సంక్రాంతి దందా
ABN, Publish Date - Jan 07 , 2025 | 12:53 AM
సంక్రాంతికి దూరప్రాంతాల నుంచి సొంతూర్లకు వచ్చే ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. మూడు రెట్ల వరకు చార్జీలను పెంచి దోపిడీకి తెరతీస్తున్నారు. పెంచిన ధరలను తమతమ వెబ్‌సైట్లలోనూ ఉంచారు.
పండక్కి ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బరితెగింపు
మూడు రెట్ల వరకు చార్జీల పెంపు
హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ముందస్తుగా..
చెన్నై, బెంగళూరు, విశాఖపట్నంకు భారీగా..
11, 12, 13, 18, 19, 20 తేదీల్లో అమలు
ఆర్టీసీ బస్సుల్లో మాత్రం నామమాత్రమే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సంక్రాంతికి దూరప్రాంతాల నుంచి సొంతూర్లకు వచ్చే ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. మూడు రెట్ల వరకు చార్జీలను పెంచి దోపిడీకి తెరతీస్తున్నారు. పెంచిన ధరలను తమతమ వెబ్‌సైట్లలోనూ ఉంచారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.600కే ప్రయాణికులను తీసుకొచ్చే ప్రైవేట్ బస్సులు ఈ పండక్కి ఏకంగా రూ.2,225 మేర వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. లోకల్ ట్రావెల్ ఆపరేటర్లు అయితే రూ.2 వేలలోపు చార్జీ తీసుకుంటున్నారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో సొంతూర్లకు వచ్చే వారిని, 18, 19, 20 తేదీల్లో ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని ఈ ధరలను పెంచుతున్నారు.
ఆర్టీసీలో సాధారణ చార్జీలే..
ఆర్టీసీ బస్సుల్లో మాత్రం సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నారు. రవాణా నెట్‌వర్కింగ్ సైట్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రైవేట్ బస్సుల ధరలు చూస్తే హడలెత్తిపోవాల్సిందే. ఇంటర్ సిటీ స్మార్ట్ బస్‌లో రూ.599 నుంచి రూ.2,259కు పెంచారు. ఫ్రెష్ బస్‌చార్జీ రూ.1,999గా నిర్ణయించారు. యోలో బస్ (బెంజ్) అయితే ఏకంగా రూ.2,900 ఉంది. ఎలక్ర్టిక్ బస్సుల ధర కూడా పెరిగింది. రూ.450 నుంచి రూ.900కు పెంచేశారు. విజయవాడ నుంచి చెన్నైకు రికార్డు స్థాయిలో రూ.3,500గా నిర్ణయించారు. వైఎన్‌ఆర్ ట్రావెల్స్ అనే సంస్థ ఏసీ సీటర్/ఏసీ స్లీపర్ సర్వీసుకు రూ.8,000 చార్జీ వసూలు చేస్తోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా రికార్డు స్థాయిలో రూ.2,100 ధర నిర్ణయించారు. లోకల్ ట్రావెల్స్ అయితే రూ.2,500 నుంచి రూ.2,800 వరకు పెంచారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా భారీగా ధరలను పెంచేశారు. ఆన్‌లైన్ ఆపరేటర్స్‌తో పాటు లోకల్ ఆపరేటర్లు కూడా రూ.2,500 మేర వసూలు చేస్తున్నారు.
Updated Date - Jan 07 , 2025 | 12:53 AM