కార్పొరేషన్ స్థలం కబ్జా
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:38 AM
ప్రభుత్వం మారినా వైసీపీ నేతలు, వారి అనుచరుల ప్రవర్తనల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఎలా అయితే భూ కబ్జాలు, ఆక్రమణలకు దిగారో, అదే తరహాలో టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ప్రవర్తిస్తున్నారు. పాయకాపురంలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి, ప్రైవేట్ వెంచర్‌గా బిల్డప్ ఇచ్చి, ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఇందులో సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన ఓ వివాదాస్పద వైసీపీ బడానేత అనుచరుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు సోమవారం సరిహద్దు రాళ్లను తొలగించారు.
వైసీపీ నేత అనుచరుడి బరితెగింపు
వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు
సరిహద్దు రాళ్లను తొలగించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు
స్థలం విలువ రూ.10 కోట్ల పైమాటే
ఆంధ్రజ్యోతి, పాయకాపురం : పాయకాపురంలోని కండ్రిక కాలనీని ఆనుకుని ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అండ్ ఇండసి్ట్రయల్ వర్కర్స్ హౌస్ సొసైటీ లిమిటెడ్‌కు సర్వే నెంబరు 60/2లో వెంచర్ ఉంది. వెంచర్ ఏర్పాటు సమయంలో అసోసియేషన్ ప్రధాన రహదారిని నిర్మించుకుంది. రహదారికి ఎడమవైపు కండ్రిక కాలనీ సరిహద్దుల్లో సర్వే నెంబరు 63/1బీలో అవుట్‌ఫాల్ డ్రెయిన్ పక్కన సుమారు 4వేల గజాల వరకు కార్పొరేషన్ స్థలం ఉంది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల పైమాటే. ఆ స్థలంపై కన్నేసిన వైసీపీ నేత అనుచరుడు, అసోసియేషన్ అధ్యక్షుడి కొడుకు కబ్జాకు రంగం సిద్ధం చేశారు. అసోసియేషన్ పత్రాల ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కార్పొరేషన్ స్థలాన్ని 36 ప్లాట్లుగా విభజించి ఇటీవల సరిహద్దు రాళ్లను పాతారు. పైగా సరిహద్దు రాళ్లకు పసుపు రంగు వేసి టీడీపీ నేతల వెంచర్‌గా బిల్డప్ ఇచ్చి అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న ‘ఆంధ్రజ్యోతి’.. టౌన్‌ప్లానింగ్ అధికారులకు సమాచారం ఇచ్చింది. కబ్జా జరిగిన స్థలానికి చేరుకున్న అధికారులు సరిహద్దు రాళ్లను తొలగించారు. సరిహద్దు రాళ్లు వేసిన స్థలం కార్పొరేషన్‌కు సంబంధించినదిగా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణానాయక్ తెలిపారు. అయితే, సదరు స్థలంలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేయించాలని పలువురు కోరుతున్నారు.
వైసీపీ హయాంలోనే ప్లాట్ల అమ్మకాలు
కబ్జా వ్యవహారంపై ఆరా తీయగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని తెలిసింది. ఎన్నికల ముందు హడావిడిగా ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం 36 ప్లాట్లకు గానూ సుమారు 20 ప్లాట్లు మార్కెట్ రేటుపై అతి తక్కువకు అమ్మినట్లు తెలిసింది.
Updated Date - Jan 28 , 2025 | 12:38 AM