Berates scam: ఎండీసీకి మస్కా
ABN, Publish Date - Jan 02 , 2025 | 02:49 AM
బెరైటీస్ దందాలో ఇదో కొత్త కోణం. జాయింట్ వెంచర్ పేరిట సాగుతున్న నయా దోపిడి. ప్రభుత్వ సంస్థను భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలు పొందుతూ, తిరిగి రూపాయి ఇవ్వకుండా నిలువునా ముంచేస్తున్న దందా ఇది.
భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు మింగేశారు
కానీ, ఎండీసీకి పైసా వాటా ఇవ్వని కడప నేత కంపెనీ
బెరైటీస్ బెనిఫిసియేషన్‌లో గోల్‌మాల్
కడప నాయకుడి చీకటి మంత్రాంగం
ఎండీసీతో 2008లో జాయింట్ వెంచర్
కానీ, సొంతంగా వ్యాపారం
16 ఏళ్లుగా 11 శాతం వాటా ఇవ్వని కంపెనీ
మరో కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం
కాగ్ తప్పుపట్టినా మొద్దునిద్రలో గనులశాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
బెరైటీస్ దందాలో ఇదో కొత్త కోణం. జాయింట్ వెంచర్ పేరిట సాగుతున్న నయా దోపిడి. ప్రభుత్వ సంస్థను భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలు పొందుతూ, తిరిగి రూపాయి ఇవ్వకుండా నిలువునా ముంచేస్తున్న దందా ఇది. ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బెరైటీస్ బెనిఫిసియేషన్‌లో చీకటి దందా సాగుతోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అయినా గనులశాఖ ఏ చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే ఆయన నాటి గనుల మంత్రికి సన్నిహితుడు. కడప జిల్లా వైసీపీ నేత. జగన్ జమానాలో సహజ వనరుల దోపిడికి పాల్పడిన అనేకమందిపై కూటమిప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ, ఈ కడప నేత దోపిడి గురించి తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిలువునా ముంచుతున్న ఈ నేత వ్యవహారం తెలిసినా అధికారులు మౌనంగా ఉంటున్నారు. ఇందుకు కారణ ం ఏమయి ఉంటుంది? వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు బెరైటీస్ వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థతో (ఏపీఎండీసీ) ఉమ్మడి భాగస్వామి గా (జాయింట్ వెంచర్) 2008లో ప్లాంటు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేత ప్లాంట్‌లో ఎండీసీకి 11 శాతం వాటా ఉంది. జాయింట్ వెంచర్ వల్ల ఎండీసీ ఆ కంపెనీకి తక్కువ ధరకే బెరైటీ్‌సను సరఫరా చేస్తోంది. ఇంకా ఇతర సబ్సిడీలు ఆ కంపెనీకి దక్కుతున్నాయి. బెరైటీస్ సరఫరాలో ఈ కంపెనీకి ప్రాధాన్యత కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఏటా నిర్దేశించిన వాటా డబ్బు ఎండీసీకి ఆ నేత కంపెనీ జమచేయాలి. కానీ, కంపెనీ ఏర్పాటయిన 2008 నుంచి నేటివరకు ఎండీసీకి వాటా సొమ్ము రూపాయి కూడా రాలేదు. కానీ, ఏటేటా ఆ కంపెనీకి ఎండీసీ నుంచి సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు ఠంచనుగా వెళ్తున్నాయి. ప్రతి నెల సగటున 5-10వేల టన్నుల బెరైటీ్‌సను ఆ ప్లాంటులో బెనిఫిసియేషన్ చేస్తున్నారు.
కాగ్ ప్రశ్నలతో కదలిక
ఎండీసీ ప్రాజెక్టులు, ఆదాయ వ్యయాలు, అప్పులపై జగన్ ప్రభుత్వంలో కాగ్ పరిశీలన చేసినప్పుడు....కీలక విషయాలు వెలుగుచూశాయి. జాయింట్ వెంచర్ వ్యాపారంలో 11 శాతం వాటాగా ఎండీసీకి ఎంత డ బ్బు జమ అవుతోంది? గత 16 ఏళ్లలో ఇప్పటిదాకా వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? ప్రయోజనాలు, సబ్సిడీల రూపంలో ఆ కంపెనీకి ఎండీసీ ఇచ్చిన దెంత? అన్న కీలక ప్రశ్నలపై కాగ్ పరిశీలన జరిపింది. పేరుకే జాయింట్ వెంచర్ ఒప్పందం జరిగిందని, ఇప్పటివరకు ఎండీసీకి 11 శాతం వాటా కింద రూపాయి దక్కలేదని కాగ్ తేల్చింది. అయితే, వాటా సొమ్ము ఇవ్వని అంశాన్ని ఇప్పటి వరకు బోర్డు సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఆ సంస్థకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకొని ఎందుకు సమీక్షించలేదు? అని కాగ్ ప్రశ్నలు సంధించింది. గనులశాఖ వద్ద దీనిపై ఒక్క సమాధానమూ లేదు. ఆ కంపెనీ యజమాని వైసీపీ నేత అని, నాటి గనుల మంత్రికి అత్యంత సన్నిహితుడన్న సమాచారం తప్ప మరే వివరణ అధికారులు ఇవ్వలేదు. నాటి మంత్రికి సన్నిహితుడనే కారణంతో అధికారులు ఆ కంపెనీకి ఎలాంటి నోటీసు ఇవ్వలేకపోయారన్నది స్పష్టమవుతోంది.
ఎందుకు సీరియ్‌సగా తీసుకోలేదు?
జగన్ జమానాలో గనులశాఖ కేంద్రంగా సాగిన దందాలపై కాగ్ దృష్టి సారించింది. ఇసుక, క్వార్ట్జ్, ఇతర ఖనిజాల దోపిడిపై విచారణ చేస్తోంది. గతంలో జరిగిన తప్పులను నివేదించడంతోపాటు వాటికి పరిష్కారాలు కోరుతోంది. కానీ గనుల శాఖ ఈ విషయాన్ని దాచిపెట్టింది. జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసిన నేత 16 ఏళ్లుగా వాటా సొమ్ము ఇవ్వడం లేదన్న అంశాన్నే సర్కారుకు నివేదించలేదు. దీంతో ఈ విషయం ప్రభుత్వ పరిశీలనకు రాకుండాపోయింది. అధికారులు ఈ విషయాన్ని అంత తీవ్రమైనదిగా తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది?
చీకటి వ్యాపారం
కాగ్ నివేదిక తర్వాత కడప నేత రూటు మార్చారు. సొంతంగా మరో మినరల్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ పేరిట నేరుగా మిల్లుల నుంచి బెరైటీస్ కొనుగోలు చేస్తున్నారు. వాటి ఎండీసీతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలో బెనిఫిసియేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఎండీసీకి 11 శాతం వాటా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన. కానీ, జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం, ఆ ప్లాంటు ద్వారా జరిగే ప్రతీ వ్యాపారంలో ఎండీసీకి వాటా ఇచ్చితీరాల్సిందే. ఈ చీక టి వ్యాపారం గురించి గనులశాఖ అధికారులకు తెలిసినా మిన్నుకుండిపోయారు. ప్రభుత్వ సంస్థను నిలువునా ముంచేస్తున్నా గనుల శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? కూటమి ప్రభుత్వంలో కూడా ఆ నేత కంపెనీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Jan 02 , 2025 | 02:49 AM