గుండ్లకమ్మలో పూర్తిస్థాయి నీటి నిల్వ
ABN, Publish Date - Jan 21 , 2025 | 01:43 AM
గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేసే అవకాశం వచ్చింది. గతంలో వలే 3.40 టీఎంసీలు నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టుల ఎస్‌ఈ నాగమురళీమోహన్ తెలిపారు. ఇప్పటివరకు జలవనరుల శాఖ ఎన్నెస్పీ అద్దంకి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను మూడు రోజుల క్రితం ఒంగోలులోని ప్రాజెక్టుల ఎస్‌ఈగా ప్రభుత్వం నియమించింది.
ప్రాజెక్టుల ఎస్‌ఈ నాగమురళీ మోహన్
ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష
ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నీటి నిల్వ చేసే అవకాశం వచ్చింది. గతంలో వలే 3.40 టీఎంసీలు నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టుల ఎస్‌ఈ నాగమురళీమోహన్ తెలిపారు. ఇప్పటివరకు జలవనరుల శాఖ ఎన్నెస్పీ అద్దంకి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న ఆయన్ను మూడు రోజుల క్రితం ఒంగోలులోని ప్రాజెక్టుల ఎస్‌ఈగా ప్రభుత్వం నియమించింది. ఆదివారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. తొలుత గుండ్లకమ్మ ప్రాజెక్టు డివిజన్-2 యూనిట్ ఈఈ రవికుమార్, డివిజన్-1, 2 యూనిట్లలోని డీఈలు, జేఈలు ఇతర సిబ్బంది ఎస్‌ఈని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రాజెక్టులపై చర్చ సాగింది. మొత్తం 15గేట్లు ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టులో నాటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2022 ఆగస్టు 31న ఒక గేటు, 2023 డిసెంబరులో మూడో నంబరు గేటు కొట్టుకుపోయిన విషయం విదితమే. దాని వల్ల రెండేళ్లపాటు ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశం లేక రైతులు, ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న జాలర్ల కుటుంబాలు నష్టపోయాయి. ఏడాది క్రితం గేట్ల మరమ్మతులు ప్రారంభం కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పనులు ఊపందుకున్నాయి.
13 గేట్ల పనులు పూర్తి
సంబంధిత పనులపై అధికారులతో ఎస్‌ఈ సమీక్ష చేయగా మొత్తం 15లో 13 గేట్ల పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ఇక 4, 13 గేట్లు మాత్రమే చేయాల్సి ఉండగా బిల్లుల పెండింగ్‌తో కాంట్రాక్టర్ తాత్కాలికంగా పనులు ఆపేశారన్నారు. అయితే ఆ రెండింటి వద్ద స్టాప్ లాక్ గేట్లను అమర్చి నీటిని నిల్వ చేస్తున్నట్లు వివరించారు. ఆ రెండు గేట్లకు కొత్తవి అమర్చకపోయినా స్టాప్‌లాక్ గేట్లను పెట్టడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈఈ రవికుమార్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 24.38 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 3.859 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.52 మీటర్ల మట్టంతో 3.024 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. ఎగువ నుంచి 389 క్యూసెక్కులు నీరు వస్తుండగా కపపర్తి ఎత్తిపోతల రైతుల విజ్ఞప్తి మేరకు మూడు రోజులు దిగువకు 100 క్యూసెక్కులు వదిలినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల నీటి అవసరాల కోసం కుడి కాలువకు 20 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 94 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నట్లు తెలిపారు.
నెలాఖరుకు నింపేస్తాం..
ఎగువ నుంచి వస్తున్న నీటితో నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌ను నింపే అవకాశం ఉందని ఇంజనీర్లు వివరించారు. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3.859 టీఎంసీల మేర నీటిని నింపితే మోదేపల్లి సమీపంలో దోర్నపువాగు ప్రాంతంలోని కొన్ని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున గతంలో ఉన్నతాధికారులు 3.40 టీఎంసీలు వరకు నింపాలని ఆదే శించారన్నారు. ఆ ప్రకారం ఏటా గతంలో నీటిని నిల్వ చేస్తున్నామని చెప్పారు. ఆమేర నీటిని నిల్వచేస్తే డెడ్‌స్టోరేజీ 1.36 టీఎంసీలు పోను రెండు టీఎంసీలకుపైగా నీరు రిజర్వాయర్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. దాని వల్ల ఆయకట్టు రైతుల వ్యవసాయ అవసరాలు, అలాగే తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. దిగువన కాలువలకు నీటిని వదులుతున్న దానికి అనుగుణంగా ఎగువ నుంచి వస్తున్న నీటిని నదిలోకి విడుదల చేయకుండా నిల్వ చేసుకోవాలని సూచించారు.
Updated Date - Jan 21 , 2025 | 01:43 AM