రైతులకు విశిష్ట గుర్తింపు
ABN, Publish Date - Feb 20 , 2025 | 02:21 AM
ప్రజల అన్ని అవసరాలకు ప్రధాన గుర్తింపు కార్డుగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఆధార్ తరహాలో ఇక నుంచి ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి కానుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ధికి ఈ కార్డు ప్రామాణికం కానుంది.
ఆధార్ తరహాలో 11 అంకెలతో కార్డు
పథకాలన్నింటికీ అదే కీలకం
జిల్లాలో 4.79 లక్షల మంది రైతులు
అందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు 2.49 లక్షల మంది
ఆర్‌ఎస్‌కేలలో ఇప్పటికే లక్ష మంది వివరాలు నమోదు
ఒంగోలు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజల అన్ని అవసరాలకు ప్రధాన గుర్తింపు కార్డుగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఆధార్ తరహాలో ఇక నుంచి ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి కానుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ధికి ఈ కార్డు ప్రామాణికం కానుంది. భూమి ఉండి, పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతి రైతూ గుర్తింపు కార్డు తీసుకోవడం తప్పనిసరి. వ్యవసాయ రంగంలో సాంకేతిక అనుసంధానం, ఆధునికీకరణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు నెలరోజులుగా ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించారు. ఈనెల 10 నుంచి గుర్తింపు కార్డుల కోసం వివరాలను నమోదు చేస్తున్నారు. ఈనెల 25తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 6.05లక్షల హెక్టార్ల సాగు భూమి ఉండగా 4.79లక్షల మందికిపైగా రైతులు ఉన్నట్లు అంచనా. అందులో 2.49 లక్షల మంది కేంద్రప్రభుత్వం అందజేసే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఉన్నారు.
వేగంగా నమోదు ప్రక్రియ
త్వరలో ఈవిడత పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడనుండగా వారు తక్షణం ఈ గుర్తింపు కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 38 మండలాల్లో ఉన్న 616 రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే)లో గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే లక్ష మంది రైతులకుపైగా వివరాలను నమోదు చేసుకున్నారు. కాగా సొంత పొలం ఉన్న ప్రతి రైతూ తమ ప్రాంతానికి చెందిన రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం నకలును అందజేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన ఉన్న మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లి వివరాల నమోదు అనంతరం ఓటీపీ తెలియజేసి విశిష్ట గుర్తింపు కార్డును పొందాల్సి ఉంటుంది. రైతులందరూ తమ వివరాలను ఆర్‌ఎస్‌కేలలో తెలియజేసి గుర్తింపుకార్డులు పొందాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) శ్రీనివాసరావు కోరారు. ఆయా ప్రాంతాల్లో ఈ ప్రక్రియను సీనియర్ వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టంగుటూరు మండలం మర్లపాడు, సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామాల్లో ఈ నమోదు ప్రక్రియను డీఏవో శ్రీనివాసరావు పరిశీలించారు బుధవారం నాగులుప్పలపాడు మండలంలోని పలు గ్రామాల్లో పొలంబడి కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆయన గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వివరాల నమోదు, గుర్తింపు కార్డులు పొందేందుకు ఈనెల 25 తుది గడువు అని డీఏవో తెలిపారు.
Updated Date - Feb 20 , 2025 | 02:21 AM