అక్రమాలు.. అవినీతి
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:38 AM
డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేసిన కాలంలో నిబంధనలు, సామాజిక న్యాయం వంటి వాటికి పాతరేసి అడ్డగోలుగా వ్యవహరించారని పలువురు ఆయనపై త్రిసభ్య కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆయన పనిచేసిన కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని తెలిపారు.
అడ్డగోలుగా వ్యవహరించిన శీనారెడ్డి
కార్యాలయ సిబ్బందికీ భాగస్వామ్యం
త్రిసభ్య కమిటీ ఎదుట పలువురు ఫిర్యాదు
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నేడు ఉద్యోగులను విచారించనున్న కమిటీ
31 మందికి ముందస్తు నోటీసులు
ఒంగోలు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేసిన కాలంలో నిబంధనలు, సామాజిక న్యాయం వంటి వాటికి పాతరేసి అడ్డగోలుగా వ్యవహరించారని పలువురు ఆయనపై త్రిసభ్య కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆయన పనిచేసిన కాలంలో జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని తెలిపారు. అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా శీనారెడ్డి నిలిచారని ఆరోపించారు. శీనారెడ్డిపై విచారణకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో జిల్లా ఆడిట్ అధికారి శివనారాయణరెడ్డి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణలతో కూడిన కమిటీ ఈ విచారణ చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు పంపిన ఐదుగురిని తమ ఎదుట హాజరుకావాలని కమిటీ చైర్మన్ లోకేశ్వరరావు నోటీసులు ఇవ్వగా గురువారం డ్వామా కార్యాలయంలో జరిగిన విచారణకు నలుగురు హాజరయ్యారు. ప్రధాన ఫిర్యాదుదారుడుగా ఉన్న పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్, పొదిలికి చెందిన న్యాయవాది పి.శైలజ, మార్కాపురానికి చెందిన ఇనగంటి రాజశేఖర్, కొండపి ప్రాంతానికి చెందిన శివశంకర్‌లు ఈ విచారణకు హాజరై తాము చేసిన ఫిర్యాదులు, వాటికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను కమిటీ సభ్యులకు వివరించారు.
అక్రమార్కులకు తిరిగి పోస్టింగ్‌లు
సోషల్ ఆడిట్‌లో భారీగా అవకతవకలు, అవినీతి చోటుచేసుకుందని అందులో సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో పీడీగా ఉన్న శీనారెడ్డి పూర్తి పక్షపాతంగా వ్యవహరించడంతోపాటు భారీగా అవినీతికి పాల్పడ్డారని విచారణకు హాజరైన వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన అక్రమాలపై పీడీ సరిగా చర్యలు తీసుకోని విషయం తమ దృష్టికి రావడంతో అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రత్యేక బృందాలను పంపి విచారణ చేయించారన్నారు. అందులో అక్రమాలను గుర్తించి పలువురు సిబ్బందిని సస్పెండ్ చేయగా వారికి తిరిగి పోస్టింగ్‌లు శీనారెడ్డి ఇచ్చారన్నారు. అందుకు వీలుగా ఏపీడీలతో పునర్విచారణ చేయించారన్నారు. అలాంటి అధికారం పీడీకి లేకపోయినా అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. ఇలాంటివి అనేకం ఉన్నాయని ఆరోపించారు. అదేసమయంలో ఇష్టారీతిన శీనారెడ్డి వ్యవహరించడంలో పలువురు డ్వామా కార్యాలయ సిబ్బంది సంపూర్ణ సహకారం ఉందన్నారు. తద్వారా వారు కూడా లబ్ధిపొందారని ఆరోపించారు. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. రాజశేఖర్, శివశంకర్‌లు ఇరువురూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శీనారెడ్డితోపాటు ఫైళ్లతో సంబంధం ఉన్న ప్రస్తుత, పూర్వ డ్వామా ఉద్యోగులను కమిటీ సభ్యులు గురువారం విచారించనున్నారు. ఏపీడీల నుంచి అటెండర్ వరకు స్థాయి కలిగిన మొత్తం 31మంది ఉద్యోగులను విచారణకు గురువారం హాజరుకావాలని కమిటీ చైర్మన్ లోకేశ్వరరావు డ్వామా ప్రస్తుత పీడీ ద్వారా గతంలోనే నోటీసులు ఇచ్చారు.
Updated Date - Jan 09 , 2025 | 02:38 AM