మల్లవల్లి పారిశ్రామికవాడలో పోలీస్ పహారా
ABN, Publish Date - Jan 04 , 2025 | 12:56 AM
మల్లవల్లి పారిశ్రామికవాడ వద్ద శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పారిశ్రామికవాడను అభివృద్ధి చేసేందుకు అడ్డుగా ఉండి, అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఏపీఐఐసీకి అప్పగించేందుకు భారీగా మోహరించారు.
భారీగా మోహరించిన రెవెన్యూ, పోలీసులు
పారిశ్రామికవాడలోని భూమి స్వాధీనం
బందోబస్తు నడుమ అభివృద్ధి పనులు
17మందికి పైగా రైతులు గృహ నిర్బంధం
మల్లవల్లిలో 144 సెక్షన్ విధింపు
నష్టపరిహారం ఇవ్వకుండా ఇదేం చర్య : రైతులు
హనుమాన్ జంక్షన్ రూరల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : మల్లవల్లి పారిశ్రామికవాడ వద్ద శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పారిశ్రామికవాడను అభివృద్ధి చేసేందుకు అడ్డుగా ఉండి, అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఏపీఐఐసీకి అప్పగించేందుకు భారీగా మోహరించారు. నష్టపరిహారం కోసం పోరాడిన సుమారు 17 మందికిపైగా రైతులను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న భూమిలోని చెట్లను తొలగించి చదును చేయడంతో పాటు రహదారుల నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. పారిశ్రామికవాడకు వెళ్లే ప్రధాన రహదారి (గ్రీన్‌ఫీల్డ్ రహదారి)తో పాటు మల్లవల్లి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో దిగ్బంధించారు. రెవెన్యూ, పోలీసు అధికారులను తప్ప ఇతరులను అనుమతించలేదు. పరిశ్రమలకు వెళ్లే కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్యాక్టరీల ప్రతినిధులను గుర్తింపుకార్డులను చూసి మాత్రమే అనుమతించారు. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్యణ్యం, ఉయ్యూరు ఆర్డీవో హేలాషరోన్, జోనల్ మేనేజర్ బాబ్జీ, చీఫ్ ఇంజనీర్ (మాజీ జోనల్ మేనేజర్) సీతారాం, తహసీల్దార్ నాగభూషణం, రెవెన్యూ, సర్వే సిబ్బంది పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, ఉంగుటూరు, గుడివాడ, నందివాడ తదితర పోలీస్టేషన్ల నుంచి ఎస్సైలు, సిబ్బందితో పాటు మచిలీపట్నం నుంచి ప్రత్యేక దళాలు ఈ బందోబస్తులో పాల్గొన్నాయి.
భూ వివాదానికి కారణం రెవెన్యూ అధికారులే : రైతులు
అభివృద్ధికి అడ్డుపడబోమని, నష్టపరిహారం అందజేస్తే చాలని గతంలో పారిశ్రామికవాడకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు, యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో నారా లోకేశ్‌కు విన్నవించామని ప్రసాద్ అనే రైతు తెలిపారు. అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరించి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో అప్పటి ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్ నరసింహారావులు బాపులపాడు ఎమ్మార్వో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారని, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమారు 72 మంది వరకూ నష్టపరిహారం తీసుకునేందుకు అర్హత ఉన్నట్టు 2024-జూలైలో తేల్చారని, కోర్టులో ఉన్నవాటి గురించి తమకు తెలియదని చెప్పారు. అభివృద్ధికి రైతులు అడ్డుపడని తమపై బలవంతపు అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారుల నియంతృత్వ ధోరణి కేవలం రెచ్చగొట్టే చర్యలేనని శ్రీనివాసరావు, మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jan 04 , 2025 | 12:56 AM