మహిళా సాధికారతకు ప్రభుత్వాలు కృషి
ABN, Publish Date - Mar 08 , 2025 | 11:04 PM
మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి అన్నారు.
ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నంద్యాల నూనెపల్లె, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నంద్యాల పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎంపీ, కలెక్టర్‌తో పాటు జేసీ విష్ణుచరణ్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన శాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ స్ర్తీ లేనిదే జననం, గమనం, సృష్టే లేదని, అలాంటి గొప్ప మానవత్వం ఉన్న మహిళామూర్తిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళ అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీపడి రాణిస్తుండటం గర్వకారణమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో కన్నుల పండువగా వేడుక నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బ్యాంకు లింకేజీ కింద 6,880 మహిళా సంఘాల సభ్యులకు రూ.74.93 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ సర్వీస్ ద్వారా 2,455 మంది మహిళలు స్వయం ఆధారిత ఉపాధి ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈ కింద 37 మంది మహిళలకు గ్రౌండింగ్ యూనిట్లు, పీఎంఏజేఏవై కింద 49మంది మహిళలకు ఉత్పత్తి యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మెప్మా ద్వారా 6,100మంది మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, ట్రయాంగిల్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా 389మంది మహిళలకు సర్వీసులు, 510మంది మహిళలకు జీవనోపాధి యూనిట్లు మంజూరు చేశామన్నారు. మైనార్టీ, వెనుకబడిన సంక్షేమ శాఖల ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ, చదువుకొని ఖాళీగా ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కింద పనులు కల్పించామని జిల్లాలో మహిళల పురోభివృద్ధిపై కలెక్టర్ వివరించారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 11:04 PM