ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక లారీలతో రోడ్లు ఛిద్రం

ABN, Publish Date - Jan 23 , 2025 | 12:13 AM

పదిటైర్లు, పన్నెండు టైర్ల ఇసుక లారీలు అధిక లోడుతో తోట్లవల్లూరు మండలంలో యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి దెబ్బకు కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లు, వంతెనలు ధ్వంసమైపోతున్నాయి. లారీల క్యాబిన్‌ దాటి కొండలాగా పోసుకుని వస్తున్న ఇసుక లారీలను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. అధిక లోడును అడ్డుకోవాల్సిన ఆర్టీవో అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

అధిక లోడుతో యథేచ్ఛగా రాకపోకలు

-పదిటైర్ల లారీ సామర్థ్యం 18 టన్నులే..

-22 టన్నుల అధిక లోడుతో వస్తున్నా పట్టించుకోని అధికారులు

-ఇసుక లారీలపై నిషేధం విధించిన రొయ్యూరు పంచాయతీ

-అన్ని క్వారీల లారీలు తోట్లవల్లూరు రోడ్డు నుంచే..

- దెబ్బతింటున్న కోట్ల రూపాయలతో వేసిన రోడ్లు, వంతెనలు

పదిటైర్లు, పన్నెండు టైర్ల ఇసుక లారీలు అధిక లోడుతో తోట్లవల్లూరు మండలంలో యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి దెబ్బకు కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లు, వంతెనలు ధ్వంసమైపోతున్నాయి. లారీల క్యాబిన్‌ దాటి కొండలాగా పోసుకుని వస్తున్న ఇసుక లారీలను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. అధిక లోడును అడ్డుకోవాల్సిన ఆర్టీవో అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు):

తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, నార్తువల్లూరులో ప్రభుత్వ ఇసుక క్వారీలున్నాయి. నార్త్‌వల్లూరు క్వారీ స్టాక్‌ పాయింట్‌ వల్లూరుపాలెంలో ఏర్పాటు చేశారు. పక్కనే కంకిపాడు మండలం మద్దూరు ప్రభుత్వ క్వారీ ఉంది. లంకపల్లి, శ్రీకాకుళం క్వారీలున్నాయి. రివర్‌ కన్జర్వెన్సీ(ఆర్సీ) నిబంధనల ప్రకారం తీర గ్రామాల రక్షణ కోసం నిర్మించిన కరకట్టపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. క్వారీ నుంచి వచ్చే ఇసుక లారీ కరకట్ట ఎక్కి ఆ గ్రామంలోకి ప్రవేశించి వెళ్లాలి. అంతే తప్పా కరకట్టపై కిలోమీటర్ల మేర ఇతర గ్రామాలకు ప్రయాణించకూడదని, దానివల్ల కరకట్ట బలహీనపడి తీర గ్రామాల రక్షణకు ప్రమాదమేర్పడుతుందని ఆర్సీ చట్టం చెపుతోంది. అయితే అందుకు విరుద్ధంగా ఇసుక లారీలలో దాని సామర్థ్యానికి మించి జరుగుతున్న ఇసుక రవాణాతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు పాడైపోవడం, వంతెనలు దెబ్బతినడం జరుగుతోంది. పదిటైర్లు, పన్నెండు టైర్ల ఇసుక లారీలు కరకట్టపై రాకపోకలు సాగిస్తుండటంతో అనేకచోట్ల కరకట్ట తారురోడ్డు ఛిద్రమై గోతులమయంగా తయారయింది.

రొయ్యూరులోకి భారీ వాహనాలపై నిషేధం :

మద్దూరు, రొయ్యూరు, వల్లూరుపాలెం స్టాక్‌ యార్డుల నుంచి ఇసుక లోడింగ్‌ చేసుకున్న లారీలన్నీ కరకట్టపై ప్రయాణించి తోట్లవల్లూరు గ్రామంలో నుంచి ఉయ్యూరు వైపుకి వెళుతున్నాయి. ఏనుగులకోడు డ్రెయిన్‌పై వంతెన బలహీనంగా ఉందని, రూ.3 కోట్లతో నిర్మించి రోడ్డు దెబ్బతింటుందని రొయ్యూరులోకి ఇసుక లారీలు రాకుండా ఆ గ్రామ పంచాయతీ నిషేధం విధించింది. రొయ్యూరులో క్వారీ, స్టాక్‌యార్డు ఉన్నప్పటికీ ఆ గ్రామంలోకి ఇసుక లారీలను ఆ గ్రామపంచాయతీ రాకుండా నిషేధం విధించటంతో ఆ లారీలు తోట్లవల్లూరు వస్తున్నాయి. తోట్లవల్లూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు మూడు కిలోమీటర్ల పొడవునా పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు దీనికి రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ప్యాచ్‌ వర్కులను చేయిస్తున్నారు.

పరిమితిదాటి లోడింగ్‌

పదిటైర్ల లారీ సామర్థ్యం 18 టన్నులు మాత్రమే. పన్నెండు టైర్ల లారీ సామర్థ్యం సుమారు 20 టన్నులు. కాని పదిటైర్ల లారీలోనే 40 టన్నుల ఇసుకను, పన్నెండు టైర్ల లారీలో 45 టన్నుల ఇసుకను కొండలా నింపి మచిలీపట్నం పోర్టుకు పంపుతున్నారు. లారీ సామర్థ్యానికి మించి 22 టన్నుల ఇసుక అదనంగా లోడింగ్‌ చేసుకు వస్తున్నా నియంత్రించే వారు. దీంతో రహదారులకు కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. ప్రతిరోజు వందల లారీలు నిత్యం కరకట్టపై కిలోమీటర్ల మేర ప్రయాణించి తోట్లవల్లూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు మీదుగా మచిలీపట్నం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తోట్లవల్లూరు కేఈబీ కెనాల్‌పై వంతెన అప్రోచ్‌ రోడ్డు కుంగిపోయింది. రిటైనింగ్‌వాల్‌ కూలిపోయింది.

పట్టించుకోని అధికారులు

బైక్‌లపై ముగ్గురు ప్రయాణించినా, ఆటోలో ఐదుగుకి కంటే ఎక్కువమంది ప్రయాణించినా కేసులు నమోదు చేసి జరిమానాలను విధిస్తున్న రవాణాశాఖ అధికారులు, పోలీసులు ఓవర్‌ లోడు ఇసుక లారీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లారీలకు ఎందుకు జరిమానాలు వేయరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లారీల వల్ల రహదారులు పాడైపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే చోద్యం చూడటం తగదని అంటున్నారు.

20 టన్నులు దాటితే రోడ్లు దెబ్బతింటాయి

ఆర్‌అండ్‌బీ రోడ్లు 20 టన్నుల బరువు వాహనాలను మాత్రమే తట్టుకోగలవు. ఆపై అధిక బరువు గల వాహనాలు తిరిగితే రోడ్లు పాడైపోతాయి. 40 టన్నులకు పైగా బరువుతో ఇసుక లారీలు తిరగటం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి.

-మల్లిఖార్జున్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ

Updated Date - Jan 23 , 2025 | 12:13 AM