ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు సంక్షోభం

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:21 AM

జిల్లాలోని రైతులకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి.. మరోవైపు తెగుళ్లు, పురుగుల దాడి పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రధానమైన మిర్చి, శనగ, వరి, కంది, మినుము, పత్తి పంటల్లో ఏ ఒక్కటి కూడా సాధారణ విస్తీర్ణంలో సాగుకు నోచుకోలేదు. వేసినవి కూడా దారుణంగా దెబ్బతిన్నాయి.

ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారం వద్ద మిర్చిని గ్రేడ్‌ చేస్తున్న కూలీలు

తగ్గిన దిగుబడులు.. దిగజారిన ధరలు

ఉధృతంగా తెగుళ్లు, పురుగుల దాడి

ఆపై అతివృష్టి, అనావృష్టి

ప్రధాన పంటలపై తీవ్ర ప్రభావం

సగానికి సగం పడిపోయిన ఉత్పత్తి

మరోవైపు మార్కెట్లో ధరలు పతనం

రైతులకు కోలుకోలేని దెబ్బ

రూ.1,200 కోట్లు నష్టపోయిన వైనం

జిల్లాలోని రైతులకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి.. మరోవైపు తెగుళ్లు, పురుగుల దాడి పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రధానమైన మిర్చి, శనగ, వరి, కంది, మినుము, పత్తి పంటల్లో ఏ ఒక్కటి కూడా సాధారణ విస్తీర్ణంలో సాగుకు నోచుకోలేదు. వేసినవి కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. మిర్చికి నల్లి, ఆకుముడత తెగుళ్లు సోకి.. పత్తికి గులాబి రంగు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరిచాయి. విభిన్న వాతావరణ పరిస్థితులతో కంది, శనగ, వరి దెబ్బతిన్నాయి. మినుము, అలసంద వంటి పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలాది క్వింటాళ్ల పంట ఉత్పత్తికి గండి పడింది. మరోవైపు ఏ ఒక్క పంట ఉత్పత్తులకూ గిట్టుబాటు ధరలు లేవు. ఇంచుమించు అన్నింటి ధరలు గణనీయంగా దిగజారిపోయాయి. దీంతో రైతులు పెట్టుబడులు, రాబడి రూపంలో సుమారు రూ.1,200 కోట్లకుపైగా కోల్పోయారు.

ఒంగోలు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సాగు సంక్షోభం నెలకొంది. కీలకమైన జూలై, నవంబరుల్లో అనావృష్టి, డిసెంబరులో ఎన్నడూ లేనంతగా అతివృష్టి పైర్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీని వల్ల ప్రధాన పంటలు సగం విస్తీర్ణానికి మించి సాగుకు నోచుకోలేదు. సాగైన పంటలపై కూడా తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. ఒక్క పొగాకు మినహా ఇతర పంటలు సాధారణ విస్తీర్ణంలో సాగైన దాఖలాలు లేవు. పొగాకు మార్కెట్‌కు మరికొంత సమయం ఉండగా ఇతర పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతున్నాయి. అలా ప్రస్తుతం ఇళ్లకు చేరుకున్న, మరికొద్దిరోజుల్లో చేరే అవకాశం ఉన్న కంది, పత్తి, వరి, శనగ, మినుము, అలసంద, మిర్చి ఇలా ఏ పంట పరిస్థితి చూసినా వాటి ద్వారా రావాల్సిన రాబడిని రైతులు కోల్పోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పలు పంటలు సాగు చేసిన వారు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు.

మిర్చిని ముంచిన తెగుళ్లు

జిల్లాలో ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలో కలిపి 66వేల ఎకరాలలో మిర్చి సాగైంది. ఎకరాకు సగటున రూ.2లక్షల వరకు సాగుదారులు ఖర్చు చేశారు. సీజన్‌ బాగుంటే కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గతంలో లభించిన ధరలను పరిశీలిస్తే సగటున క్వింటాకు రూ.15వేల వరకూ ఉంది. ఆ ప్రకారం ఎకరాకు మూడు లక్షల రాబడి వచ్చి ఖర్చులు పోను నికరంగా లక్ష మిగులుతుంది. అలాంటిది ఈ ఏడాది మిర్చిపై తెగుళ్లు, పురుగులు తీవ్రంగా దాడి చేశాయి. ఆకుముడత, నల్లిపురుగుతో మొక్కలు గిడసబారాయి. రైతులు చెప్తున్న ప్రకారం ఈ ఏడాది ఎకరాకు 10 క్వింటాళ్లు మించి దిగుబడి వచ్చే అవకాశం లేదు. ధర కూడా క్వింటా రూ.10వేలు మించి లేదు. ఆ ప్రకారం ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిని, మరో రూ.లక్ష రాబడిని వెరసి రూ.2లక్షల వంతున రైతులు కోల్పోనున్నారు. అంటే సాగైన 66వేల ఎకరాలకు దాదాపు రూ.66 కోట్లు పెట్టుబడులు, మరో రూ.66కోట్ల మేర రాబడి వెరసి రూ.132 కోట్ల మేర రైతులు కోల్పోయారు.

శనగకు కలిసిరాని కాలం

రబీలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే శనగ పంటకూ కూడా ప్రతికూ లత ఎదురైంది. సాధారణంగా 1.20లక్షల ఎకరాలలో ఈ పంట సాగు చేస్తారు. అలాంటిది ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవ డంతో 55వేల ఎకరాలలో మాత్రమే సాగైంది. అందులోనూ సగానికి సగం దిగుబడులు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది, క్వింటా రూ.6వేల ప్రకారం చూసినా రూ.45వేల నుంచి రూ.50వేల రాబడి ఉంటుంది. ఖర్చు రూ.20వేలు పోను రూ.25వేల వరకు మిగులుతాయి. అలాంటిది వాతావరణం సరి లేక సాగు జాప్యం కావడంతోపాటు ఎండల తీవ్రత పెరిగింది. ఫలితం గా సగం కూడా దిగుబడులు వచ్చే అవకాశం లేకుండాపోయింది. దాదాపు రూ.125కోట్ల మేర రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.

పత్తిపై పురుగు దాడి

జిల్లాలో సుమారు 75వేల ఎకరాలలో పత్తి పంట సాగైంది. వర్షాలకు కొంత దెబ్బతినింది. గులాబి రంగు పురుగు ధాటికి మిగిలిన విస్తీర్ణంలోనూ దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు సగటున రూ.50వేల వరకు ఖర్చవుతుంది. సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ10వేల ధర ఉంటే లక్ష రాబడి వచ్చి సగం మిగులుతాయి. అలాంటిది ఈ ఏడాది ఆరు క్వింటాళ్లు మించి దిగుబడి లేకపోగా ధర కూడా క్వింటా రూ.6వేలు మించి లేదు. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోగా ఆ పంట ద్వారా రావాల్సిన సుమారు రూ.300 కోట్ల మేర రైతులు కోల్పోయారు.

మినుము, అలసంద సాగుదారులకు మిగిలేదేం లేదు

మినుము పంట ప్రధానంగా రబీలో వేస్తారు. అలా ఈ సీజన్‌లో 28వేల ఎకరాలలో సాగైంది. ఎకరాకు సగటున నాలుగు క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్వింటా రూ.10వేల వరకు ఉంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబరులో కురిసిన వర్షం పంటను దెబ్బతీసింది. ఇంచుమించు మొత్తం విస్తీర్ణంలో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. సాధారణంగా ఎకరాకు రూ.40వేలు రాబడి ఉంటే ఖర్చులు రూ.15వేలు పోను రూ.25వేల వరకు మిగులు ఉంటుంది. అయితే పంట మొత్తం పోవడంతో 28వేల ఎకరాలకు రావాల్సిన రూ.110కోట్లకుపైగా రైతులు కోల్పోయారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో అలసంద సాగు కూడా పెరగ్గా ఆ పంట కూడా దెబ్బతింది. దాదాపు 17వేల ఎకరాలలో ఆ పంట సాగు కాగా అంతా వర్షాలకు దెబ్బతిని దాదాపు రూ.40కోట్ల మేర రైతులు కోల్పోయారు.


కంది పూర్తిగా పోయింది

రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో కంది పంట సాగు చేస్తారు. పూర్తిగా ఖరీఫ్‌ పంట అయిన కంది సాధారణ విస్తీర్ణం సుమారు 2.50లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది లక్షా 75వేల ఎకరాల్లో సాగు చేశారు. బాగా ఎదిగే దశలో నవంబరులో అనావృష్టి, పూత, పిందె బాగా ఉండే డిసెంబరులో అతివృష్టితో పైరు తీవ్రంగా దెబ్బతినిపోయింది. సాధారణంగా ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ.8వేలు ధర ఉన్నా రూ.40వేల రాబడి వస్తుంది. ఖర్చులు రూ.15వేలు పోయినా ఎకరాకు రూ.25వేల వరకు రాబడి ఉంటుంది. అయితే ఈ ఏడాది రెండు, మూడు క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ధర కూడా క్వింటా రూ.6వేలు మించి లేదు. ఆ రకంగా జిల్లాలోని కంది రైతులు ఎకరాకు సగటున రూ.25వేలు వంతున సుమారు రూ.450 కోట్ల మేర రాబడిని కోల్పోయారు.

వరిపై ఆసక్తిచూపని రైతులు

జిల్లాలో వరి పంట కూడా ప్రధానమైనదే. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ సాగు చేస్తారు. అలా ఈ ఏడాది సుమారు 54వేల ఎకరాలలో సాగు చేశారు. నిజానికి ఈ పంట దాదాపు లక్ష ఎకరాల్లో సాగుకావాలి. అయితే లాభసాటిగా లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తిచూపక విస్తీర్ణం తగ్గింది. సాధారణంగా ఎకరాకు సగటున 30 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. క్వింటా రూ.1,600 వరకు ధర ఉంటే రూ.50వేల వరకు వస్తాయి. కానీ చాలాచోట్ల దిగుబడితో 20 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి కనిపించకపోతుండగా ధరలు కూడా అంత ఆశాజనకంగా లేవు. అలా దిగుబడి ఽతగ్గి, ధరలు లేక దాదాపు రూ.90కోట్లకుపైగా రైతులు కోల్పోయారు. మొక్కజొన్న పంటను కూడా కత్తెర పురుగు కాటేయగా ఇతర పలు రకాల పంటలపైనా పురుగులు, తెగుళ్ల దాడి విపరీతంగా పెరిగి నష్టపోయారు.

Updated Date - Feb 09 , 2025 | 01:21 AM