మహానందీశా.. నమోనమః
ABN, Publish Date - Mar 01 , 2025 | 12:07 AM
ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శుక్రవారం సాయంత్రం మహానందీశ్వరుడి రథోత్సవం వైభవంగా కొనసాగింది.
మహానందిలో వైభవంగా రథోత్సవం
శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
మహానంది, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శుక్రవారం సాయంత్రం మహానందీశ్వరుడి రథోత్సవం వైభవంగా కొనసాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా మహానందీశ్వర స్వామి, కామేశ్వరీ అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వివాహ పెద్దగా వ్యవహరించిన నంద్యాల బ్రహ్మానందీశ్వరుని ఉత్సవమూర్తులకు ఆలయ వేదపండితులు పూజలు జరిపారు. అనంతరం ఆలయం సమీపంలోని రథశాల వద్ద ఆలయ ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రథాంగ పూజ, హోమం తదితర పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం కుమ్మరి వీరయ్య భక్తి శ్రద్ధలతో కుంభాన్ని రథశాల వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన రథోత్సవం గంటపాటు కొనసాగింది. ఈ ఉత్సవానికి నంద్యాల జిల్లా న్యాయాధికారి వాసు, ఉప న్యాయాధికారి రాధారాణి, ఏడీఎం లక్షీ, ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఉత్సవాల ప్రత్యేకాధికారి రామాంజనేయులు, తహాసీల్దార్ రమాదేవి, ఏఈఓ ఎర్రమల్ల మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, దేవిక, ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసులు, పసుపుల సుబ్బారెడ్డి, అర్చకులు మామిళ్ళపల్లి రాఘవేంద్రశర్మ, మణికంఠశర్మ, వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా అశ్వవాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆశ్వవాహనంపై మహానందీశ్వర స్వామి, కామేశ్వరీ అమ్మవారు విహరించారు. రథోత్సవం అనంతరం రాత్రి పుష్పశయనోత్సవాన్ని నిర్వహించారు. కాగా నేడు మహా పూర్ణాహుతి, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలోని రుద్రగుండం కోనేరులో ఉత్సవ మూర్తులకు త్రిశూల స్నానం, కలశ ప్రదక్షిణ, యాగశాల మండపంలో మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ వెల్లడించారు.
Updated Date - Mar 01 , 2025 | 12:07 AM