ప్రజాదర్బార్
ABN, Publish Date - Feb 09 , 2025 | 01:17 AM
ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి టీడీపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కదిలారు. అధిష్ఠానం ఆదేశాలతో శనివారం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ప్రజాదర్బార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతంలో స్థానిక ప్రజానీకానికి ఆ విషయం తెలియజేసి అధికారులను తమ వెంట తీసుకెళ్లి మరీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.
టీడీపీ అధిష్ఠానం తాజా నిర్ణయం
జనం మధ్యకు వెళ్లి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు వినతుల స్వీకరణ
పలు నియోజకవర్గాలలో నిర్వహణ
ముఖ్యఅధికారులు కూడా హాజరు
కొన్ని సమస్యలకు తక్షణ చర్యలు
ఇకపై వారానికి ఒకసారి కార్యక్రమం
ఒంగోలు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి టీడీపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కదిలారు. అధిష్ఠానం ఆదేశాలతో శనివారం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ప్రజాదర్బార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతంలో స్థానిక ప్రజానీకానికి ఆ విషయం తెలియజేసి అధికారులను తమ వెంట తీసుకెళ్లి మరీ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. సాధార ణంగా ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాలలో, అవసరమైతే నివాసాల్లో నిత్యం తమ వద్దకు వచ్చే ప్రజల వినతులను స్వీకరిస్తారు. వాటిని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టర్ స్థాయి నుంచి సచివాలయ సిబ్బంది వరకు తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అయితే ఈసారి కీలక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాఽధ్యులు కూడా అదేతరహాలో వారానికి ఒకసారి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది. దీనికి ప్రజాదర్బార్ అని పేరు పెట్టి ప్రతి శనివారం ఒక ప్రాంతంలో నిర్వహించాలని సూచించింది. తదనుగుణంగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్‌లు జరిగాయి.
వినతులను స్వీకరించిన ఎమ్మెల్యేలు
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 31వ డివిజన్‌లోని విజయనగర్ కాలనీలో ప్రజాదర్బార్ నిర్వహిం చారు. రెవెన్యూ, మునిసిపల్ అధికారులను వెంటబెట్టుకొని వెళ్లి అక్కడి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యల కోసం అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో ఉన్న కార్యక్రమాల ఒత్తిడి నేపథ్యంలో సంతనూతల పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ శనివారం ఉదయం ఒంగోలులోని తన కార్యాలయంలోనే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు మండల కేంద్రమైన దోర్నాలలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో పింఛన్లు, నివేశన స్థలాలు, భూ సంబంధ అంశాలపై ఎక్కువగా వినతులు వచ్చాయి.
Updated Date - Feb 09 , 2025 | 01:17 AM