‘సామాజిక బాధ్యత’కు సరికొత్త అర్థం!
ABN, Publish Date - Feb 01 , 2025 | 01:05 AM
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్)కు ఏపీ ట్రాన్స్‌కో అధికారులు కొత్త అర్థం చెప్పారు. పేదల సామాజిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన నిధులను దారి మళ్లించారు.
విద్యుత్‌సౌధలో ఇండోర్ స్టేడియం నిర్మాణం
ఏపీ ట్రాన్స్‌కో సీఎ్‌సఆర్ నిధులు రూ.3.30 కోట్లు ఖర్చు
మరికొద్ది రోజుల్లో స్టేడియం ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ ):
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్)కు ఏపీ ట్రాన్స్‌కో అధికారులు కొత్త అర్థం చెప్పారు. పేదల సామాజిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన నిధులను దారి మళ్లించారు. విజయవాడ విద్యుత్‌సౌధలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం కోసం రూ.3.30 కోట్ల సీఎ్‌సఆర్ నిధులను ఖర్చు పెట్టారు. ఇండోర్ స్టేడియానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినప్పటికీ సీఎ్‌సఆర్ నిధులు ఉపయోగించడం వివాదాస్పదమవుతోం ది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతుల మీదుగా మరికొద్ది రోజు ల్లో ఈ ఇండోర్ స్టేడియం ప్రారంభం కానుంది. అత్యంత రహస్యంగా ఇండోర్ స్టేడియాన్ని సీఎ్‌సఆర్ నిధులతో పూర్తి చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ సంస్థ అయినా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్)గా తన ఆదాయంలో 2 శాతం నిధులను సామాజిక అవసరాలను తీర్చటం కోసం ఖర్చు చేయాలి. కానీ, ట్రాన్స్‌కో మాత్రం సొంత ఉద్యోగుల ఆటవిడుపు కోసం తమ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఇండోర్ స్టేడియానికి సీఎ్‌సఆర్ నిధులను ఖర్చు పెట్టింది. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ వంటి సంస్థలు ఇండోర్ స్టేడియాలు నిర్మిస్తాయి. కానీ సొంత అవసరాలకు సీఎ్‌సఆర్ నిధులు ఉపయోగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఈ వ్యవహారం తెలిస్తే గోలపెట్టే అవకాశం ఉందని, అనవసర వివాదం కొనితెచ్చారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇండోర్ స్టేడియానికి అయిన ఖర్చును ప్రభుత్వ నిధుల ద్వారా సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించాలని, సీఎ్‌సఆర్ నిధులను తిరిగి వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమతోంది.
2018లో రెండున్నర కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం
2018లో టీడీపీ ప్రభుత్వం ఇండోర్ స్టేడియానికి రూ.2.50 కోట్లను కేటాయించింది. అప్పట్లో కాంట్రాక్టు అగ్రిమెంట్ కూడా ఇదే మొత్తానికి జరిగింది. ఫౌండేషన్ పనులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తిగా ఆగిపోయాయి. 2022-23లో సొంత సీఎ్‌సఆర్ నిధుల నుంచి రూ.1.80 కోట్లను ఉపయోగించుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత మరో రూ.1.50 కోట్ల సీఎ్‌సఆర్ నిధులను వాడారు. మొత్తంగా రూ.3.30 కోట్ల సీఎ్‌సఆర్ నిధులను వాడారు.
Updated Date - Feb 01 , 2025 | 01:05 AM