అమృత్ భారత్‌గా కర్నూలు స్టేషన్..?
ABN, Publish Date - Feb 25 , 2025 | 12:07 AM
అమృత్ భారత్ స్టేషన్‌లో భాగంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ (రీ మోడలింగ్) పనులు చేపట్టారు.
ముందుకుసాగని పనులు
రూ.42.62 కోట్లతో పునరుద్ధరణ పనులు
2023 ఆగస్టు 5న వర్చ్చువల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన
ఏడాదిన్నర కావస్తున్నా పనుల్లో పురోగతి అంతంతే
మూడు నెలల్లో పూర్తి చేస్తామంటున్న రైల్వే ఇంజనీర్లు
ఇది సాధ్యమేనా..? అంటున్న రైల్వే ప్రయాణికులు
అమృత్ భారత్ స్టేషన్‌లో భాగంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ (రీ మోడలింగ్) పనులు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ను మరింత ఆధునికీకరించి, వెంకటరమణ కాలనీ వైపు రెండో ద్వారం ఏర్పాటు చేస్తే తమ కష్టాలు తీరుతాయని రైల్వే ప్రయాణికులు ఆశించారు. ఏడాదిన్నర దాటినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. మరో ఏడాదైనా పూర్తయ్యేలా లేదు. రూ.42.62 కోట్లతో చేపట్టిన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల తీరుపై ఆంధ్రజ్యోతి కథనం.
కర్నూలు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు రైల్వే స్టేషన్‌కు 120 ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వమే 1905లో స్టేషన్ ప్రయాణికుల వినియోగంలోకి వచ్చింది. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 2013-14లో కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు స్టేషన్‌ను సిటీ రైల్వే స్టేషన్‌గా మార్చారు. దీంతో రైల్వే శాఖలో మంచి గుర్తింపు వచ్చింది. 2019లో రూ.28 కోట్లతో స్టేషన్ రూపురేఖలు మార్చారు. స్టేషన్ ముఖద్వారం అధునికీకరణ, స్టేషన్‌లో పచ్చదనం, వాహనాల పార్కింగ్, ప్లాట్ ఫారం పునరుద్ధరణ, టికెట్ కౌంటర్, ప్రయాణిలకు విశ్రాంతి గదులు, స్టేషన్ ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటులాంటి వివిధ పనులు చేపట్టారు. 120 ఏళ్ల స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ప్రతి రోజూ 12-15 వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు సగటు ఆదాయం రూ.2.10 కోట్లు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద 2023లో శ్రీకారం చుట్టింది. రూ.42.6 కోట్లతో చేపట్టే పునరుద్ధరణ పనులకు అదే ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి జాతీయ స్థాయి అంగులతో స్టేషన్‌ను తీర్చిదిద్దుతామన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పడమర వైపు రెండో ద్వారా, టికెట్ కౌంటర్.. వంటి పనులు చేపట్టారు. అయితే.. పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు అసౌకార్యానికి గురవుతున్నారు.
ఇంకెన్నాళ్లు..?:
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మోడలింగ్ పనులు ఆలస్యంగా మొదలయ్యాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. స్టేషన్ పడమర దిశగా వెంకటరమణ కాలనీ వైపు రెండో ప్రధాన ప్రవేశ ద్వారం నిర్మాణం. పార్కింగ్, రైల్వే బుకింగ్ కౌంటర్, తూర్పు వైపున ప్రస్తుత ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీనీకరణ, సుందరీకరణ, తూర్పు, పడమర ద్వారాలు కలుపుతూ ఫుట్ ఓవర్ బిడ్జి నిర్మాణం, ప్రమాణీకులు వివిధ ప్లాట్‌ఫారంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో అవసరం లేని కట్టడాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు, ట్రాఫిక్ సర్య్కులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్.. వంటి పనులు ఆధునిక ఆర్కిటెక్చర్, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే.. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 12 నెలల్లో పూర్తి చేస్తామని శంకుస్థాపన సమయంలో రైల్వే అధికారులు చెప్పారని, ఇప్పటికే ఏడాదిన్నర కావస్తున్నా 25-30 శాతం పనులు జరగలేదని కర్నూలు నగరానికి చెందిన రైల్వే ప్రయాణికుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటకరణ కాలనీ వైపు టికెట్ కౌంటర్ భవనం నిర్మాణం పనులు ఒక్కటే జరుగుతున్నాయి. ఇతర పనులు మొదలు కాలేదు.
మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చేనా..?
రైల్వే స్టేషన్ పడమర వైపున వెంకటరమణ కాలనీ, అశోక్‌నగర్, లేబర్‌కాలనీ, సంతోష్ నగర్, బాలజీ నగర్, కప్పలనగర్.. వంటి కాలనీలు విస్తరిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ కూడా ఇక్కడికే దగ్గర అవుతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే అశోక్‌నగర్ దగ్గర ఉన్న రైల్వేలైన్ అండర్ బిడ్జి దిగువ నుంచి చేరుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్, కల్లూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణిలు ఐదు రోడ్ల కూడలి మీదుగా రావాలి. వర్షం కాలంలో రైల్వే లైన్ అండర్ బిడ్జిలో వర్షపు నీటితో నిండిపోయి ప్రయాణిల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అంతేకాదు.. ఒక్కోసారి రిజర్వేషన్ చేసుకున్న రైలును కూడా మిస్ అవ్వాల్సి వస్తుంది. వెంకటరమణ కాలనీ వైపు రెండవ ద్వారం (సెకండ్ ఎంట్రీ గేట్) ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సెకండ్ ఎంట్రీ గేట్ ఏర్పాటు పనులు చేపట్టినా.. కాంట్రాక్టర్ అలసత్వమో మరే ఇతర కారణాలో అధికారులకే ఎరుక. పనుల్లో పురోగతి మందగించడం విమర్శలకు తావిస్తుంది. కీలకమైన రెండు ప్రధాన ద్వారాలు కలుపుతూ నిర్మించి ఫుడ్ ఓవర్ బిడ్జి పనులు మొదలే కాలేదు. ఇప్పటికైనా రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి గడువులోగా పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
మూడు నెలల్లో పూర్తి చేస్తాం
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ రీ మోడలింగ్ పనులు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.42.62 కోట్లతో చేపట్టాం. స్టేషన్ పునరుద్ధరణతో పాటు పడమర వైపు రెండవ ద్వారం, టికెట్ కౌంటర్, ఫుట్ ఓవర్ బిడ్జి పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ఆలస్యంగా మొదలు పెట్టిన మాట నిజమే. మూడు నెలల్లో పూర్తి చేసి పడమర వైపు టికెట్ కౌంటర్ ప్రారంభిస్తాం.
- సత్యనారాయణ, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీరు, మహబూబ్‌నగర్
Updated Date - Feb 25 , 2025 | 12:07 AM