ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తనయుడి బాటలో తల్లి

ABN, Publish Date - Jan 26 , 2025 | 01:08 AM

కొడుకులు తండ్రి వారసత్వాన్ని అందుకుంటారు. కూతుళ్లు తల్లి గుణగణాలను వంటపట్టించుకుంటారు. ఈ తల్లి మాత్రం కుమారుడి నేరతత్వాన్ని అందుకుంది. కొడుకు పలు కేసుల్లో కటకటాలు లెక్కపెడుతుంటే, తల్లి మాత్రం అతడి గంజాయి వ్యాపారాన్ని వారసత్వంగా అందుకుంది. దీనిపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆమెకు సంకెళ్లు వేశారు. వివరాల్లోకి వెళితే..

  • గంజాయి కేసుల్లో కీలకంగా మారిన ఫాతిమా

  • ఇప్పటికే పలు కేసుల్లో నెల్లూరు జైల్లో తనయుడు

  • అతని స్నేహితుల ద్వారా ప్రస్తుతం ఫాతిమా వ్యాపారం

  • అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మురళీనగర్‌కు చెందిన షేక్‌ ఫాతిమా కుమారుడు నాగూర్‌ బాషా రౌడీషీటర్‌. విశాఖ జిల్లాలోని మన్యం నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలోని విద్యార్థులకు గ్రాముల లెక్కన విక్రయించేవాడు. పలుమార్లు పోలీసులు హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. కేసులు నమోదు చేసి జైలుకు పంపినా.. విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి తెచ్చేవాడు. దీంతో పోలీసులు అతడిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం నాగూర్‌బాషా నెల్లూరులోని జైల్లో ఉన్నాడు. ఇతను బ్లేడ్‌బ్యాచ్‌, రౌడీషీటర్‌ తుమ్మల మనోజ్‌ అలియాస్‌ ‘మన’ గ్యాంగ్‌లో పనిచేసేవాడు. తరచూ మనోజ్‌ ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతడి చెల్లెలు హేమను నాగూర్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగూర్‌ గంజాయి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో తల్లి, భార్య అవసరాలు తీర్చేవాడు. పోలీసులు అతడిని జైలుకు పంపాక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుటుంబం గడవడానికి ఇబ్బందిగా మారడంతో నాగూర్‌ తల్లి ఫాతిమా కొడుకు నడిచిన బాటనే ఆదాయ మార్గంగా మార్చుకుంది.

స్నేహితులను చేరదీసి..

నాగూర్‌కు నగరంలో స్నేహితులు బాగా ఉన్నారు. అతడు చేసే నేరాలు, గంజాయి రవాణాలో వారి సహకారం ఉండేది. దీనిని గుర్తించిన ఫాతిమా కొడుకు స్నేహితులను ఇంటికి రప్పించుకుని ఒక్కొక్కరిని ఒక్కోసారి నెల్లూరు జైలుకు పంపేది. అక్కడ నాగూర్‌తో ములాఖత తీసుకుని మాట్లాడించేది. నాగూర్‌ గంజాయిని ఎక్కడి నుంచి, ఎవరెవరి ద్వారా కొనుగోలు చేస్తున్నాడన్న వివరాలు చెప్పించుకునేది. వాటి ప్రకారం స్నేహితులను విడతలవారీగా ఒడిశా సరిహద్దులకు పంపుతోంది. అక్కడి నుంచి బైకులపై గంజాయిని ఇంటికి రప్పించుకుంటోంది. ఈ గంజాయిని గ్రాముల లెక్కన ఇంట్లోనే ప్యాకెట్లుగా మార్చి నాగూర్‌ స్నేహితుల ద్వారా అమ్మకాలు చేస్తోంది. 20 గ్రాముల గంజాయిని రూ.500కు విక్రయిస్తోంది. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు ఫాతిమాను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారు. తాను మారిన మనిషినని నిరూపించుకుంటానని చెప్పి ఇంటికి వెళ్లిన ఫాతిమా పాత పద్ధతిలోనే నడవడం మొదలుపెట్టింది. కొడుకు స్నేహితులను ఒడిశాకు పంపుతూనే ఉంది. గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేయించి విజయవాడలో ఎక్కువ మొత్తానికి అమ్ముతోంది. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫాతిమాను అరెస్టు చేశారు. ఆమెపై గుణదల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫాతిమా పైనా పీడీ యాక్ట్‌ను ప్రయోగించే యోచనలో ఉన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 01:08 AM