అసెంబ్లీకి చేరిన గుండ్రేవుల..!
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:36 PM
గుండ్రేవుల జలాశయం అంశం అసెంబ్లీకి చేరింది. రాయలసీమ ప్రజల ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టుపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని విన్నవించారు.
చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన ఎమ్మెల్యే గౌరు చరిత
నివేదిక కోరిన శాసనసభ సెక్రెటరీ జనరల్
సమగ్ర వివరాలతో నివేదిక పంపిన ఇంజనీర్లు
2019లో నిధులు కేటాయించిన చంద్రబాబు
పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
కర్నూలు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గుండ్రేవుల జలాశయం అంశం అసెంబ్లీకి చేరింది. రాయలసీమ ప్రజల ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టుపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని విన్నవించారు. ఆమె విజ్ఞప్తిని స్వీకరించిన స్పీకర్ ప్రశ్న నంబరు 802 కింద చర్చించేందుకు ఆమోదం తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర జలవనరుల శాఖ అధికారులను కోరారు. పూర్తి వివరాలతో జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు నివేదిక పంపారు. అసెంబ్లీ సాక్షిగా గుండ్రేవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. 2019 ఫిబ్రవరి 21 అప్పటి సీఎం చంద్రబాబు రూ.2,890 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతర్ రాష్ట్ర సమస్య అంటూ అటకెక్కించారు.
ఉమ్మడి కర్నూలు, నంద్యాల సహా కడప జిల్లాల్లో కేసీ కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కేడబ్ల్యూడీటీ-1 (బచావత్ అవార్డు) మేరకు 31.90 టీఎంసీల నీటివాటా ఉంది. అందులో 10 టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి తీసుకోవాల్సి ఉంటే.. 21.90 టీఎంసీలు తుంగభద్ర నదీప్రవాహం ద్వారా తీసుకోవాలి. అయితే ఏటేటా తుంగభద్ర వరద రోజులు తగ్గిపోతుండడంతో కేసీ కాలువ చివరి ఆయకట్టు, రబీ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. అదే క్రమంలో కర్నూలు నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుంకేసుల జలాశయం ఫోర్‌షోర్ ఏరియాలో తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించడం వల్ల వేసవిలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుంకేసుల జలశయం ఎగువన సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామం సమీపంలో తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీరు సుబ్బరాయుడు ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసి సమగ్ర వివరాలతో 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్పందించిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వే, డీపీఆర్ తయారీ కోసం రూ.54.95 లక్షలు నిధులు మంజూరు చేస్తూ 2013 నవంబరు 1న జీవో ఎంఎస్ నంబరు.100 జారీ చేశారు. హైదరాబాదుకు చెందిన ఆర్వే ఆసోసియేట్స్ సంస్థ ప్రాజెక్టుపై అధ్యయనం చేసి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) ఇచ్చారు.
ఈ నివేదిక ఆధారంగా 2019 ఫిబ్రవరి 21న నాటి టీడీపీ ప్రభుత్వం రూ.2,890 కోట్లు మంజూరు, సూత్రపాయ పరిపాలన ఆమోదం ఇస్తూ జీఓ నం.153 జారీ చేసింది. మార్చి 2న గుండ్రేవుల, ఎల్లెల్సీ బైపాస్ కెనాల్‌పై నిధులు మంజూరు శిలాఫలకాన్ని నాటి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర సమస్య అంటూ గుండ్రేవుల ప్రాజెక్టు ఫైల్‌ను ఐదేళ్లు అటకెక్కించింది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా సీఎం చంద్రబాబు, యువగళం పాదయాత్ర సమయంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే గుండ్రేవుల ప్రాజెక్టును చేపడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
అసెంబ్లీలో చర్చకు అవకాశమివ్వండి
కర్నూలు, నంద్యాల జిల్లాలకు జీవనాడి కానున్న గుండ్రేవుల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం ఇచ్చారు. ఆమె విన్నపాన్ని స్వీకరించిన స్పీకర్ ఇదే అంశాన్ని ప్రశ్న నంబరు.802 కింద ఎమ్మెల్యే గౌరు చరిత అడిగేలా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత సమగ్ర వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీని కోరారు. ఆయన ఆదేశాల మేరకు ఇరిగేషన్ కర్నూలు సర్కిల్ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో.. సమగ్ర వివరాలతో నివేదిక పంపించారు. ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గుండ్రేవుల ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టమైన హామీ వచ్చే అవకాశం ఉందని సాగునీటి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Mar 06 , 2025 | 11:36 PM