పనితీరే ప్రామాణికం.. లేకుంటే తొలగింపు
ABN, Publish Date - Jan 05 , 2025 | 11:26 PM
గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మరింత ఉపయుక్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పథకం అమలులో కీలకమైన గ్రామస్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్లను మరింత క్రియాశీలకంగా పనిచేయించాలని నిర్ణయించింది. రానున్న ఆరు మాసాలకు వారికి నిర్థిష్ట లక్ష్యాలను ఇవ్వనుంది. అందులో ఒక్కొక్కరి పనితీరును బేరీజు వేసి భవిష్యత్‌లో కొనసాగించడమా? తొలగించడమా? అన్నది నిర్ణయించనుంది. అదేసమయంలో గ్రామాలలో ఉపాధి కూలీలతో ఉన్న శ్రమశక్తి సంఘాలను పునర్‌వ్యవస్థీకరించి మేస్త్రీల వ్యవస్థను బలోపేతం చేయనుంది.
జిల్లాల వారీ శిక్షణ
శ్రమశక్తి సంఘాల పునర్‌వ్యవస్థీకరణ,
మేస్త్రీల వ్యవస్థ ఏర్పాటు
నేడు ఒంగోలుకు
పీఆర్ కమిషనర్ కృష్ణతేజ రాక
ఒంగోలు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మరింత ఉపయుక్తంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పథకం అమలులో కీలకమైన గ్రామస్థాయిలోని ఫీల్డ్ అసిస్టెంట్లను మరింత క్రియాశీలకంగా పనిచేయించాలని నిర్ణయించింది. రానున్న ఆరు మాసాలకు వారికి నిర్థిష్ట లక్ష్యాలను ఇవ్వనుంది. అందులో ఒక్కొక్కరి పనితీరును బేరీజు వేసి భవిష్యత్‌లో కొనసాగించడమా? తొలగించడమా? అన్నది నిర్ణయించనుంది. అదేసమయంలో గ్రామాలలో ఉపాధి కూలీలతో ఉన్న శ్రమశక్తి సంఘాలను పునర్‌వ్యవస్థీకరించి మేస్త్రీల వ్యవస్థను బలోపేతం చేయనుంది. ఆమేరకు ఇటీవల అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లతో గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టత ఇచ్చారు.
వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు వచ్చే ఉపాధి పథకాన్ని 2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పెద్దఎత్తున సద్వినియోగం చేసింది. కూలీలకు పనుల కల్పన ద్వారా వేతనాలతోపాటు మెటీరియల్ కోటా నిధులు కూడా భారీగా వచ్చి పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి పనులు పడకేశాయి. శ్రమశక్తి సంఘాలు నిర్వీర్యమయ్యాయి. మేస్త్రీల వ్యవస్థ లేకుండా పోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ల పెత్తనం పెరిగింది. సుమారు వెయ్యి మంది కూలీలు పనులకు వచ్చే గ్రామంలో కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పర్యవేక్షణ మాత్రమే ఉండటంతో అనేక అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్నాయి. పనిచేసే వారికి, చేయని వారికి ఒకే రకమైన వేతనాలు లభించాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, స్థానిక వైసీపీ నాయకులు, మండల స్థాయిలోని డ్వామా సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయి. ఈనేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారులు ఆవైపు దృష్టి సారించారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌లు కీలకమని గుర్తించిన ప్రభుత్వం
ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా గుర్తించి వారిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అనేక చోట్ల ఇప్పటి వరకు పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను మార్పులు, చేర్పులు చేసి కొత్తవారిని నియమించారు. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 350 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కొత్తగా నియమితులయ్యారు. మరో 300 మంది గతంలో ఉన్నవారే కొనసాగుతున్నారు.
రెండు రోజులు శిక్షణ
జిల్లాస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేసి రోజులు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన జిల్లాలో ఈనెల 6,7 తేదీల్లో కార్యక్రమం జరగనుంది. తొలిరోజైన సోమవారం జిల్లాలోని 650 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత ఇతర అధికారులు, సిబ్బందికి ఒంగోలులో ఒక రోజు శిక్షణ ఇవ్వనుండగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ హాజరుకానున్నారు. 7వతేదీన క్షేత్ర స్థాయిలో ఈ సిబ్బందిని బృందాలుగా పంపి పనుల గుర్తింపు, ఇతరత్రా విషయాలపై అవగాహన కల్పించనున్నారు. రానున్న ఆరు మాసాలలో ఆయా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులపై కూడా వారికి లక్ష్యాలను నిర్దేశించనున్నారు. ఆ మేరకు పనిచేసిన వారిని మాత్రమే ఉంచి మిగిలిన వారిని తొలగించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 11:26 PM