Dolotsavam భక్తుల ఇలవేల్పు.. వల్లభ నారాయణుడు
ABN, Publish Date - Mar 08 , 2025 | 11:55 PM
Dolotsavam భక్తుల ఇలవేల్పు.. నూతన జంటల కోర్కెలు తీర్చే కొంగు బంగారం వల్లభ నారాయణుడు. మందస మండలం తీర ప్రాంతంలోని రట్టిలో కొలువైన వల్లభ నారాయణ స్వామి డోలోత్సవాలు ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
నేటి నుంచి 14 వరకు రట్టిలో డోలోత్సవాలు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హరిపురం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): భక్తుల ఇలవేల్పు.. నూతన జంటల కోర్కెలు తీర్చే కొంగు బంగారం వల్లభ నారాయణుడు. మందస మండలం తీర ప్రాంతంలోని రట్టిలో కొలువైన వల్లభ నారాయణ స్వామి డోలోత్సవాలు ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి యేటా ఫాల్గుణ మాసం శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు నిర్వహిం చడం ఇక్కడి ఆనవాయితీ. చరిత్రకారుల కథనం మేరకు దేవతలు నిర్మించినట్టు చెబుతున్న ఈ పురాతన ఆలయంలో శిల్ప సౌందర్యం ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఆలయం 218 ఏళ్ల క్రితం నిర్మితమైనట్టుగా ఇక్కడి కట్టడాల ద్వారా తెలుస్తోంది.
గరుడ స్తంభం విశిష్టత..
ఇక్కడి గరుడ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి.. చివరిగా రట్టి వల్లభనారాయణ స్వామి దర్శనంతో సంపూర్ణ యాత్ర ముగిస్తారు. ఒడిశా, కోల్‌కతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడి యాత్రలో పాల్గొనటం విశేషం. జీవనోపాధి కోసం వలస పోయిన ఈ ప్రాంత ప్రజలు యాత్రలో పాల్గొనేందుకు స్వగ్రామాలకు చేరుకుంటారు. వల్లభనారాయుడికి మట్టి కలశంతో అమృత ప్రసాదం తయారుచేసి దర్శించుకున్న తరువాత గరుడ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటారు. అనంతరం సముద్ర స్నానాలా చరించి.. ఆలయ సమీపంలోని తోటల్లో వంటలు చేసుకొని దైవప్రసాదంగా స్వీకరించి ఉత్సవాలను ముగిస్తారు. వల్లభనారాయణ స్వామివారి డోలోత్సవాలు ఈనెల 9న ఆది వారం రాత్రి 9 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 14న శుక్రవారం పౌర్ణమి రోజున డోలోత్సవాలు, కోలసేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రత్యేక ఏర్పాట్లు..
భక్తుల సౌకర్యార్థం దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవాలయ ఇన్‌చార్జి ఈవో వాసుదేవరావు తెలిపారు. మంచినీటి సదుపాయంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. భక్తులకు ప్రత్యేక క్యూలైన్లతో పాటు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. హరిపురం-బాలిగాం కూడలి నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
Updated Date - Mar 08 , 2025 | 11:55 PM