ఎమ్మెల్సీ పోలింగ్ 69.50 శాతం
ABN, Publish Date - Feb 28 , 2025 | 01:22 AM
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరిగింది.
మందకొడిగా మొదలు..
పట్టభద్రుల్లో కానరాని ఉత్సాహం
మధ్యాహ్నానికి తేరుకున్న కూటమి కేడర్
అప్పటికప్పుడు ఓటర్లను రప్పించిన నేతలు
ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ
రాజశేఖర్, వీరరాఘవుల మధ్యేపోటీ
దొంగ ఓట్లేశారంటూ టీడీపీపై వామపక్షాల ఆరోపణ
పోలింగ్ కేంద్రాల్లో కలియతిరిగిన కలెక్టర్, ఎస్పీ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరిగింది. గోదావరి జిల్లాల్లో ఏ ఎన్నికలు వచ్చినా హడావుడే కనిపిస్తుంది. కాని, ప్రచారంలో కనిపించినంత వేగం పోలింగ్ కేంద్రాలకు వచ్చే సరికి చప్పబడింది. 456 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 3,14,984 మంది ఓటర్లకు 2,18,902 మంది ఓట్లు వేశారు. పోలింగ్ శాతం 69.50గా నమోదైంది.
సాధారణ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో ఓటర్లు తొలి రెండు గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు భావించారు. దీనికి భిన్నంగా ఓటర్లలో అలాంటి ఉత్సాహం కనిపించలేదు. ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో కేవలం 5.77 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యా యి. ఆరంభంలోనే అనేక పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఉదయం 11 గంటల తర్వాత క్రమేపీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడం ఆరంభమైంది. ఉమ్మ డి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఇదే వాతావరణం కనిపించింది. తొలి నాలుగు గంటల్లోనే కేవలం 20 శాతమే నమోదైంది. పోలింగ్ శాతం అతి తక్కువగా ఉండడంతో టీడీపీ వర్గాలు మధ్యాహ్నానికి అప్రమత్తమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రా లను సందర్శించారు. స్వేచ్ఛగా ఓటు వేయడంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అతి తక్కువ ఓటర్లున్న అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలింగ్ శాతంలో ముందు వరుసలో నిలిచింది. 4,669 మంది ఓటర్లకు 3,637 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.90 శాతం పోలింగ్ నమో దైంది. ఈ జిల్లాలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య అత్యల్పమే. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 29,651 మంది ఓటు హక్కును వినియో గించుకున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులో అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పలుచగానే కనిపించారు. నిర్ణీత సమయా నికి ముందుగానే పోలింగ్ కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఉంగుటూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు ఒకవైపు, తెలుగు దేశం జిల్లా అఽధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఉండి పరిస్థితిని అంచనా వేస్తూ వచ్చారు. పోలవరం నియోజకవర్గంలో ఆది నుంచి ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. కుక్కునూరు పోలింగ్ కేంద్రంలో దాదాపు 75 శాతం మేరకు పోలింగ్ నమోదు కాగా, వేలేరుపాడులో 81.31 శాతం నమోదు కావడం విశేషం దెందులూరు నియోజక వర్గంలో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సా హంగా ముందుకు కదిలారు. చింతలపూడి నియోజకవర్గంలో వివిధ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు.
అధికారుల సందర్శన
పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శిం చారు. ఏలూరు ఆర్డీవో అంబరీష్‌తో కలిసి నగరంలోని సెయింట్ గ్జేవియర్, అశోక్‌నగర్‌లోని పీడీబీటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ సెయింట్ గ్జేవియర్ హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
పోలింగ్ ఆసాంతం పోటాపోటీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ఒకవైపు మందకొడిగా సాగి నా.. ఇంకోవైపు తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు మఽధ్య పోటీ హోరా హోరీగా సాగినట్లే కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం, పీడీఎఫ్ అనుకూలురు ఎక్కడికక్కడ గుమి గూడి ప్రచారం చేశారు. ఈ నేపఽఽఽథ్యంలో టీడీపీ పక్షాన ఓటర్లకు ఎరవేసేందుకు ప్రయత్నిం చారంటూ పీడీఎఫ్ అభ్యర్థి మద్దతుదారులు ఆరోపణలు చేశారు. ఎన్నికల నిబంధనలకు పాతరేసి డబ్బులు పంపిణీ చేస్తూ అక్రమా లకు పాల్పడ్డారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లింగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల శిబిరాల పేరుతో జాతరలా నిర్వహించారని, దొంగ ఓట్లు వేసేందుకు బరి తెగించారంటూ టీడీపీపై ఆరోపణలు చేశారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల అఽధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు పెదవేగిలో అఽధికార పార్టీ నేతలు పీడీ ఎఫ్ అభ్యర్థి ఏజెంట్లు, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాఽఽధ్యక్షుడు రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా అఽధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఓటర్ల స్లిప్పులు ఎక్కడ ?
అధికార యంత్రాంగం గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓటర్ల స్లిప్పు ల పంపిణీ సక్రమంగా చేయలేకపోయిం ది. దీంతో ఓటర్ల స్లిప్పుల కోసం పడిగాపు లు, ఎదురుచూపులు తప్పలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, పీడీఎఫ్ నేతలు ఏర్పాటు చేసిన టెంట్ల వద్ద ఓటర్ స్లిప్పుల ను తీసుకుని వేశారు. కొంత మంది ఎన్ని కల సంఘం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వచ్చి ఓట్లేశారు.
ఓటు వేసిన ప్రముఖులు
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓటు వేసిన ప్రముఖుల్లో భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, భీమ వరంలో శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు, తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి, ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి, పోలవరంలో బాలరాజు, కైకలూరులో కామినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు తమ ఓటును వినియోగించుకున్నారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి సారథి
చాట్రాయి : నూజివీడు ఎమ్మెల్యే, గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం చాట్రాయిలో ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించారు. గ్రామాల వారీగా మొత్త ఓట్లు, నమోదయిన ఓట్ల వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు.
స్ర్టాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా పూర్తికావడంతో, బ్యాలెట్ బాక్సులకు ప్రత్యేకమైన సీళ్లు వేసి, పోలీస్ బందోబస్తు నడుమ ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌రూమ్‌కు రూట్ల వారీగా పీవోలు చేర్చుతున్నారు. వీటిని జిల్లాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో 456 పోలింగ్ కేంద్రాల బాక్సులను స్ర్టాంగ్ రూమ్‌ల్లో ఏర్పాటు చేసిన మార్కింగ్ వద్ద బాక్సులు ఉంచి ఆ గదికి సీల్ వేస్తారు. మార్చి 3న జరిగే కౌంటింగ్ వరకు భారీ భద్రతను కల్పిస్తారు. అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ రోజున బ్యాలెట్ బాక్సులను నియమిత ప్రకారం నిర్దేశించిన టేబుళ్లపై తీసుకొచ్చి 17 రౌండ్ల మేర కౌంటింగ్ చేపడతారు.
బ్యాలెట్లకు పటిష్ఠ భద్రత : కలెక్టర్
ఏలూరు/ ఏలూరు క్రైం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంఽధించిన బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ భద్రత కల్పించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సర్ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్ రూమ్‌లను గురువారం పరిశీలించారు. సీసీ టీవీ పర్య వేక్షణ కేంద్రాన్ని, కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేసిన టేబుళ్లను పరిశీలించారు. జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వర రావు, ఆర్డీవో అంబరీష్, రమణ, కమిషనర్ భానుప్రతాప్ పాల్గొన్నారు.
విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలి : ఎస్పీ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కేపీఎస్ కిశోర్ గురువారం రాత్రి ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ బ్యాలెట్ బాక్సులను, స్టాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలను పరిశీలించారు.
Updated Date - Feb 28 , 2025 | 01:22 AM