ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవ సమాజానికి నాంది నవోదయం

ABN, Publish Date - Feb 20 , 2025 | 02:24 AM

నవసమాజానికి నాంది నవోదయం అని ఎక్సైజ్‌, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం నవోదయం 2.0 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు.

పావురాళ్లు, బెలూన్‌లను గాలిలోకి వదిలి నవోదయం 2.0ను ప్రారంభిస్తున్న మంత్రులు కొల్లు, డోలా, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, కందుల, కలెక్టర్‌ అన్సారియా, ఎస్పీ దామోదర్‌ తదితరులు

మంత్రులు కొల్లు రవీంద్ర, స్వామి పిలుపు

ఒంగోలులో నవోదయం 2.0 ప్రారంభం

విద్యార్థులతో నగరంలో భారీ ర్యాలీ

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు

ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట మానవహారం

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నవసమాజానికి నాంది నవోదయం అని ఎక్సైజ్‌, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం నవోదయం 2.0 రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి స్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ దేశానికి యువత అత్యుత్తమమైన సంపద అని తెలిపారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పేదలు నాటుసారా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. యువకులు డ్రగ్స్‌, గంజాయిలాంటి మత్తుకు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే నాటుసారాను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఈగల్‌ అనే వ్యవస్థను రూపొందించిందన్నారు. రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

ఒంగోలులో ప్రారంభిస్తే విజయం ఖాయం

నవోదయం కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించడానికి ఒక ప్రత్యేకత ఉందని మంత్రి రవీంద్ర చెప్పారు. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతున్నదని, అందుకు మహానాడు ఉదాహరణ అన్నారు. ఒంగోలులో ఆ కార్యక్రమ సక్సెస్‌తోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మారుమూల ప్రాంతాలు, కళాశాలల్లో డ్రగ్స్‌ దొరికిన చరిత్ర ఉందన్నారు. ఈ పరిస్థితులను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగం ఆ వైపు దృష్టిసారించాలని కోరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలు కావద్దని హితవు పలికారు. మీపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ లను వమ్ము చేయవద్దని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమప్రాంతంలోని గిరిజన ప్రాం తాలలో నాటుసారా తయారీని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సారా వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులు గుర్తించాలని, అవగాహన కలిగి ఉండాలన్నారు. దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లా డుతూ యువత నాటుసారా, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎక్సైజ్‌ కమిషనర్‌ నిశాంత్‌కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మలు మాట్లాడుతూ నవోదయం ప్రాధాన్యతలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ నాటుసారా, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వీటికి బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరారు. జిల్లాను నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ నాటుసారా తాగి అనారోగ్యం పాలై అనేక కుటుంబాలు వీధిన పడ్డాయని తెలిపారు. డ్రగ్స్‌కు తెలియని వయస్సులో యువత బానిసలై తమ ఆరోగ్యాన్ని, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. నాటుసారా తయారీదారులు, గంజాయి, డ్రగ్స్‌ విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా నాటుసారా తయారు చేస్తున్నా, డ్రగ్స్‌, గంజాయి విక్రయిస్తున్నా టోల్‌ఫ్రీ నంబర్లు 1972, 14405లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


గంజాయికి బానిసలై కుటుంబాలకు దూరమయ్యాం

గుంటూరుకు చెందిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు, భరత్‌ అనే పెయింటర్‌ మాట్లాడుతూ తాము గంజాయికి బానిసలై కుటుంబాలకు దూరకావడంతోపాటుగా ఆరోగ్యం దెబ్బతిందని సభలో వివరించారు. గుంటూరులో ఎక్సైజ్‌ శాఖలో పనిచేస్తున్న సీఐ లత తమను కౌన్సెలింగ్‌ సెంటర్‌ ద్వారా మామూలు మనుషులను చేశారని చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్‌, గంజాయిలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ముఖ్యంగా అలాంటి అలవాట్లు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండాలని కోరారు.

నగరంలో భారీ ర్యాలీ

నవోదయం 2.0 కార్యక్రమ ప్రారంభం అనంతరం నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు పావురాలు, బెలూన్లను వేగురవేశారు. నాటుసారా, మత్తుపదార్థాల వలన కలిగే దుష్ఫ్రభావాలను తెలియజేసే ప్రత్యేక గీతాన్ని రాసిన కడప జిల్లా ఏఈఎస్‌ వినోద్‌ను మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు. ప్రత్యేక గీతాన్ని, పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్‌ నూకసాని బాలాజీ, మేయర్‌ గంగాడ సుజాత, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కె.హేమంత్‌నాగరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయ, ఈఎస్‌ ఖాజామొహీద్దీన్‌, ఏఈఎస్‌లు దాసరి బాలయ్య, ఎర్రా వెంకట్‌, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 02:24 AM