Ganjai : గంజాయి రహితం సాధ్యమేనా?
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:59 PM
Drug Control ఒక్క పలాస డివిజన్‌లోనే రెండు రోజుల్లో భారీగా గంజాయి పట్టుబడడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా స్మగ్లర్లు రైళ్లలో గంజాయిని రవాణా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లా నుంచి యథేచ్ఛగా తరలింపు
రైల్వేస్టేషన్లనే కేంద్రంగా చేసుకుంటున్న ముఠా
భారీగా పట్టుబడుతున్న సరుకు
అధికంగా పలాస డివిజన్‌లోనే
పలాస, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 14న ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న 18.3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసినట్లు ఇద్దరు నిందితులు చెప్పారు. వారు బస్సులో బరంపురం మీదుగా ఇచ్ఛాపురం బస్టాండ్ చేరుకున్నారు. ఇక్కడి బెంగళూరు వెళ్లేందుకు స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకోగా పోలీసులు పట్టుకున్నారు.
............
ఈ నెల 14న కంచిలి రైలు నిలయం సమీపంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు అందిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
............
ఈ నెల 15న పలాస, మందస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లలో 20 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసిన వ్యక్తులు బెంగళూరు, ముంబై, తమిళనాడు, హైదరాబాద్‌కు తరలించేందుకు పైన చెప్పిన రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో గంజాయి బయటపడింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.
.................
..ఇలా ఒక్క పలాస డివిజన్‌లోనే రెండు రోజుల్లో భారీగా గంజాయి పట్టుబడడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా స్మగ్లర్లు రైళ్లలో గంజాయిని రవాణా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వీరంతా ఒడిశాలో సరుకును కొనుగోలు చేసి జిల్లాలోని రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి ఏ బ్యాగు తనిఖీ చేసినా అందులో గంజాయి దొరుకుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గంజాయి రవాణాను అడ్డుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో గంజాయి రహిత జిల్లా సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఒడిశాలో సాగు..
ఒడిశా రాష్ట్రంలోని మోహన, ఆర్.ఉదయగిరి బ్లాక్‌ల్లో ఉన్న కొండల్లో గంజాయిని ఎక్కువగా పండిస్తున్నారు. ఈ కొండల పైకి ఆ ప్రాంతీయులు తప్ప ఇతరులు వెళ్లడానికి సాహసించరు. ఈ కారణంగానే ఏటా గంజాయి వందల హెక్టార్లల్లో పండిస్తుంటారు. సాధారణ పంటలు పండిస్తే రూ.40 నుంచి రూ.50 వేలకు మించి రాబడి రాదు. అదే గంజాయి అయితే మార్కెట్ బట్టి ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం సమకూరుతుంది. అందుకే గంజాయి అమ్మకందారులు సాగుదారులకు బయానాలు(అడ్వాన్స్) ఇచ్చిమరీ గంజాయి పండిస్తుంటారు. ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో గంజాయి పండించి వాటిని ఆరబెట్టి చెక్కిలుగా చేస్తారు. వేసవిలో ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తుంటారు.
పలాస మీదుగా రవాణా..
పలాసకు ఆనుకొని ఒడిశా ప్రాంతం అధికంగా ఉంది. దీంతో రైలు,రోడ్డు మార్గాల ద్వారా గంజాయిని రవాణా చేయడం సులభంగా మారింది. అధికంగా పలాస ప్రాంతం మీదుగా ముంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలుతోంది. అస్కా మీదుగా బరంపురం, పర్లాకిమిడి-గొప్పిలి మీదుగా పలాస వచ్చి అక్కడ నుంచి రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారు. గతంలో రోడ్డు మార్గాల్లో రవాణా చేసేవారు. అయితే, ఈ మార్గాల్లో పోలీసులు నిఘా పెట్టడంతో గంజాయి ముఠా సభ్యులు రూటు మార్చారు. రైల్వే స్టేషన్లకు చేరుకుని లగేజి బ్యాగుల్లో ఎవరికీ తెలియకుండా గంజాయి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా వలస కార్మికులే ఉండడంతో పోలీసులకు సైతం అనుమానం రాదు. దీన్నే రవాణా వస్తువులుగా ఎంచుకొని గంజాయి రవాణా చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. సీలేరు, అనకాపల్లి అల్లూరి జిల్లా, పాడేరు మన్యం నుంచి గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది. ఆ తరువాత స్థానం శ్రీకాకుళం జిల్లా కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో గంజాయి పండించే వారు పూర్తిగా లేకపోయినా, ఒడిశా రాష్ట్రం నుంచి మన జిల్లా మీదుగా రవాణా జరుగుతుండడంతో అధికారులపై సైతం వత్తిడి పెరుగుతోంది.
ఎస్పీ ఆదేశాలు..
గంజాయి రహిత జిల్లాగా చేయాలని ఇప్పటికే ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనేక ముఖ్య ప్రాంతాల్లో చెక్ గేట్లు పెట్టడంతో పాటు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల గంజాయి రవాణా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. కానీ, కొన్నిరోజులుగా గంజాయి ముఠా మళ్లీ రెచ్చిపోతుంది. ప్రధానంగా పలాస డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్ల ద్వారా ఇతర ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తున్నారు. ప్రతిరోజూ గంజాయి పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఒడిశా తీరంతో పాటు గొప్పిలి, చీకటి, పర్లాకిమిడి-వసుంధర, పర్లాకిమిడి-పాతపట్నం, బురుజోల, బాతుపురం వంటి ఒడిశా-ఆంధ్రా భూభాగాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు కఠిన నిబంధనలు అమలు చేస్తేనే గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడనుంది.
గంజాయిపై ఉక్కుపాదం
గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. నిబంధనలు మరింత కఠినం చేస్తాం. గంజాయి తాగినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం. గంజాయి వినియోగించిన వారిపై ప్రజలు మాకు సమాచారం అందించాలి.
- వి.వెంకటఅప్పారావు, డీఎస్పీ, కాశీబుగ్గ
నరసన్నపేటలో 9 మంది అరెస్టు
నరసన్నపేట, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో శనివారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలుదారులపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఓ ఇంటిలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేశామన్నారు. రూ.66 వేలు విలువ చేసే సుమారు 22 కేజీల గంజాయితోపాటు రెండు బైక్‌లు, 9సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు.
Updated Date - Feb 16 , 2025 | 11:59 PM