మధ్య తరగతికి ఊరట
ABN, Publish Date - Feb 02 , 2025 | 01:37 AM
కేంద్ర బడ్జెట్ కొన్నివర్గాలకు ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా వేతన జీవులు, మధ్య తరగతి వర్గాలు ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను (ఐటీ) పరిమితి పెంపు ఆకాంక్షను ఈసారి నెరవేర్చింది. ఊహించిన విధంగా పరిమితిని ఏకంగా రూ.12లక్షలకు పెంచుతూ శనివారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.
ఆదాయ పన్ను పరిమితి పెంపు
ఉద్యోగ, వ్యాపార వర్గాలు హర్షం
రైతుల రాయితీ రుణ పరిమితి పెంపు
వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాలకు ఉపయుక్తం
నిర్మలమ్మ బడ్జెట్‌ను సమర్థించిన కూటమి పక్షాలు
ప్రత్యేక కేటాయింపులు లేవంటూ విపక్షాల పెదవి విరుపు
కేంద్ర బడ్జెట్ కొన్నివర్గాలకు ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా వేతన జీవులు, మధ్య తరగతి వర్గాలు ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను (ఐటీ) పరిమితి పెంపు ఆకాంక్షను ఈసారి నెరవేర్చింది. ఊహించిన విధంగా పరిమితిని ఏకంగా రూ.12లక్షలకు పెంచుతూ శనివారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. జలజీవన్ మిషన్ కాల పరిమితితోపాటు రైతులకు రాయితీ రుణ పరిమితినీ పెంచారు. జీవిత కాలాన్ని పెంచే మందులపై పన్నులు తగ్గించడంతోపాటు పలు కీలక రంగాలకు ఊతమిచ్చే విధంగా కేటాయింపులు చేశారు. బడ్జెట్‌ను కూటమి పక్షాలు సమర్థిస్తుండగా.. రాష్ట్రానికి, జిల్లాకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.
ఒంగోలు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కొంతమేరకు ఆశాజనకంగా ఉంది. ప్రధానంగా మధ్య తరగతికి ఊరటనిచ్చారు. ఆదాయపన్ను పరిమితి పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. సాధారణంగానే రక్షణ రంగానికి అధిక కేటాయింపులు చూపారు. వివిధ శాఖలకు తగు రీతిలో బడ్జెట్ కేటాయింపులు ఉండగా గతంతో పోల్చితే వ్యవసాయం, అనుబంధ రంగాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందే వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు ప్రకటించారు. కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ను బీజేపీ భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు సమర్థిస్తుండగా రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
వ్యక్తిగత రాయితీ ఉండే వ్యవసాయ రుణపరిమితి రూ.3లక్షల నుంచి రూ.5లక్ష లకు పెంపుతోపాటు పలు కొత్త పథకాలు, ఎంఎస్‌ఎంఈ కింద ఉదారంగా బ్యాంకు రుణాలు ఈ కోవలోకి రానున్నాయి. జలజీవన్ మిషన్‌ను గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించడంతో తాగునీటి పథకాల పనులు నిలిచిపోయాయి. ఆ పథకాన్ని మరో మూడేళ్లు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సముద్ర ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, ఇతరత్రా పథకాలు జిల్లా ప్రజలకు ఉపకరించనున్నాయి. ఇక రైల్వే, జాతీయ రహదారులు, ఇతర మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వగా ఆయా రంగాలు, పథకాల ద్వారా జిల్లాకు కూడా మేలు జరగనుంది. అన్నింటి కన్నా అధికంగా ఐటీ పరిమితి పెంపుపై ఉద్యోగ, వ్యాపార వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఆదాయ పన్ను గరిష్ఠ పరిమితి రూ.7లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలు ఉండగా ప్రస్తుతం పరిమితిని రూ.12లక్షలు పెంచడంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్‌ను కొనసాగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో వేతన జీవులు పెద్ద ఊరట పొందనున్నారు. జిల్లాలో 50వేల మంది వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరో 20వేల మంది ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధి వ్యాపారులకు దీని వల్ల మేలు చేకూరనుంది.
Updated Date - Feb 02 , 2025 | 01:37 AM