Telugu protection : తెలుగు మూలాలను చెప్పాలి
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:29 AM
మాతృభాషపై పట్టు ఉంటేనే మిగిలిన భాషలు సులభంగా నేర్చుకోవచ్చు. పిల్లలకు తెలుగు భాషా మూలాలను తెలియజెప్పాలి. జాతీయ విద్యావిధానంలో కూడా మాతృభాషలకే కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. తెలుగుభాష పరిరక్షణకు కూటమి
మాతృభాషపై పట్టు ఉంటేనే మిగిలిన భాషలు
ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు
త్వరలో సాంస్కృతిక పర్యాటకం: మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం/రాజానగరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘మాతృభాషపై పట్టు ఉంటేనే మిగిలిన భాషలు సులభంగా నేర్చుకోవచ్చు. పిల్లలకు తెలుగు భాషా మూలాలను తెలియజెప్పాలి. జాతీయ విద్యావిధానంలో కూడా మాతృభాషలకే కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. తెలుగుభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో గురువారం వర్సిటీ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ‘తెలుగుభాష మూలాలను పిల్లలకు వివరించడం ద్వారా తెలుగు భాషను కాపాడుకోవాలి. భాష వల్ల జాతి పుడుతుంది. జాతిని అభివృద్ధి చేసుకోవాలంటే భాషను అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వ విధానాలు కూడా మారాలి. తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. తెలుగుభాష పట్ల పిల్లలకు మక్కువ కలిగించాలి. దురదృష్టవశాత్తూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని అన్నారు.
త్వరలో తెలుగు మాండలికాల గ్రంథస్థం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారని, కిందిస్థాయి నుంచి తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టడం కోసం త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు మాండలికాలను సేకరించి గ్రంథస్తం చేయించి భావితరాలకు అందిస్తామని చెప్పారు. తెలుగునాటక రంగాన్ని కాపాడతామని, నంది నాటకాలు ప్రారంభించి, పౌరాణిక నాటకాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలో కాళీపట్నం రామారావు కథా నిలయం, తెలుగుభాష కోసం కృషిన సీపీ బ్రౌన్ పేరిట రాజమహేంద్రవరంలో సన్నిధానం శాస్ర్తి మందిరం నడుపుతున్నారని, ఇంకా వివిధ ప్రాంతాల్లోని ప్రసిద్ధ గ్రంథాలయాలను అధ్యయనం చేయడానికి ‘సాంస్కృతిక పర్యాటకం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఆంగ్ల భాష అవసరమూ ఉంది.. కానీ: పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగుభాష, సంస్కృతి, చరిత్రను భావితరాలకు అందించాలన్నారు. కేంద్ర విద్యావిధానంలో మాతృభాషకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపారు. భారతదేశంలో తెలుగుతో పాటు కేవలం ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించిందన్నారు. ప్రపంచంలో ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగుకు 15వ స్థానం ఉండగా.. మన దేశంలోని భాషల్లో తెలుగుకు నాల్గవ స్థానం ఉందన్నారు. తారక రామారావు సీఎంగా ఉండగా తెలుగులోని ఉత్తర్వులు ఇవ్వాలనే ఆదేశించారని, ఇవాళ మళ్లీ అటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు.
ఏటా తెలుగు సభల సంక్రాంతి: జీజీయూ కులపతి చైతన్యరాజు
గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో తెలుగు సభల సంక్రాంతిని ప్రతి ఏడాదీ నిర్వహిస్తామని జీజీయూ చాన్సలర్, చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ప్రకటించారు. తెలుగు భాషను ప్రోత్సహించాలని, 1 నుంచి 5 వరకు తరగతులు తెలుగు మాధ్యమంలోనే బోధించాలని, డిగ్రీ వరకు అభ్యసించే విద్యార్థులకు ఏ మాధ్యమంలో చదివినా తెలుగుకు అదనంగా పది మార్కులు వేస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని.. ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానించినట్టు చెప్పారు. సిలికాన్ మన బడి, ఆస్ట్రేలియా తెలుగు సంఘంతో కూడా జీజీయూ అవగాహన ఒప్పందం చేసుకుంటుందన్నారు. తెలుగు భాష ఔన్నత్యానికి సాధ్యమైనంత మేర శాయశక్తులా తాము కృషి చేస్తామని ప్రకటించారు.
తెలుగమ్మాయిలు పరికిణీలు పక్కన పడేశారు!
గోనె సంచుల్లా పంజాబీ డ్రెస్‌లు దిగేస్తున్నారు
మాడుగుల నాగఫణి శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలుగమ్మాయిలు పరికిణీలు, పావడాలు వదిలేసి గోనెసంచుల్లా పంజాబీ డ్రెస్‌లు దిగేస్తున్నారని ద్విసహస్రావధాని మాడుగుల నాగ ఫణి శర్మ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన గురువారం మాట్లాడారు. తెలుగుభాష, సంస్కృతిని వివరించే సమయంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుభాష అభివృద్ధికి తన చేత అనేక కార్యక్రమాలు అమలు చేయించారని చెప్పారు. కవి, గేయరచయిత అందెశ్రీ మాట్లాడుతూ తెలుగు భాషకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో తాను మరేభాషనూ నేర్చుకోలేదన్నారు. ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మానవత్వం కొరవడుతోందని, మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు అనే పాటను ఆలపిస్తూ అందరి హృదయాలను కదిలించారు.
Updated Date - Jan 10 , 2025 | 05:29 AM