36.0
లావేరు 36.7
ఎల్.ఎన్.పేట 37.1
మందస 33.3
మెళియాపుట్టి 37.0
నందిగాం 33.3
నరసన్నపేట 35.4
పలాస 33.3
పాతపట్నం 35.1
పోలాకి 33.6
పొందూరు 38.3
రణస్థలం 36.1
సంతబొమ్మాళి 32.8
సారవకోట 37.0
సరుబుజ్జిలి 37.1
సోంపేట 37.1
శ్రీకాకుళం 35.2
టెక్కలి 32.5
వజ్రపుకొత్తూరు 33.3
Updated Date - Mar 06 , 2025 | 11:15 PM