నల్లమల కష్టాలు
ABN, Publish Date - Feb 11 , 2025 | 11:26 PM
దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్‌గా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలో రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి.
జాతీయ హోదా దక్కినా విస్తరణకు నోచుకోని కేజీ రోడ్డు
సింగిల్ లైన్ మార్గంతో తరచూ ప్రమాదాలు
అమరావతికి పెరిగిన రాకపోకలు
ఇబ్బందిగా రోళ్లపెంట ఘాట్ ప్రయాణం
ఆత్మకూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్‌గా పేరొందిన నల్లమల అటవీ ప్రాంతంలో రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. కర్నూలు నుంచి గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంతాలకు నల్లమల మీదుగానే వెళ్లాలి. కర్నూలు-గుంటూరు(కేజీ) జాతీయ రహదారిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటవీ శాఖ అవాంతరాలతో జాతీయ రహదారి కాస్తా సింగిల్‌రోడ్డుగా మిగిలింది. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా కేజీ రహదారితో పాటు ఘాట్‌రోడ్డులో ఏ చిన్న ప్రమాదం జరిగినా, దారిలో ఎక్కడైనా వాహనాలు మరమ్మతులకు గురైనా వాహనాల రాకపోకలు స్తంభించిపోవాల్సిన పరిస్థితి. రాత్రివేళల్లో ఈ సంఘటనలు చోటు చేసుకుంటే రాత్రంతా అడవిలో నరకయాతనకు గురికావాల్సిందే. ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే రాష్ట్ర విభజన నేపఽథ్యంలో విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడంతో 2018 జనవరి 18వ తేదిన కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిని ఎన్‌హెచ్ 340సీ నంబర్ పేరిట కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చేసింది. కేజీరోడ్డు నేషనల్‌హైవేగా హోదా దక్కించుకున్నప్పటికీ నల్లమల అటవీ ప్రాంతంలో సింగిల్‌లైన్ రోడ్డుగా ఉండటం వల్ల సమస్య తీరలేదు. దీనికితోడు విజయవాడను రాజధాని చేయడం వల్ల కర్నూలు జిల్లా నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో కేజీ రోడ్డుపై ట్రాఫిక్ మరింతగా పెరిగింది.
జాతీయ హోదా దక్కినా తప్పని కష్టాలు
కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి జాతీయ రహదారిగా హోదా దక్కించుకోవడంతో ప్రస్తుతం కర్నూలు ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు చకచక సాగిపోతున్నాయి. వాస్తవానికి కర్నూలు నుంచి గుంటూరుకు రహదారి మార్గాన వెళ్లాలంటే 306.6కిమీల దూరం వెళ్లాల్సి వుంటుంది. ఇందులో కర్నూలు నుంచి దోర్నాలకు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇంతకాలం కర్నూలు నుంచి ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామశివారు వరకు కేజీరోడ్డు రెండులైన్లు ఉండగా ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రోళ్లపెంట ఘాట్‌లో ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. ఆత్మకూరు నుంచి సరిగ్గా 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన కొండలపై నిర్మించిన ఘాట్‌రోడ్డును ఎక్కేందుకు భారీ, గూడ్స్ వాహనాలు మోరాయిస్తున్నాయి. ఘాట్ ఎక్కలేక అనేక మార్లు బ్రేక్ ఫెయిల్ కావడం, ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు రావడం, ఘాట్ ఎక్కలేక వెనక్కి వచ్చి కొండను ఢీకొట్టడం వంటి సంఘటనలు జరిగి వాహనాలు దారికి అడ్డంగా నిలిచిపోతున్నాయి. అదేవిధంగా ఘాట్ దిగే వాహనాలు సైతం వేగంగా రావడం వల్ల రోడ్డు ఇరుగ్గా ఉండటంతో కొండను ఢీకొనడం, పక్కనే ఉన్న గుంతల్లో పడిపోవడం, బ్రెక్‌ఫెయిల్ కావడం వంటి ప్రమాదాలకు గురవుతున్నాయి.
బైర్లూటి నుంచి ప్రకాశం జిల్లా మంతనాల వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరం పాటు అటవీ మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. ఈ దారిలోనే రోళ్లపెంట ఘాట్‌తో పాటు ప్రమాదకరమైన రహదారి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్డు ఇరుగ్గా ఉండటంతో పాటు అక్కడక్కడ రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. అలాగే పలుచోట్ల రహదారికి ఇరువైపుల రక్షణ గోడలు, సూచికలు లేకపోవడంతో కేజీ రహదారి అంటేనే ప్రయాణికులు, వాహన చోదకులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రహదారిని బాగు చేయాలని అనేక మార్లు రవాణాశాఖ అధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచిస్తున్నారు. అయితే టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదు. దీనికి ఇటీవల అడవులకు విఘాతం కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టరాదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్లమలలోని కేజీ రహదారి విస్తరణకు అనుమతులు వస్తాయా..? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. దీంతో కర్నూలు నుంచి గుంటూరు, కాకినాడ, చీరాల, విజయవాడ, మంగళగిరి, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోల్, రాజమండ్రి, విశాఖపట్నం, మాచర్ల తదితర ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికులకు నల్లమలలోని కేజీ రహదారిపై అవస్థలు తప్పడం లేదు.
చర్యలు చేపడితేనే...
కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై అక్కడక్కడ పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. నల్లమలలోని ప్రమాదకర ఘాట్ల వద్ద రహదారికి ఇరువైపుల రక్షణ గోడలను ఏర్పాటు చేయాలి. రోడ్డుకు ఇరువైపుల కాంక్రీట్‌తో పటిష్ట చర్యలు చేపట్టాలి. రోళ్లపెంట ఘాట్ రోడ్డులో అన్‌ఫిట్ వాహనాలను, భారీ గూడ్స్ వాహనాలను అనుమతించరాదు. ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద తప్పనిసరిగా విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాహనం ఘాట్ ఎక్కలేక నిలిచిపోయినప్పటికీ పక్కకు నెట్టేందుకు వీలుగా రోడ్డు విస్తరణ చేపట్టాలి. వీటితో పాటు నిత్యం పెట్రోలింగ్ వాహనం నల్లమల అటవీ ప్రాంతం, ఘాట్‌రోడ్డులో పర్యవేక్షణ సాగిస్తే.. ప్రమాదాలు, ట్రాఫిక్ సమయంలో సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం వుంటుంది.
Updated Date - Feb 11 , 2025 | 11:26 PM