హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను
ABN, Publish Date - Jan 23 , 2025 | 02:24 AM
పేద పిల్లలు చదువుకుంటున్న సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సంక్షేమ, వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో రూ.143కోట్లతో వసతి గృహాలకు మరమ్మతులు
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి
అధికారులకు మంత్రి స్వామి ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : పేద పిల్లలు చదువుకుంటున్న సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సంక్షేమ, వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.143కోట్లతో హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆ నిధులతో వెంటనే పనులు పూర్తిచేయాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఖాళీలు ఉన్న హాస్టల్స్‌లో సామాజికవర్గంతో సంబంధం లేకుండా అడ్మిషన్లు మంజూరుచేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులు పెన్షన్ల కోసం ప్రతినెలా వారి స్వగ్రామాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. మాతాశిశు మరణాలు తగ్గించడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుండెపోటు సంభవించినప్పుడు తక్షణమే ప్రమాదాన్ని నివారించేందుకు ఇంజెక్షన్ వేసే స్టెమీ ప్రాసెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగర్ జలాలు మరోసారి విడుదల చేయనున్నారని, వాటితో చెరువులను పూర్తిస్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్వామి ఆదేశించారు.
రిమ్స్‌పై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించాలి
రిమ్స్ ఆస్పత్రిపై వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులను కోరారు. దాతల సహాయంతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మోటార్లు పనిచేయకపోవడంతో మద్దిపాడు, ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని 50 గ్రామాలకు నీటి సరఫరాలో 17 రోజులపాటు సమస్య వచ్చిందన్నారు. ఒంగోలు నగర పరిధిలో వినియోగించకుండా ఉన్న ఇరిగేషన్ శాఖకు చెందిన 146 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలాయిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీలు పడిపోయాయి
మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో ఓపీలు భారీగా తగ్గిపోయాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. గతంలో రోజుకు 800 ఓపీలు ఉండగా ప్రస్తుతం 200కు పడిపోయాయన్నారు. రోగుల పట్ల వైద్యులు శ్రద్ధపెట్టకుండా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ వర్కర్‌ను ఏజెంట్‌గా పెట్టుకొని దివ్యాంగుల పెన్షన్ కోసం నకిలీ సర్టిఫికెట్లను మంజూరుచేస్తున్నారని మండిపడ్డారు. ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాగునీటి బోర్‌వెల్స్‌ను రిపేరు చేయాలన్నారు. పొదిలి ప్రాంతానికి వారానికి 30గంటల పాటు ఇస్తున్న నీటి సరఫరాను 48 గంటలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
భవన నిర్మాణాలకు ఎంపీ ల్యాడ్స్ నిధులు
వివిధ భవన నిర్మాణాలకు అవసరమైన నిధులను తన ఎంపీ ల్యాడ్స్ నుంచి కేటాయిస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలను మాగుంట ప్రస్తావించారు.
గైనకాలజిస్ట్ విధులు నిర్వహించడం లేదు
పామూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి కనిగిరికి డిప్యుటేషన్‌పై వచ్చిన గైనకాలజిస్ట్ విధులు నిర్వర్తించడం లేదని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. పామూరుకు కూడా తిరిగి రాలేదన్నారు. చెప్పకుండా విధులకు గైర్హాజరైన గైనకాలజిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏరియా ఆస్పత్రికి వైద్యులను నియమించాలి
గిద్దలూరులోని ఏరియా ఆస్పత్రిలో రేడియాలజిస్టు, పిడియాట్రిషియన్, అనస్తీషియా వైద్యులను నియమించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. ఆస్పత్రిలో ఉన్న నియోనాటల్ కేర్ యూనిట్‌ను స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. కంభం ఆస్పత్రిలో డాక్టర్ పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో 500 అడుగుల కంటే లోతులో ఉన్న బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్నింటికి మరమ్మతులు చేయాలని కోరారు.
మదర్ బ్లడ్‌బ్యాంకును జిల్లాలోనే అనుసంధానం చేయాలి
గతంలో దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలకు మదర్ బ్లడ్‌బ్యాంకుగా చీరాల ఉండేదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కొత్త జిల్లా ఏర్పడినందున మదర్ బ్లడ్‌బ్యాంకును కూడా ప్రస్తుత జిల్లాలోనే అనుసంధానం చేసే విధంగా చూడాలన్నారు. దర్శి ఆస్పత్రికి తాత్కాలిక మార్చురీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌ఏపీ ప్రాజెక్టులోని ఫిల్టర్‌బెడ్లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చాలని తెలిపారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
వేసవిలో వైపాలెం నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందని, అందువల్ల ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చర్యలు తీసుకోవాలని వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు కోరారు. దోర్నాలలోని గిరిజన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధులు మంజూరుచేసి నిర్మాణం త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైపాలెం ప్రభుత్వ వైద్యశాలలో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు దాతలు సముఖంగా ఉన్నారని, అందుకు అవసరమైన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ తమీమ్ అన్సారియా
సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాల మరమ్మతులతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో అధికారులు లక్ష్మానాయక్, అర్జున్‌నాయక్, జయ, అర్చన, డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్ సూరిబాబు, వరలక్ష్మి, బాలమురళీమోహన్, బాలకశంకరరావు, రిమ్స్ సూపరిటెండెంట్ డాక్టర్ జమున తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 23 , 2025 | 02:24 AM