ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటకలో మార్కెట్‌ మందగమనం

ABN, Publish Date - Jan 21 , 2025 | 01:45 AM

Market slowdown in Karnataka ప్రస్తుత సీజన్‌ ఆంధ్రలో ప్రత్యేకించి దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపి స్తున్నాయి. అందుకు కర్ణాటకలో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటమేనని తెలుస్తోంది.

ఇప్పటివరకు కొన్నది 45 మిలియన్‌ కిలోలు మాత్రమే

ఇంకా రైతుల వద్ద 55 మిలియన్‌ కిలోల పొగాకు

ఆంధ్రలో ప్రస్తుత సీజన్‌పై ప్రభావం

కొనుగోళ్లు ఆలస్యమయ్యే అవకాశం

ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సీజన్‌ ఆంధ్రలో ప్రత్యేకించి దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపి స్తున్నాయి. అందుకు కర్ణాటకలో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటమేనని తెలుస్తోంది. సాధారణంగా ఏటా ఆంధ్రలో పొగాకు నాట్లు వేసే సమయంలో కర్ణాటకలో కొనుగోళ్లు మొదలవుతాయి. ఇక్కడ పొగాకు క్యూరింగ్‌ మూడొంతులు పూర్తయ్యే సమయానికి అక్కడ దాదాపు కొనుగోళ్లు తుదిదశకు చేరుకుంటాయి. అలా ఫిబ్రవరి ఆఖరుకు కర్ణాటకలో చివరి దశకు చేరితే ఆ వెంటనే దక్షిణాదిలో కొనుగోళ్లను పొగాకు బోర్డు ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి వెళ్లినా కర్ణాటకలో పండిన పంటలో సగం విక్రయాలు కూడా పూర్తికాలేదు. మెరుగైన ధరల కోసం అక్కడి రైతులు ఎదురుచూస్తూ త్వరితగతిన పంట అమ్మకాలకు మొగ్గుచూపడం లేదు. మరోవైపు అక్కడ లోగ్రేడ్‌ అధికంగా ఉత్పత్తి కావడంతో మేలురకం పొగాకు ధరలు బాగానే ఉన్నా రైతులు మాత్రం లోగ్రేడ్‌ బేళ్లను ఎక్కువగా వేలం కేంద్రాలకు తెస్తున్నారు. దీంతో నోబిడ్‌లు కూడా ఒకింత అధికంగా ఉంటుండటంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి.

కర్ణాటకలో అక్టోబరు 7న వేలం ప్రారంభం

కర్ణాటకలో 2024-25 సీజన్‌కు పొగాకు బోర్డు అంతకు ముందు సీజన్‌ వలే 100 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఇంచుమించు అంతే పరిమాణంలో పంట ఉత్పత్తి జరిగినట్లు అంచనా. గత ఏడాది అక్టోబరు 7న కర్ణాటకలోని మొత్తం పది కేంద్రాల్లోనూ వేలంను అధికారులు ప్రారంభించారు. తొలిరోజు మేలురకం కిలోకు రూ.230 ఇచ్చిన వ్యాపారులు క్రమంగా డిసెంబర్‌ రెండో వారం నాటికి గరిష్ఠ ధర కిలో రూ.290 వరకూ.. లోగ్రేడ్‌లకు కూడా రూ.230 నుంచి రూ.250 వరకూ తీసుకెళ్లారు. అనంతరం మేలురకం ధరలు ఎంతోకొంత పెరుగుతున్నా లోగ్రేడ్‌ ధరలు అప్పటి వరకు ఉన్న దాని కన్నా తగ్గించడం ప్రారంభించారు. అసలే ఈ ఏడాది అక్కడ లోగ్రేడ్‌ అధికంగా ఉత్పత్తైంది. సుమారు 100 మిలియన్‌ కిలోలు పంట ఉత్పత్తి అంచనా కాగా అందులో నికరంగా 40శాతం లోగ్రేడ్‌, 35శాతం మీడియం గ్రేడ్‌ ఉండగా మేలురకం కేవలం 25శాతం మాత్రమేనని సమాచారం.


అంతా లోగ్రేడ్‌ తేవడంతోనే..

సాధారణంగా లోగ్రేడ్‌ 25శాతం ఉంటుంది. అలాంటిది 40శాతం వరకు ఉత్పత్తి కావడంతోపాటు ఆ గ్రేడ్‌లకు ధ రలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందడమేకాక మేలురకం బేళ్లను ఇళ్లలో ఉంచుకొని లోగ్రేడ్‌, మీడియం గ్రేడ్‌ బేళ్లను అమ్మకాలకు ఆ నెలలో తెచ్చారు. ఆ పరిస్థితి అక్కడ కొనుగోళ్లపై తీవ్రంగా చూపింది. ఫలితంగా రోజువారీ కొనుగోలు పరిమాణం తగ్గి మొత్తం సీజన్‌ కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోంది. సంక్రాంతి వరకు దాదాపు మూడున్నర మాసాల కాలంలో కర్ణాటకలో కేవలం 45 మిలియన్‌ కిలోల పంట మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం. మేలురకం గ్రేడ్‌ గతం కన్నా పెరిగి గరిష్ఠ ధర కిలో రూ.315కు చేరుకోగా, కనిష్ఠ ధరలు కిలో రూ.220గా ఉన్నాయి. అలా సగటు ధర కిలో రూ.265 వరకూ లభిస్తోంది. గత ఏడాది మొత్తం 83 మిలియన్‌ కిలోల ఉత్పత్తి జరగ్గా సగటున కిలోకు రూ.254 ధర లభించింది. ఆ ప్రకారం చూస్తే గత ఏడాది కన్నా ఈ ఏడాది సగటు ధర ఎక్కువగానే ఉండటంతోపాటు మేలురకం ధరలు గతం కన్నా అధికంగానే లభిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది లోగ్రేడ్‌ ఉత్పత్తి అధికంగా ఉండటంతో అక్కడి రైతులు ఆ ధరల కోసం పట్టుపడుతూ బేళ్లను సక్రమంగా తీసుకురావడం లేదని సమాచారం. అక్కడ ఇంకా 55 మిలియన్‌ కిలోల పంట రైతుల వద్ద ఉండటంతో దాని విక్రయాలకు మరో మూడు మాసాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అలా అయితే ఆంధ్రలో ఈ ఏడాది కనీసం మార్చి ఆఖరుకు కూడా వేలం ప్రారంభించే పరిస్థితి ఉండదు. దాని వల్ల ఇక్కడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.

Updated Date - Jan 21 , 2025 | 01:46 AM