యూపీ స్కూళ్లు మాయం
ABN, Publish Date - Feb 04 , 2025 | 02:07 AM
ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్)లు ఇక కనిపించవు. జాతీయ విద్యావిధానం-2020 అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా యూపీఎస్‌లు చాలావరకు కనుమరుగు కాబోతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ప్రతిపాదించిన పాఠశాలల్లో యుపీఎస్‌లకు స్థానం లేకుండాపోయింది.
విద్యా సంస్కరణలలో భాగంగా మార్పులు
హేతుబద్ధీకరణకు ప్రభుత్వం శ్రీకారం
విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం
62 యూపీఎస్‌లు పీఎస్‌లుగా డౌన్‌గ్రేడ్
48 పాఠశాలలు హైస్కూళ్లుగా ఉన్నతి
71 బడులపై వేలాడుతున్న కత్తి
ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్)లు ఇక కనిపించవు. జాతీయ విద్యావిధానం-2020 అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా యూపీఎస్‌లు చాలావరకు కనుమరుగు కాబోతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం ప్రతిపాదించిన పాఠశాలల్లో యుపీఎస్‌లకు స్థానం లేకుండాపోయింది. దీంతో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న యూపీ స్కూళ్లు.. అయితే విలీనం, లేకుంటే అప్‌గ్రేడ్, కాకుంటే డౌన్‌గ్రేడ్ కానున్నాయి. ఎలా అన్నది విద్యార్థుల సంఖ్య ప్రకారం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నదులు, కొండలు తదితర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నచోట్ల మాత్రమే యూపీఎస్‌లను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గతంలో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో వారు ప్రాథమిక స్థాయిలోనే చదువులకు స్వస్తి చెబుతుండేవారు. ఈనేపథ్యంలో 8వతరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో ఉంచేందుకు యూపీ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటి దగ్గరలో బడి ఉంటే పిల్లలు అడుతూపాడుతూ వెళ్లి చదువుకుంటారు. అదే 6వ తరగతికే విద్యార్థులు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవాలంటే ఎంత కష్టమో పాలకులు ఆలోచించడం లేదు. ప్రభుత్వం తాజా సంస్కరణల ఫలితంగా జిల్లాలో 62 యూపీ స్కూళ్లు ప్రాథమిక పాఠశాలలుగా డౌన్ గ్రేడ్ కాబోతున్నాయి. మరో 71 యూపీఎస్‌లపై మూసివేత కత్తి వేలాడుతోంది. ఇంకో 48 బడులను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 181 యూపీ స్కూళ్లు
జిల్లాలో మొత్తం 181 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 17,648 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 9,877 మంది ఉండగా 6, 7, 8 తరగతుల్లో 7,771 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు యూపీ స్కూళ్ల మనుగడకు ముప్పు పొంచి ఉంది. మొత్తంగా ఆ వ్యవస్థను లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైస్కూళ్లకు దూరంగా ఉన్న యూపీ స్కూళ్లలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లలో విలీనం చేసి యూపీఎస్‌లను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగించడానికి విద్యాశాఖ ఉన్నతాఽధికారులు మెమో ఇచ్చారు. అవి ఇప్పుడు యూపీ స్కూళ్ల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
30మంది లోపు పిల్లలున్న స్కూళ్లు డౌన్‌గ్రేడ్
పాఠశాలల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు 6, 7, 8 తరగతుల్లో 30మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీ స్కూళ్లను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తదుపరి ఆ బడులను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ నిబంధనల ప్రకారం 30మందిలోపు పిల్లలు ఉన్న 62 యూపీ స్కూళ్లు మండల ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్ కాబోతున్నాయి. ఈ పాఠశాలలకు హైస్కూళ్లు దూరమైనా సరే విలీనం చేయాల్సిందే. అవసరమైతే విద్యార్థికి సంవత్సరానికి రూ.6వేలు ప్రయాణ భత్యం చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు. 30మందిలోపు పిల్లలు ఉన్న పాఠశాలల్లో కొన్నింటిలో ముగ్గురు, నలుగురు, పదిమంది లోపు సుమారు 10 యూపీ స్కూళ్లలో ఉన్నారు. ఈ పాఠశాలలు అనివార్యంగా డౌన్‌గ్రేడ్ కావా ల్సిందే.
71 పాఠశాలలను మూసివేసే అవకాశం
71 యూపీ స్కూళ్లపై మూసివేత కత్తివేలాడుతోంది. నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతుల్లో 31 నుంచి 59మంది వరకు 6, 7, 8 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు సంబంధించి ప్రతి పాఠశాలను కేస్ స్టడీ చేసి తగు నిర్ణయం తీసుకోమన్నారు. ఈ పాఠశాలలకు సమీపంలో హైస్కూళ్లు ఉంటే ఇక్కడి యూపీ సెక్షన్ల విద్యార్థులను విలీనం చేయమన్నారు. అయితే యూపీఎస్‌కు హైస్కూలుకు మధ్య కుంటలు, వాగులు, వంకలు, జాతీయ రహదారులు తదితర అవరోధాలు ఉంటే ఈ పాఠశాలలను కొనసాగించమన్నారు. అదే జరిగితే ఈ పాఠశాలలకు స్కూలు అసిస్టెంట్లకు బదులుగా కేవలం ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను మాత్రమే కేటాయిస్తారు.
60 మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్‌గ్రేడ్
6, 7, 8 తరగతుల్లో 60మంది అంతకంటే ఎక్కువమంది విద్యార్థులు ఉన్న యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయమన్నారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో 48 యూపీ స్కూళ్లు అప్‌గ్రేడ్ కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు 9వతరగతి వస్తుంది. గెజిటెడ్ హెచ్‌ఎం, పీడీ/పీఈటీ పోస్టులు మంజూరు చేస్తారు. చదువు చెప్పేందుకు ప్రతి సబ్జెక్టుకు స్కూలు అసిస్టెంటను నియమిస్తారు.
Updated Date - Feb 04 , 2025 | 02:07 AM