లాగేస్తేపోలా!
ABN, Publish Date - Feb 01 , 2025 | 01:14 AM
కంకిపాడులో నామమాత్రంగా ఉన్న వైసీపీ త్వరలో ఖాళీ కానుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయాలన్న పట్టుదల, లక్ష్యంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పావులు కదుపుతున్నారని సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి పోటీలేకుండా పావులు కదుపుతున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్
వైసీపీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులను పార్టీలో చేర్చుకునే వ్యూహం
కంకిపాడులో ఖాళీ కానున్న వైసీపీ?
(ఆంధ్రజ్యోతి-కంకిపాడు): కంకిపాడులో నామమాత్రంగా ఉన్న వైసీపీ త్వరలో ఖాళీ కానుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయాలన్న పట్టుదల, లక్ష్యంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పావులు కదుపుతున్నారని సమాచారం. కంకిపాడు సర్పంచ్ బాకి రమణ, ఉపసర్పంచ్ రాచూరి చిరంజీవితో పాటు పలువురు వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకుని, అంతంతమాత్రంగా ఉన్న వైసీపీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు గ్రామంలోని వైసీపీ నాయకులతో సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం. వచ్చే జనవరిలో జరగనున్న పం చాయతీ ఎన్నికల్లో కంకిపాడులో టీడీపీకి పోటీ లేకుండా వైసీపీ నాయకులను తమ పార్టీలోకి లాగేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది.
సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఓకే..
కంకిపాడు సర్పంచ్ బాకి రమణ, ఉపసర్పంచ్ రాచూరి చిరంజీవిని టీడీపీలోకి తీసుకునేందుకు స్థానిక టీడీపీ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండో వార్డు సభ్యుడు చిట్టూరి కోటయ్యబాబు, ఎంపీటీసీ -4 కంకిపాటి పద్మావతి భర్త కంకిపాటి రమే్‌షను పార్టీలోకి తీసుకోవడం సరికాదని ఆ పార్టీ నాయకులు అభ్యంతరం చెబుతున్నారని తెలిసింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు వ్యతిరేకంగా చిట్టూరి కోటయ్యబాబు గ్రూపుల్లో అనేక సందేశాలు పెట్టారని, గత పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందుల పాల్జేశారని ఆరోపిస్తున్నారని సమాచారం.
ఇబ్బంది పెట్టిన వారిని ఎలా తీసుకుంటారు
స్థానిక టీడీపీ నాయకులు పలువురు గురువారం రాత్రి ఆర్యవైశ్య ప్రార్థన మందిరంలో సమావేశమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమను ఇబ్బం ది పెట్టిన వైసీపీ నాయకులను పార్టీలోకి ఎలా తీసుకుంటారన్న దానిపై చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వైసీపీ నాయకులను టీడీపీలోకి తీసుకున్నా వారితో ఎలా కలిసి పనిచేస్తామని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బోడె ప్రసాద్‌ను కలిసి తమ గోడు విన్నవించుకునేందుకు స్థానిక నాయకులు సిద్దమయ్యారని సమాచారం.
Updated Date - Feb 01 , 2025 | 01:14 AM