‘గ్రీన్‘సిగ్నల్
ABN, Publish Date - Mar 09 , 2025 | 01:02 AM
విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జక్కంపూడి నుంచి ఖమ్మంజిల్లా రెమెడిచర్ల వరకు జరగనున్న పనులకు 90 శాతానికి పైగా భూ సేకరణ పూర్తిచేసి.. ఆ భూములను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్)కు అప్పగించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అదే జరిగితే ఈ నెలాఖరుకు పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ మేఘా సంసిద్ధమవుతోంది.
త్వరలో విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు
జక్కంపూడి నుంచి ఖమ్మం జిల్లా రెమిడిచర్ల వరకు..
ప్యాకేజీ-3లో 90 శాతం పూర్తయిన భూసేకరణ
వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా మేఘా
విజయవాడ-నాగ్‌పూర్ ఎకనమిక్ కారిడార్‌లో కీలకం
రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే కొత్త ప్రాజెక్టు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా 405 కిలోమీటర్ల అతిపెద్ద భారీ ఎక్స్‌ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రాజెక్టును మొత్తం 10 ప్యాకేజీల్లో చేపడుతున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణాలో 89.43 కిలోమీటర్ల నిడివి ఉంది. దీంతో విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు తెలుగు రాష్ర్టాల్లో మొత్తం 3 ప్యాకేజీల ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీ పనులను దినేష్ చంద్ర అగర్వాల్ ఇన్ర్ఫాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.747 కోట్లకు దక్కించుకుంది. ఈ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో భాగంగా ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లి నుంచి రెమెడిచర్ల వరకు 30 కిలోమీటర్ల మేర మేఘా సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇక అత్యంత కీలకమైన మూడో ప్యాకేజీ పనులు ఖమ్మంజిల్లా రెమెడిచర్ల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో జక్కంపూడి వరకు 30 కిలోమీటర్ల మేర చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితేనే రెండు రాష్ర్టాల మధ్య ఎక్స్‌ప్రెస్ వే అనుసంధానమవుతుంది. అలాగే, విజయవాడ-నాగ్‌పూర్ నడుమ అనుసంధానం ఏర్పడుతుంది. ఇక ప్యాకేజీ-1, 2 పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్యాకేజీ-3 పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఈ పనుల కోసం ఎన్టీఆర్ జిల్లాలో 30 ఎకరాల మేర భూములను సేకరించారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో తీవ్ర జాప్యం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సేకరణ ప్రక్రియను 90 శాతం పూర్తి చేశారు.
భూ సేకరణ ప్రక్రియ ఇలా..
విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 30 మీటర్ల అలైన్‌మెంట్‌కు సంబంధించి 243.67 ఎకరాల మేర భూములు అవసరమయ్యాయి. విజయవాడ రూరల్ మండలంలో రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి గ్రామాల్లో, జి.కొండూరు మండలంలోని సున్నంపాడు, దుగ్గిరాలపాడు, మునగపాడు, గడ్డమణుగు, కొండూరు, పేత్రంపాడు, గంగినేనిపాలెం, తెల్లదేవరపాడు, చెరువు మాధవరం, పినపాక, కవులూరు గ్రామాల్లో భూములు సేకరించాల్సి వచ్చింది. గంపలగూడెం మండలంలో తునికిపాడు గ్రామంలోనూ భూములు సేకరించారు.
Updated Date - Mar 09 , 2025 | 01:02 AM