సీపీఎం సారథిగా వీఎస్‌ఆర్
ABN, Publish Date - Feb 04 , 2025 | 01:37 AM
సీపీఎం రాష్ట్ర సారథ్యం మరోసారి జిల్లాకు చెందిన వి.శ్రీనివాసరావుకు దక్కింది. వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర 27వ మహాసభల ముగింపు సందర్భంగా సోమవారం పార్టీ నూతన రాష్ట్ర నాయకత్వ ఎన్నిక జరిగింది.
రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా జిల్లావాసి
కీలక స్థానాల్లో ఉమ్మడి జిల్లా నేతలు
ఒంగోలు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : సీపీఎం రాష్ట్ర సారథ్యం మరోసారి జిల్లాకు చెందిన వి.శ్రీనివాసరావుకు దక్కింది. వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర 27వ మహాసభల ముగింపు సందర్భంగా సోమవారం పార్టీ నూతన రాష్ట్ర నాయకత్వ ఎన్నిక జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పలు ప్రజాసంఘాలలో పనిచేసే కీలక నేతలు మొత్తం 49 మందితో రాష్ట్ర కమిటీ, వారిలో 15 మందితో కార్యదర్శివర్గం ఏర్పాటైంది. ఆ కమిటీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లాలోని మర్రిపూడి మండలం కెల్లంపల్లికి చెందిన శ్రీనివాసరావు విద్యార్థి దశ నుంచి సీపీఎంలో పనిచేస్తున్నారు. నెల్లూరు, కావలిలో చదువుతూ సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో క్రియాశీలకంగా నెల్లూరు జిల్లాలో వ్యవహరించారు. అనంతరం యువజన సంఘమైన డీవైఎఫ్‌ఐలోనూ అదే జిల్లాలో పనిచేశారు. డీవైఎఫ్‌ఐలో రాష్ట్ర, జాతీయ నేతగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుసంఘం ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం కొనసాగారు. ఆసమయంలో రైతు సంఘ నేతగా గుర్తింపు పొందారు. సీపీఎం జాతీయ కమిటీలోనూ పనిచేసిన వీఎస్‌ఆర్ రాష్ట్ర విభజన అనంతరం తిరిగి ఏపీకి వచ్చి క్రియాశీలకంగా పనిచేశారు.
తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో..
2021 మార్చిలో తాడేపల్లిలో జరిగిన పార్టీ 26వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా శ్రీని వాసరావు ఎన్నికయ్యారు. తీవ్రప్రతికూల రాజ కీయ పరిస్థితులలో ఉన్న సీపీఎం ఉనికిని నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషిచేసిన ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత నిరాడంబరంగా ఉంటారు. నెల్లూరులో తాజాగా జరిగిన 27వ రాష్ట్ర మహాసభలో తిరిగి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన్ను పార్టీ నేతలు ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నేతలు కీలక స్థానాలకు ఎన్నికయ్యారు. అద్దంకి నియోజకవర్గానికి చెందిన డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, పర్చూరు నియోజకవర్గానికి చెందిన వి.కృష్ణయ్యలు 15మందితో కూడిన రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఎన్నికయ్యారు. సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, కొండపికి చెందిన కేవీపీఎస్ నేత అండ్ర మాల్యాద్రి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. సోమవారం నెల్లూరులో జరిగిన సీపీఎం ర్యాలీ, సభకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఆ పార్టీశ్రేణులు తరలివెళ్లాయి.
Updated Date - Feb 04 , 2025 | 02:04 AM