దారి మార్చి
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:58 AM
విజయవాడ తూర్పు బైపాస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాని నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తూర్పు బైపాస్ అవసరం లేదన్న కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఆ ప్రాజెక్టు లోటును తీర్చేందుకు కీలక మార్పులు చేస్తోంది.
తూర్పు బైపాస్‌కు ప్రత్యామ్నాయంగా అమరావతి ఇన్నర్ రింగురోడ్డు
ఇన్నర్ అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం
ఈ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే పశ్చిమ బైపాస్ అలైన్‌మెంట్ మార్పునకు నోటిఫికేషన్
ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని కేంద్రానికే అప్పగించే ప్రతిపాదన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ తూర్పు బైపాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డును విజయవాడ పశ్చిమ బైపాస్ వైపు మార్చేందుకు వీలుగా సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే క్రమంలో తూర్పు బైపాస్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని అలైన్‌మెంట్ మార్పు దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మోర్తు నిర్ణయంతో తూర్పు బైపాస్‌పై సందిగ్ధం
అమరావతి అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్)కు సమాంతరంగా తూర్పు బైపాస్ వెళ్తుంది. అయితే, ఈ రెండు రహదారులు, తూర్పు బైపాస్ ఉద్దేశం వేరు. తూర్పు బైపాస్ అనేది విజయవాడ నగర అంతర్గత ట్రాఫిక్ రద్దీని, గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాలు, తూర్పు కృష్ణాలోని పలు ప్రాంతాల సత్వర రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్దేశించింది. రెండు దశాబ్దాల కిందటి ప్రతిపాదనలు తెరమీదకు వస్తున్నా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇది కార్యరూపంలోకి వచ్చింది. ఈ బైపాస్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా పూర్తయింది. రూ.4 వేల కోట్లతో నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. మొత్తం మూడు అలైన్‌మెంట్లు ఇవ్వగా, ఇందులో రెండో ఆప్షన్‌ను జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఎంపిక చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే దశలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) ‘అవసరం లేదు..’ అని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్‌గానే దృష్టి సారిస్తోంది.
తూర్పు కృష్ణాలో వ్యతిరేకత
మోర్తు నిర్ణయంపై తూర్పు కృష్ణా ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు కూడా ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది కేవలం ఉమ్మడి కృష్ణాజిల్లాకే కాకుండా గుంటూరు జిల్లా ప్రజలకు కూడా అవసరం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంలో ఉంది. విజయవాడ పశ్చిమ బైపాస్ త్వరలో అందుబాటులోకి వస్తున్నప్పటికీ తూర్పు బైపాస్ అలైన్‌మెంట్‌తో పోల్చుకుంటే అది చాలా ఎక్కువ దూరం. చిన అవుటపల్లికి వెళ్లి అక్కడి నుంచి మళ్లీ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలైతే ఎప్పటినుంచో తూర్పు బైపాస్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని అలైన్‌మెంట్ విమానాశ్రయానికి సమీపంగా వెళ్తుంది. కాబట్టి నేరుగా, త్వరగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు.
విజయవాడకు ఉపయోగం
విజయవాడ నగరానికి, గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాలకు కూడా తూర్పు బైపాస్ అవసరం. నగరంలో అంతర్గత ట్రాఫిక్‌ను కూడా ఇది తగ్గిస్తుంది. ఇక టెండర్లు పిలవటమే తరువాయి అనుకున్న తరుణంలో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తూర్పు బైపాస్ లేని లోటును తీర్చేందుకు ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆ దిశగా అలైన్‌మెంట్ మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తూర్పు బైపాస్ ప్రాంతంలో కూడా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పునకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఇన్నర్ రింగ్‌రోడ్డును శరవేగంగా పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Updated Date - Jan 19 , 2025 | 12:58 AM