అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:22 AM
రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం హౌసింగ్, రెవెన్యూ సదస్సులు, పీజీఆర్‌ఎస్, పంచాయతీరాజ్ సీసీ రోడ్లు, ఉపాధి హామీ, ఎంఎస్‌ఎంఈ సర్వే తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణగిరి, మద్దికెర, కర్నూలు, సి.బెళగల్, మంత్రాలయం, పెద్దకడుబూరు మండలాల్లో ఇంకా 75 శాతం అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరితగతిన పెండింగ్‌లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వేకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 10 వేల అర్జీలను గడువులోపు పరిష్కరించాలని తహీసల్దార్‌లను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను కొంత మంది అధికారులు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయడం లేదని, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి ఒక్క అర్జీని తప్పకుండా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలన్నారు.
గోకులాలను ప్రారంభించాలి
అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో కూడా 10, 11, 12 తేదీల్లో గోకులం ప్రారంభోత్సవాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో 370 గోకులాలకు గానూ ఇప్పటి వరకు 268 గోకులాలు పూర్తయ్యాయనీ, పెండింగ్‌లో ఉన్న గోకులాలను కూడా ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌లను, ఎంపీడీవోలను ఆదేశించారు. జీఎస్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన మిస్సింగ్ సిటిజన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే 0 నుంచి 6 ఏళ్ల పిల్లల వరకు ఆధార్ తదితర అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వేను ఫిబ్రవరి 1వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడంలో 97 శాతం, క్లోరినేషన్ చేసే ప్రక్రియలో 87 శాతం సాధించారని, ఈ అంశాలపై నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు త్వరితతగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 12:22 AM