అర్ధ ప్రకాశం
ABN, Publish Date - Feb 01 , 2025 | 02:01 AM
అభివృద్ధే లక్ష్యంగా ఐదున్నర దశాబ్దాల క్రితం జిల్లా ఏర్పాటైనా ఆశించిన లక్ష్యం నేటికీ నెరవేరలేదు. అనేక కీలక రంగాలలో వెనుకబడే ఉంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఉపాధి, ఇతర మౌలిక రంగాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదు. ఆయా రంగాలలో గతంలో కొంత కృషి ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పటికీ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో చూపిన నిర్లక్ష్యం జిల్లా అభివృద్ధికి శాపంగా మారింది.
జిల్లా ఏర్పడి ఐదున్నర దశాబ్దాలు దాటినా కీలక రంగాలలో లేని పురోగతి
నేటికీ ప్రజలకు తప్పని ఫ్లోరైడ్ పీడ
అన్నిచోట్లా సాగు, తాగునీటికి ఇక్కట్లే
విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో వెనుకంజ
గత వైసీపీ పాలనలో జిల్లాపై మరింత నిర్లక్ష్యం
కీలకమైన ఒంగోలు డెయిరీకి సమాధి
పునర్విభజనతో వ్యవసాయరంగం కుదేలు
ఆచ రణాత్మక కార్యాచరణతోనే అభివృద్ధి
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
రేపు జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవం
అభివృద్ధే లక్ష్యంగా ఐదున్నర దశాబ్దాల క్రితం జిల్లా ఏర్పాటైనా ఆశించిన లక్ష్యం నేటికీ నెరవేరలేదు. అనేక కీలక రంగాలలో వెనుకబడే ఉంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఉపాధి, ఇతర మౌలిక రంగాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదు. ఆయా రంగాలలో గతంలో కొంత కృషి ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పటికీ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో చూపిన నిర్లక్ష్యం జిల్లా అభివృద్ధికి శాపంగా మారింది. నవ్యాంధ్రలో తొలి ఐదేళ్ల టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధిపై కొంత కృషి జరిగి పలు రంగాలపై దృష్టి సారించగా.. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ఏ ఒక్క రంగాన్ని పట్టించుకోక ఆయా ప్రాజెక్టులు ముందుకు సాగలేదు.
ఒంగోలు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం ఒకటిన్నర దశాబ్దానికి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా నాటి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లు కలిపి 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. అనంతరం రెండేళ్లకు జిల్లావాసి అయిన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరును జిల్లాకు పెట్టారు. అలా జిల్లా ఏర్పాటు నాటికి విద్య, వైద్య, సాగు, తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు అతి తక్కువ కాగా.. పారిశ్రామిక, ఉపాధి రంగాలు లేవనే చెప్పాలి. కేవలం వ్యవసాయం ప్రధాన ఉపాధి రంగంగా ఉండగా అందులోనూ 90శాతం వర్షాధార మెట్ట సాగే. తదనంతర కాలంలో ఆయా రంగాలలో ప్రభుత్వాల దృష్టి, అప్పటి జిల్లా నేతల కృషి ఫలితంగా కొంత పురోగతి కనిపించింది. అయినా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలిస్తే ఏ ఒక్క రంగంలోనూ అవసరమైన స్థాయిలో అభివృద్ధి జరగలేదు.
అంతా వెనుకబాటే
జిల్లా ప్రజానీకం ప్రత్యేకించి పశ్చిమప్రాంత ప్రజలు వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం తేడా లేకుండా తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు. రక్షిత నీరు కాదు కదా సాధారణ అవసరాలకు, పశువులకు నీరు దొరకని పల్లెలు వందలాదిగా ఉన్నాయి. సాగర్ ఆయకట్టుతో కొంత ప్రాంతానికి సాగునీటి సౌకర్యం ఏర్పడింది. వెలిగొండ ఎండమావిగానే ఉంది. ఇతర వనరుల అభివృద్ధి ముందుకు సాగలేదు. నేటికీ విద్య, వైద్య రంగాలలో ఆశించిన స్థాయిలో వృద్ధిలేదు. పెద్ద జబ్బులకు వైద్యం కావాలంటే పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిందే. ఉన్నత విద్యదీ అదే పరిస్థితి. రోడ్డు రవాణా కొంతమేర అభివృద్ధి చెందినా అది కేంద్రప్రభుత్వ పరిధిలోని జాతీయ రహదారులలోనే అధికంగా ఉంది. రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లా ప్రజలకు ప్రధాన ఉపాధి రంగాలుగా ఉన్న వ్యవసాయం, పాడి పరిశ్రమలు తీవ్ర ఒడిదొడుకలలో ఉంటున్నాయి. జిల్లా పునర్విభజనతో వ్యవసాయరంగం ప్రాభవం కోల్పోయింది, ఒక్క పొగాకు తప్ప కాస్తంత ఆదాయం వచ్చే పంటల సాగు జిల్లాలో లేకుండాపోయింది. పాడి పరిశ్రమ కూడా అలాగే ఉంది. ఇక పారిశ్రామిక ఉపాధి రంగాలు పరిశీలిస్తే చీమకుర్తి, ఒంగోలు ప్రాంతాలలో గ్రానైట్ పరిశ్రమలు తప్ప పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు.
వైసీపీ పాలనలో తిరోగమనం
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏ ఒక్క రంగం పురోగతి సాధించలేకపోయింది. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంగా 2014లో ఏర్పడిన టీడీపీ పాలనలో రామాయపట్నం పోర్టు, దొనకొండ కారిడార్, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీలకు బీజం పడటంతోపాటు వెలిగొండ పనులు వేగవంతమయ్యాయి. సంక్షోభంలో ఉన్న ఒంగోలు డెయిరీకి ఊరట లభించింది. పశ్చిమప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు భారీ తాగునీటి పథకాలు మంజూరయ్యాయి. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌లోనూ కొంత కదలిక వచ్చింది. అయితే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో పాలకులు జిల్లాపై తీవ్ర నిర్లక్ష్యం చూపారు. జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీని మూసేశారు. వెలిగొండను నిర్లక్ష్యం చేశారు. గుండ్లకమ్మ నిర్వహణ పట్టించుకోక గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లు ఆయకట్టుకు నీరందలేదు. పారిశ్రామికరంగ అభివృద్ధి ఊసే లేకపోగా అంతో ఇంతో ఉన్న గ్రానైట్ రంగం కూడా తిరోగమనం బాట పట్టింది. విద్య, వైద్యరంగాలపైనా నిర్లక్ష్యమే కొనసాగింది. కేంద్ర నిధులతో చేసే జలజవన మిషన్ పథకం పనులు కూడా జరగక నీటి కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడక తప్పడం లేదు. ఉపాధి కోసం వలసలు పెరిగాయి.
నేతల చొరవ అత్యవసరం
రాష్ట్రంలో మళ్లీ టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. రోడ్లు, రైలు మార్గాలలో కేంద్రం ద్వారా కొంత పురోగతి ఉండగా ఇతర రంగాలలో రాష్ట్రప్రభుత్వ దృష్టి, జిల్లా నేతల చొరవ అవసరంగా కనిపిస్తోంది. అందులో ఆచరణాత్మక కార్యాచరణ మరింత అవసరం. విజన్-2047 పేరుతో రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనైనా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. 2024-29 మధ్య ఐదేళ్ల కాలంలో అభివృద్ధిపై జిల్లాలోనూ ప్రణాళికలు రూపొందించారు. ఏటా 15శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొదించగా ఈ ఐదేళ్లలో ఆ ప్రణాళిక ద్వారా జిల్లా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు చేయాలని నిర్దేశించారు. అందులో ప్రధానంగా పాడి పరిశ్రమ, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఉన్నాయి అలాగే మౌలిక సౌకర్యాల వృద్ధికి పెద్దపీట వేశారు. లక్ష్యసాధన చేయాలంటే జిల్లా ప్రజల ప్రత్యేకించి పశ్చిమ ప్రజలకు వరప్రసాదిని అయిన వెలిగొండ తక్షణం పూర్తి ద్వారా సాగు, తాగునీటి ఇక్కట్లు తీర్చాలి. దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్జ్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. గ్రానైట్, ఆక్వా రంగాలకు ఊతం ఇవ్వాలి. ట్రిపుల్ ఐటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలి. ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ, ఉన్న సాగునీటి వనరులు, రోడ్లు, రైల్వేమార్గాల అభివృద్ధి వంటివి ప్రధానం. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల వృద్ధితోపాటు సహజవనరుల వినియోగం, జిల్లాలో ఉన్న మానవవనరుల వినియోగంలో భాగంగా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉపాధి మార్గాల పెంపు, రూ.4,600కోట్లతో ప్రతిపాదిస్తున్న జలజీవన మిషన్ పూర్తి వంటి చర్యలు చేపట్టాలి. ఆయా రంగాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొంత దృష్టిసారించినట్లు కనిపిస్తున్నా దానిని వేగవంతం చేయడం ద్వారా జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - Feb 01 , 2025 | 02:01 AM