వెలిగొండ కదిలింది
ABN, Publish Date - Jan 23 , 2025 | 02:27 AM
వెలిగొండపై కదలిక వచ్చింది. కీలకమైన పనులు ప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఎక్కడి పనులు అక్కడ ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నామంటూ జగన్మోహన్‌రెడ్డి హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించారు.
సీఎం ఆదేశాలతో పనులు పునఃప్రారంభం
మంత్రుల పర్యటన తర్వాత కీలక అంశాలపై దృష్టి
రెండో టన్నెల్‌లో గ్యాంట్రీ విధానంలో లైనింగ్
ఫీడర్ కాలువలో 16 కి.మీ లైనింగ్‌కు రూ.206 కోట్లతో ప్రతిపాదనలు
మరో ఆరు కిలోమీటర్ల మట్టికట్ట పటిష్టతపై సర్వే
కంభం ఎస్‌డీసీ పరిధిలో పునరావాస చర్యలకు రూ.80కోట్లు
వచ్చే ఏడాది జూన్ నాటికి పనుల పూర్తి లక్ష్యం
వెలిగొండపై కదలిక వచ్చింది. కీలకమైన పనులు ప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఎక్కడి పనులు అక్కడ ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నామంటూ జగన్మోహన్‌రెడ్డి హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పుడు పూర్తిచేస్తాం.. ఇప్పుడు పూర్తిచేస్తాం అని ఆర్భాటపు ప్రకటనలు చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించి వెలిగొండ పెండింగ్ పనులను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.
ఒంగోలు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలినెలలోనే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష చేసినప్పుడు వెలిగొండపై సమగ్ర నివేదికతోపాటు పనుల పూర్తికి నిర్ధిష్ట ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆపై ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రాజెక్టును సందర్శించారు. మంత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులతో కలిసి టన్నెల్ తవ్వకాలు, ఫీడర్ కాలువలు, పునరావాస కాలనీలను చూశారు. అధికారులతో సమీక్ష చేశారు. 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులను రెండు దశల్లో పూర్తికి ఏడు ప్యాకేజీలతో చేపట్టారని అధికారులు ఆయనకు చెప్పారు. రూ.8,043కోట్లు మంజూరు కాగా రూ.6,059 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అందులో పనుల కోసం రూ.4,987 కోట్లు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, ఇతరత్రా మరో రూ.1,100 కోట్లు ఖర్చుచేశామన్నారు. మొత్తం ప్రాజెక్టు పూర్తికి మరో రూ.1,700 కోట్లు అవసరమవుతాయని మంత్రికి నివేదించారు. తద్వారా ప్రాజెక్టు వ్యయం రూ.9,741 కోట్లకు చేరుతుందని వివరించారు.
లోపభూయిష్టంగా పనులు
ప్రాజెక్టు నిర్మాణాల్లో కీలకమైన పనులు పూర్తయినప్పటికీ దాదాపు 15ఏళ్ల క్రితం చేయడం వల్ల 22.9 కిలోమీటర్ల ఫీడర్ కాలువల కట్టలు అనేకచోట్ల దెబ్బతిన్నాయి. భారీ రంధ్రాలు పడి వర్షపునీరు వాటి ద్వారా బయటకు రావడం, కొన్నిచోట్ల పూడిపోవడం, చిట్టడవిని తలపించేలా ఉండటాన్ని మంత్రులు గుర్తించారు. అలాగే టన్నెల్ల పనులు కూడా లోపభూయిష్టంగా దర్శనమిచ్చాయి ఒక్కొక్కటి 18.80 కి.మీ ఉండే ఏడు మీటర్లు ఒకటి, 9.20 మీటర్లు మరొకటి రెండు టన్నుళ్ల ఉన్నాయి. తొలి టన్నెల్ తవ్వకం గత టీడీపీ ప్రభుత్వంలోనే పూర్తికాగా రెండో దానిని కూడా రెండొంతులు తవ్వారు. తవ్వకం, లైనింగ్ ఒకేసారి టన్నెల్ బోర్ మిషన్ ద్వారా చేయాల్సి ఉండగా వైసీపీ హయాంలో మాన్యువల్‌గా చేపట్టారు. లైనింగ్ లేకుండా చేయడమే కాక తొలి, రెండో టన్నెల్‌కు మూడుచోట్ల భారీ రంధ్రాలు పెట్టారు. తవ్విన మట్టిని కూడా బయటకు కాకుండా కృష్ణానది వైపు హెడ్ రెగ్యులేటరీ సమీపంలో పోశారు. ఇలా అనేక అవకతవకలు, భవిష్యత్‌లో సమస్యలు తెచ్చే అవకాశం ఉన్న అంశాలను కూటమి మంత్రుల పరిశీలనలో గుర్తించారు.
కీలక పనులపై దృష్టి
గత ఏడాది నవంబరు రెండో వారంలో ఇలాంటి కీలక ప్రాజెక్టులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సందర్భంగా అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. వాటిపై స్పందించిన చంద్రబాబునాయుడు పనులు పూర్తికాకుండా నీరు ఇవ్వడం సరైంది కాదని గుర్తించారు. 2026 జూన్‌కు మొత్తం పనుల పూర్తి లక్ష్యంగా పెట్టుకొని నిర్ధిష్ట ప్రణాళికతో పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు నిర్వహించే మెగా కంపెనీ ప్రతినిఽధులతోనూ స్వయంగా మాట్లాడి తగు సూచనలు చేశారు. దీంతో వెలిగొండపై కదలిక వచ్చింది. కీలక మైన పెండింగ్ పనులు ముందుకు సాగాయి. ప్రధానంగా రెండో టన్నెల్‌లో లైనింగ్ పనులు డిసెంబరులో పునఃప్రారంభించారు. టీబీఎం లేకపోవడంతో గ్యాంట్రీ విధానంలో (కూలీలతో) లైనింగ్ చేస్తున్నారు. రెండు విభాగాలుగా ఈ పనులు చేపట్టగా ఒక్కో దానిలో 50 నుంచి 60 మంది కూలీలు పనులు చేస్తున్నారు. నెలకు ఒక్కో బృందం సగటున 150 మీటర్ల లైనింగ్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం రెండు విభాగాలుగా జరుగుతుండగా ఏప్రిల్ నుంచి మరో గ్యాంట్రీని కూడా ఏర్పాటు చేసి మూడింటి ద్వారా నెలకు 450మీటర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
రూ.206కోట్లతో ఫీడర్ కాలువల లైనింగ్ పనులు
కీలకమైన ఫీడర్ కాలువలపైనా అధికారులు దృష్టి సారించారు. టన్నెల్ నీరు బయటకు వచ్చే దోర్నాల మండలం కొత్తూరు నుంచి నల్లమల రిజర్వాయర్ వరకు కొండల అంచున దాదాపు 22కిలో మీటర్లు ఈ కాలువ ఉంది. అందులో 16 కి.మీ దూరం కొండల అంచున మట్టి తొలిచి కాలువలు చేయగా ఆరు కి.మీ మేర మట్టికట్టలు వేసి చేశారు. పదిహేనేళ్ల క్రితం చేసిన పనికావడంతో ప్రస్తుతం ఫీడర్ కాలువ అధ్వానంగా ఉంది. తిరిగి దానిని సక్రమంగా చేయడానికి కొండల అంచు తవ్వి కాలువగా వేసిన 16కి.మీ మేర లైనింగ్ అవసరమని ఉన్నతస్థాయి నిపుణులు సూచించారు. దీంతో ఆ మేరకు సర్వే చేసి రూ.206 కోట్లతో లైనింగ్‌కు ప్రాజెక్టు అధికారులు అంచనాలు రూపొందించారు. వాటికి ఉన్నత స్థాయిలోని సెంట్రల్ డిజైన్స్ సంస్థ ఆమోదం తెలిపింది. త్వరలో ఆ పనులు ప్రారంభించాల్సి ఉంది.
మూడు బృందాలతో సర్వే
మరోవైపు మట్టికట్టలు పోసి కాలువగా చేసిన 6 కి.మీ దూరం పనులు ఎలా చేయాలన్న దానిపై సర్వే జరుగుతోంది. గత నెలలో విజయవాడలోని ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ ల్యాబ్‌కు చెందిన బృందాలు విడివిడిగా వచ్చి సర్వే చేసి వెళ్లాయి. ప్రస్తుతం వారంరోజులుగా హైదరాబాద్‌కు చెందిన మరో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ బృందం మట్టి నమూనాలు తీస్తోంది. వాటిని ల్యాబ్‌లలో పరిశీలించనున్నారు. మూడింటి రిపోర్టుల ఆధారంగా ఆ కాలువలు తదుపరి పనులపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చేనెల తొలివారం నాటికి దీనిపై స్పష్టత రానుంది. ఇక అత్యంత ప్రధానమైన నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపు, కాలనీల్లో సౌకర్యాలు తదితర అంశాలపైనా ప్రభుత్వ స్థాయిలో కదలిక కనిపిస్తోంది. ముంపు గ్రామాల్లోని సుమారు ఏడున్నర వేల నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు రూ.800కోట్లు, కాలనీ ఏర్పాటు సౌకర్యాలు, భూసేకరణకు మరో రూ.500 కోట్లు కలిపి రూ.1,300 కోట్లుకు 2021 ఫిబ్రవరిలో జీవో జారీ చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ అంతా నిలిచిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది.
దశల వారీగా పునరావాసం
ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్న కొద్దీ దశలవారీ పునరావాస వ్యవహారాన్ని చూడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తొలిగా కంభం ఎస్‌డీసీ పరిధిలో సుమారు రూ.80 కోట్లను ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే బడ్జెట్‌లో ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తారని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా భారీ వెచ్చించాల్సి ఉంది. పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం దృష్ట్యా ప్రభుత్వం మాటలు కాకుండా ఆచరణలో అధిక నిధులు ఇచ్చి సత్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఈక్రమంలో పలు పార్టీలు, రైతు సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతున్నాయి. ఇదే అంశంపై గురువారం కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయగా పార్టీ అగ్రనేత బీవీ రాఘవులు హాజరవుతున్నారు.
Updated Date - Jan 23 , 2025 | 02:27 AM