ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశ్వసనీయతకు పట్టం

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:07 AM

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ వీడింది. రాయలసీమ నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బెందుల తిరుమల నాయుడు (బీటీ నాయుడు)కు అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో చాన్స్‌ ఇచ్చారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటీ నాయుడుకు మరో అవకాశం

అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌తో అనుబంధం

సీమ జిల్లాల నుంచి బీటీకి చాన్స్‌

నేడు నామినేషన్‌ దాఖలు

హర్షం వ్యక్తం చేస్తున్న బీటీ అభిమానులు, టీడీపీ శ్రేణులు

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ వీడింది. రాయలసీమ నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బెందుల తిరుమల నాయుడు (బీటీ నాయుడు)కు అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో చాన్స్‌ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాక.. రాయలసీమ జిల్లాల నుంచి సీనియర్‌ నేతలు, రాజకీయ ఉద్దండులు పోటీ పడినా.. చంద్రబాబు విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఎమ్మెల్యే కోటా కింద టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముగ్గురు జాబితాలో బీటీ నాయుడు పేరు ఉండడంతో ఆయన వర్గీయులు, టీడీపీ శ్రేణులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్‌ నిజాయితీ, నమ్మకం, విశ్వసనీయతకు పట్టం కట్టారు అంటూ బీటీ నాయుడు అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలం జుమాలదిన్నె గ్రామానికి రైతు దంపతులు బుడ్డన్న, అయ్యమ్మ కుమారుడు బీటీ నాయుడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తి చేసిన ఆయన 8-10వ తరగతి వరకు ఆదోని వైఎంకే స్కూల్‌, ఇంటర్మీడియట్‌ ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పూర్తి చేశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల న్యాయ విద్య పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పీజీడీసీ పూర్తి చేశారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో కీలకంగా పని చేస్తూ రాజకీయాల పట్ల మమకారం పెంచుకున్నారు. 1997లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఉద్యమంలో అడుగు పెట్టారు. అంచెలంచెలుగా ఉద్యమంలో ఎదిగారు. వాల్మీకి సింహగర్జన పేరుతో సీమ జిల్లాల్లో వేలాది సమీకరించి సభలు నిర్వహించారు. బీసీ, దళిత హక్కుల సాధన ఉద్యామాల్లో పని చేశారు. ప్రజా సంఘాల్లో కీలకంగా పని చేసిన ఆయన రాజకీయాలపై ఉన్న మక్కువతో 1994లో నాటి ఆదోని ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు నాయకత్వంలో క్రియశీలక సభ్యత్వం తీసుకున్న బీటీ నాయుడు రాజకీయ మలుపులు దాటుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడిగా ఎదిగారు. 30 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల ఇన్‌చార్జిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, వివిధ జిల్లాల పార్టీ ఇన్‌చార్జిగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిగా పని చేశారు. 2023 నుంచి 2024 ఏప్రిల్‌ వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అంతేకాదు.. కర్నూలు పార్లమెంట్‌ స్థానం నుంచి 2009, 2014లో రెండు పర్యాయాలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానం పదిలం చేసుకున్నారు. అధినేతకు చంద్రబాబుకు విశ్వసనీయుడిగా మారారు. అదే ఆయనను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చిందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఎమ్మెల్సీగా మరో అవకాశం

2019 మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. రాయలసీమ జిల్లాల్లో బలమైన వాల్మీకి సామాజికవర్గం కోటాలో ఆయనకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ పదవి దక్కినా.. పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ సమయంలో శాసన మండలిలో బలం లేని వైసీపీ అధిష్టానం, నాటి సీఎం జగన్‌ బీటీ నాయుడిని వైసీపీలో చేర్చుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. భారీ ఆఫర్‌ కూడా ఇచ్చారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే.. నమ్ముకున్న టీడీపీ, అవకాశం ఇచ్చిన చంద్రబాబు వెంటే నడిచారు. శాసనమండలిలో టీడీపీ విధానాలు గట్టిగా వినిపించారు. టీడీపీ ఫ్ల్లోర్‌ లీడర్‌, మండలిలో ప్రొటెక్షన్‌ చైర్మన్‌ హోదాలో మండలిని నడిపించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో 2023లో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో పార్టీ బలోపేతం, యువనేత నారా లోకేశ్‌ పాదయాత్రను దిగ్విజయం చేయడంలో కీలకభూమిక పోషించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో అధినేతకు న్యాయపరంగా అండగా నిలిచారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో కూడా డిల్లీ నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాదులకు అధినేత చంద్రబాబుకు మధ్య సంధానకర్తగా పని చేశారు. ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం తిక్కారెడ్డికి ఇస్తామని అధినేత చంద్రబాబు చెబితే.. దానికి అంగీకరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో అంతటి నమ్మకాన్ని పెంచుకున్న టీబీ నాయుడికి అదే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కడం కొసమెరుపు. జిల్లా నుంచి మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్‌, ఏరాసు ప్రతాప్‌రెడ్డి సహా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు.. ఇలా ఎందరో నాయకులు ఆశించారు. రాయలసీమ జిల్లాల నుంచి మహామహులు ప్రయత్నాలు చేశారు. సీమలో బలంగా ఉన్న వాల్మీకి సామాజికవర్గానికి చెందిన బీటీ నాయుడు వైపే అధినేత మొగ్గు చూపారు.

నేడు నామినేషన్‌ దాఖలు

ఎమ్మెల్సీ బీటీ నాయుడు పదవీ కాలం ఈ నెల 29తో ముగుస్తుంది. మళ్లీ అవకాశం రావడంతో మరో ఆరేళ్లు అంటే.. 2031 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది. సోమవారం 11 గంటల సమయంలో శాసనమండలి సెక్రెటరీ జనరల్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తారు. ఆయన నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నిహితులు, అనుచరులు ఆదివారం రాత్రి అమరావతికి బయలుదేరారు.

అధినేత చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతాను

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేశ్‌ నాపై ఎంతో నమ్మకంతో మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ము చేయను. టీడీపీని నమ్ముకున్న కార్యకర్తకు, అంకితభావంతో పని చేసిన వారికి పదవులు వస్తాయనడానికి ప్రత్యేక్ష సాక్షిని నేను. నమ్మకం, నిజాయితీగా పని చేస్తే అధినేత, యువనేత ఇద్దరు కూడా కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారు. వారి రుణం జన్మతా తీర్చుకోలేనిది. ఎల్లప్పుడు నారా కుటుంబానికి రుణపడి ఉంటాను. నా 30 ఏళ్ల టీడీపీ రాజకీయ జీవితంలో ఏ బాధ్యత అప్పగించినా నిజాయితీగా నిర్వర్తించాను. నాకు సహకరించిన సీనియర్‌ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి. తిక్కారెడ్డి, ముఖ్యంగా నాకు రాజకీయ గురువు అయిన ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సహా సీనియర్‌ నాయకులు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

- బీటీ నాయుడు, ఎమ్మెల్సీ

Updated Date - Mar 10 , 2025 | 12:07 AM