కంది రైతు కన్నీరు
ABN, Publish Date - Mar 02 , 2025 | 11:50 PM
కంది రైతు కన్నీరు
పంట దిగుబడి నాణ్యంగా లేదని వెనక్కి పంపుతున్న సీడబ్ల్యూసీ అధికారులు
దళారులే నయమంటున్న రైతులు
మార్కెట్ యార్డులో అమ్ముకుంటున్న వైనం
వెంకటేశ్వరరెడ్డి డోన్ మండలం రామదుర్గం నివాసి. డోన్ మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రానికి 15 సంచుల్లో కందులను అమ్మకానికి తీసుకువచ్చాడు. ఆటో ఖర్చులతోపాటు, హమాలీలకు ఒక సంచికి రూ.300 చొప్పున చెల్లించాడు. ఇంత వ్యయ ప్రయాసలకోర్చి కందులు తీసుకొచ్చాడు. అయితే.. కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు కందులు నాణ్యంగా లేవన్నారు. మరోదారి లేక రైతు కందులు వెనక్కి తీసుకువచ్చి శుభ్రం చేసి కొనుగోలు కేంద్రానికి అప్పగించాడు. దీని వల్ల రైతుకు రెట్టింపు ఖర్చు అయింది. మార్క్‌ఫెడ్ అధికారులు మద్దతు ధర చెల్లించినా రవాణా ఖర్చులు పెరిగిపోయి కనీసం గిట్టుబాటు కాలేదని రైతు వెంకటేశ్వరరెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలకు కందులు అమ్మడానికి తీసుకెళ్తున్న వందలాది మంది రైతుల దుస్థితి ఇది.
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో క్వింటం కందులకు మద్దతు ధర రూ.6వేల నుంచి రూ.7వేలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం క్వింటం ధర రూ.7,550 నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కంది పంట ఖరీఫ్‌లో పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. కనీసం ఈ మాత్రం పంట దిగుబడినైనా మార్క్‌ఫెడ్ సంస్థకు విక్రయించి మద్దతు ధర పొందాలని ఉమ్మడి జిల్లా రైతులు ఆశించారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నా గోదాముల్లో వాటిని నిల్వ చేసేందుకు సీడబ్ల్యూసీ అధికారులు కొర్రీల మీద కొర్రీలు వేస్తూ రైతులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వాళ్లకు దిక్కుతోచడం లేదు. రైతుల బాధ చూడలేకపోతున్నామని మార్క్‌ఫెడ్ అదికారులు, డీసీఎంఎస్ కేంద్రాల సిబ్బంది అంటున్నారు. కందులను కొనుగోలు చేసినా గోదాముల్లో నిల్వ చేసేందుకు సెంట్రల్ వేర్ హౌస్ అధికారులు పర్మీషన్ ఇవ్వకపోవడంతో రైతులు తిరిగి కందులను వెనక్కి తీసుకపోతున్నారు. రైతులకు ఇది ఆర్థికంగా మరింత భారమవుతున్నది. శ్రమ అవుతున్నది. అందుకని చాలా మంది రైతులు మరోదారి లేక కర్నూలు మార్కెట్ యార్డులో తక్కువ ధరకే దళారులకు పంట దిగుబడి పెడుతున్నారు. సీడబ్ల్యూసీ అధికారులు నాణ్యత నిబంధనలు చూపుతూ తమకు అన్యాయం చేస్తుండటంతో తమకు దళారులే దిక్కు అవుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
3లక్షల ఎకరాల్లో కంది పంట సాగు
ఖరీఫ్‌లో రైతులు పండించిన కందులను చివరి గింజ దాకా మద్దతు ధర రూ.7,550 కొంటామని కేంద్ర సంస్థ నాఫెడ్‌తో పాటు రాష్ట్ర సంస్థ మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 4 క్వింటాళ్లు మాత్రమే చేతికందడంతో రైతులు నష్టానికి గురయ్యారు. మార్క్‌ఫెడ్ అధికారుల హామీతో దిగుబడి తగ్గినా మద్దతు ధర అయినా అందుతుందనే ఆశతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు వ్యయప్రయాసల కోర్చి డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలకు కందులు తీసుకొచ్చారు. మొదట్లో మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా కర్నూలు జిల్లాలో 56వేల టన్నులు, నంద్యాల జిల్లాలో 44వేల టన్నులు కొంటామని మూడు నెలలకిందటే అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ ఇదిగో.. అదిగో అంటూ ఫిబ్రవరిలో రైతుల నుంచి కందులు కొనడానికి డీసీఎంస్ ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మధ్యలో ఏమైందో తెలియదు గాని, కొనుగోళ్లను భారీగా తగ్గించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 13వేల మెట్రిక్ టన్నులు, నంద్యాల జిల్లాలో 9వేల మెట్రిక్ టన్నులు కందులను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు క్వింటం కందులకు రూ.6వేల నుంచి 7వేలలోపే ధరను అందించడమే కాకుండా తరుగు, తేమ తదితర కారణాలతో ఒక బ్యాగు కందుల మీద 4 కిలోలు తీసుకుంటున్నారు. వ్యాపారుల అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం లేదని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అంటున్నారు. కర్నూలు జిల్లాలో ఇప్పటి దాకా 2,600 మెట్రిక్ టన్నులను 1870 మంది రైతుల నుంచి కొన్నామని, వారికి రూ.7.70 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే 1.58 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని మార్క్‌ఫెడ్ మేనేజర్ రాజు తెలిపారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 1,800 మెట్రిక్ టన్నుల కందులను 1,345 మంది రైతుల నుంచి కొన్నారు.
నాణ్యత లేదని వెనక్కి పంపుతున్న సీడబ్ల్యూసీ అధికారులు
ప్రస్తుతం కేడీసీఎంఎస్ కేంద్రాల రైతుల నుంచి కందుల కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేంద్రాల్లో నాణ్యతను పరిశీలించిన తర్వాతనే లారీల్లో వాటిని కేంద్ర గిడ్డంగుల సంస్థకు పంపుతున్నారు. అయితే.. వివిధ కారణాలతో కందులను గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు కేంద్ర గిడ్డంగుల సంస్థ నానా రకాలుగా ఆటంకాలు సృష్టించడంతో కొనుగోలు కేంద్రాల సిబ్బందికి దిక్కుతోచడం లేదు. దీంతో కొన్న కందులను లారీల్లో మళ్లీ వెనక్కి తీసుకువచ్చి రైతులకు అప్పజెప్తున్నారు. ఈ పరిణమానికి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రవాణా ఖర్చులు, హమాలీల ఖర్చులు కలుపుకుంటే తమకు మార్క్‌ఫెడ్ అధికారులు చెల్లిస్తున్న మద్దతు ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, మార్కెట్ యార్డుల్లో వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని రైతులు కర్నూలు మార్కెట్ యార్డుకు వెళుతున్నారు. తమకు మామూళ్లు ఇవ్వడం లేదనే సాకుతో పాటు వివిధ కారణాల వల్ల కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే కందులను గోదాముల్లోకి అనుమతించకుండా వెనక్కి పంపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు దాదాపు వందల మెట్రిక్ టన్నుల కందులు తీసుకొస్తున్నారు.
కేంద్ర గిడ్డంగుల సంస్థ రైతులకు న్యాయం చేయాలి
కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కందులను నిల్వ చేసుకుండా తప్పించుకొనేందుకు రకరకాల కారణాలు చెబుతున్నది. డీసీఎంఎస్ కేంద్రాల వద్ద కందులు నాణ్యంగా ఉంటేనే మా సిబ్బంది రైతుల నుంచి కొంటున్నారు. అలాంటప్పుడు కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు కందులు నాణ్యంగా లేవని వెనక్కి పంపడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని నిబంధనలను కొంత మేరకు సడలించాలని విజ్ఞప్తి చేశాం. రైతులు ఇంటి వద్దనే కందులు శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నాం. కందులు కొన్న తర్వాత గంటల వ్యవధిలో రైతులకు డబ్బు చెల్లిస్తున్నాం.
- రాజు, జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్
Updated Date - Mar 02 , 2025 | 11:50 PM