ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mega Projects : సంక్రాంతులు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:15 AM

వివిధ ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలలు నేరవేర్చేలా... రాష్ట్రాభివృద్ధికి ఊతం ఇచ్చేలా... వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు, రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టులు... రాష్ట్రానికి పెట్టుబడులు

ప్రధానికి శ్రీమహావిష్ణువు ప్రతిమను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పక్కన గవర్నర్‌ నజీర్‌

పట్టాలెక్కిన భారీ ప్రాజెక్టులు .. రూ.2 లక్షల కోట్లతో శ్రీకారం

వివిధ ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలలు నేరవేర్చేలా... రాష్ట్రాభివృద్ధికి ఊతం ఇచ్చేలా... వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు, రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టులు... రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు పారిశ్రామిక హబ్‌లు... ఇలా రూ.2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఒకేరోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోట్లాది రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేలా రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తాజాగా మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టుల గురించి క్లుప్తంగా...

-ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌:

221 కి.మీ. రైల్వే డబ్లింగ్‌, విద్యుదీకరణ

ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు లబ్ధి

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 221 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆర్థికాభివృద్ధికి ఊతం లభించింది. వ్యవసాయ, ఆక్వాకల్చర్‌ రంగాలకు మరింత ఊపునివ్వడానికి ఈ లైన్‌ ఉపయోగపడనుంది. విజయవాడ-గుడివాడ, గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం-నరసాపురం, నరసాపురం-నిడదవోలు రైల్వే లైన్‌ డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులను రూ.3 వేల కోట్లతో 2020లో చేపట్టారు. 221 కిమీ ప్రాజెక్టును రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ శరవేగంగా పూర్తి చేసింది. అంతకుముందు ఈ మార్గంలో సింగిల్‌ లైన్‌ కారణంగా ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేది. డబ్లింగ్‌ పూర్తికావడంతో ప్రయాణం వేగవంతం కావడంతో పాటు విజయవాడ-విశాఖపట్నం రైల్వే రూట్‌లో ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

పల్నాడు జిల్లా రోడ్లకు మహర్దశ

చిలకలూరిపేట బైపాస్‌

పల్నాడు జిల్లా పరిధిలోని చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డును ప్రధాని జాతికి అంకింతం చేశారు. రూ.907 కోట్ల వ్యయంతో బైపాస్‌ నిర్మించారు. దేశంలోనే మోడల్‌ బైపాస్‌ ఇది. బైపాస్‌ విశాలమైన ప్రాంతాల్లో మెగా వాట్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాత్రి వేళ రహదారిపై ఏర్పాటు చేసిన లైటింగ్‌కు వినియోగిస్తారు.

దావులపల్లి జాతీయ రహదారి

నాగార్జున సాగర్‌-దావులపల్లి జాతీయ రహదారిని ప్రారంభించారు. రూ.230 కోట్ల వ్యయంతో 47 కిలో మీటర్ల మేర రెండు వరుసలుగా విస్తరించారు. దావులపల్లి నుంచి ప్రకాశం జిల్లా మల్లాయపాలెం జాతీయ రహదారిని రెండు వరుసలుగా విస్తరించనున్నారు. రూ 312 కోట్ల వ్యయంతో 20 కిలో మీటర్ల మేర రహదారిని విస్తరిస్తారు.

కొండమోడు రహదారి

కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి పనులను ప్రారంభించారు. ఇప్పటికే రహదారి పనులకు నిధులు మంజూరు, భూసేకరణ, టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. దశాబ్దాలుగా కొండమోడు రహదారిని విస్తరించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక గోతుల కష్టాలు తీరనున్నాయి. రూ.882 కోట్లతో పేరేచర్ల నుంచి కొండమోదు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. సుమారు 585 ఎకరాల భూమిని సేకరించారు. టెండర్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.

తిరుపతి సిగలో క్రిస్‌ సిటీ

ప్రధాని శంకుస్థాపన చేసిన క్రిస్‌ సిటీ తిరుపతి జిల్లా స్థాయిని అమాంతం పెంచనుంది. కృష్ణపట్నం పోర్టు, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఆధారంగా చేసుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల పరిధిలో 10,834 ఎకరాలలో ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయని, రూ.37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. దీనివల్ల 4,67,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.


అనకాపల్లి జిల్లాకు వరాలు

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ (బీడీపీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భాగంగా ఏపీఐఐసీ గతంలో సేకరించిన సుమారు రెండు వేల ఎకరాల్లో ఏర్పాటయ్యే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ రూ.1,876 కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పనులు పూర్తిచేస్తారు. దేశ, విదేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు ఇక్కడ దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌-న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగం (నేషనల్‌ గ్రీన్‌ హైడ్రో మిషన్‌)లో ఇది మొట్టమొదటి హరిత ఇంధన ప్రాజెక్టు. మొత్తం 1,600 ఎకరాల్లో రూ.1.85 లక్షల కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌తో పాటు 7,500 టన్నుల గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ యూరియా, గ్రీన్‌ మెథనాల్‌, సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఇంధనం ఉత్పత్తి అవుతాయి. పలు దేశాలకు ఇక్కడి నుంచి హైడ్రోజన్‌ను ఎగుమతి చేస్తారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ నిర్మాణం పూర్తయితే (2032 నాటికి) ప్రత్యక్షంగా, పరోక్షంగా 57 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


కర్నూలుకు కానుక

కల్వకుర్తి-నంద్యాల రహదారి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులకు మోక్షం లభించింది. భారతమాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అనుసంధానం చేసేలా ఆత్మకూరు మీదుగా కల్వకుర్తి-నంద్యాల వరకు 170 కిలో మీటర్ల జాతీయ రహదారి-167కే నిర్మించనున్నారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా సంగమేశ్వరం-నల్లకాల్వ, ఆత్మకూరు, వెలుగోడు-నంద్యాల వరకు 62 కిలోమీటర్లు రెండు వరుసల జాతీయ రహదారిని రూ.607 కోట్లతో నిర్మించనున్నారు. ఈ పనులకు ప్రధాని వర్చువల్‌గా భూమి పూజ చేశారు. సంగమేశ్వరం దగ్గర కృష్ణా నదిపై పర్యాటకులను ఆకట్టుకునేలా 900 మీటర్ల పొడవు ఐకానిక్‌ తీగల వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే నంద్యాల, కడప జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు దాదాపు 70 కిలోమీటర్ల వరకు దూరం తగ్గనుంది.

ఆదోని బైపాస్‌ రోడ్డు

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హగరి నుంచి తెలంగాణలోని జడ్చర్ల వరకు ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూరు మీదుగా జాతీయ రహదారి-167ను 2012-13లో నిర్మించారు. బైపాస్‌ రోడ్డు నిర్మించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలతో ఆదోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రూ.241.99 కోట్ల వ్యయంతో 12 మీటర్ల వెడల్పుతో రెండు లైన్ల బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కాచిగూడ-డోన్‌ లైన్‌ డబ్లింగ్‌

కాచిగూడ (హైదరాబాద్‌)-డోన్‌ ప్రధాన రైల్వే మార్గం డబ్లింగ్‌, విద్యుద్దీకరణ చేపట్టాలనేది దశాబ్దాల కల. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ వరకు డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి నంద్యాల జిల్లా డోన్‌ వరకు గద్వాల, కర్నూలు మీదుగా 197 కిలోమీటర్లు చేయాల్సి ఉంది. తాజాగా రూ.2,208 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ నోడ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామివేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్లేందుకు రైల్వే రవాణా మరింత వేగం పుంజుకుంటుంది.

విశాఖ రైల్వే జోన్‌

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. దీని కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తే 2019 ఎన్నికల ముందు ప్రధాని హోదాలోనే మోదీ హామీ ఇచ్చారు. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అయితే విశాఖలో రైల్వేకు ఇవ్వాల్సిన 52 ఎకరాల ప్రత్యామ్నాయ భూముల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పని పూర్తిచేయడంతో ఇప్పుడు శంకుస్థాపన చేశారు. విశాఖలో జోనల్‌ కార్యాలయం వల్ల కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, ప్రాజెక్టులు వస్తాయి. జోనల్‌ స్థాయి ఆస్పత్రి ఏర్పాటవుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా దూరప్రాంతాలకు విశాఖ నుంచి కొత్త రైళ్లు ప్రారంభమవుతాయి.

ఉమ్మడి విశాఖలో రైల్వే లైన్లు

విశాఖ రైల్వే స్టేషన్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతున్నందున శివార్లలోని దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి ఆయా స్టేషన్లకు ఉన్న రైల్వే లైన్లను పెంచుతున్నారు. అందులో భాగంగా దువ్వాడ-సింహాచలం మధ్య రూ.302 కోట్లతో అదనంగా 3, 4 ట్రాకుల నిర్మాణం చేపడతారు. అలాగే విశాఖపట్నం-గోపాలపట్నం మధ్య రూ.159 కోట్లతో 3, 4 ట్రాకుల నిర్మాణం చేస్తారు. గంగవరం పోర్టు నుంచి స్టీల్‌ప్లాంటుకు ముడిసరుకు రవాణా కోసం ప్రస్తుతం ఉన్న లైన్లకు అదనంగా మరో రెండు 3, 4 ట్రాకులను రూ.154 కోట్లతో నిర్మించనున్నారు. పొరుగు జిల్లా విజయనగరంలో బౌడార జంక్షన్‌ నుంచి విజయనగరం వరకు రూ.159 కోట్లతో రహదారి విస్తరణ చేస్తారు.


గుంటూరు-బీబీనగర్‌ రైల్వే డబ్లింగ్‌

గుంటూరు-బీబీనగర్‌ రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టు కోసం 2 రాష్ట్రాల్లోని గుంటూరు, పల్నాడు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సింగిల్‌ లేన్‌గా ఉన్న గుంటూరు-బీబీనగర్‌ రైలు మార్గం డబ్లింగ్‌ చేస్తే సెక్షన్‌లో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ వృద్ధి చెందుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ మార్గం విజయవాడ-కాజీపేట-సికింద్రాబాద్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ.2,853.23 కోట్లు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుతో వేల మందికి ఉపాధి లభిస్తుంది.

Updated Date - Jan 09 , 2025 | 05:15 AM