మిస్టరీగా చల్లపల్లిలో భార్యాభర్తల మరణాలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:48 AM
భర్త ఉరివేసుకుని చనిపోగా, భార్య మంచంపై విగతజీవిగా పడి ఉన్న ఘటన చల్లపల్లిలో సోమవారం ఉదయం సంచలనం రేపింది. ఈ మరణాల వెనుక కారణాలు ఏమిటన్నది మిస్టరీగా మారింది.
-ఉరివేసుకుని భర్త సాంబశివరావు ఆత్మహత్య
-మంచంపై విగతజీవిగా భార్య జమున
- ఇరువురూ నాగాయలంక మండలం తలగడదీవి వాసులు
చల్లపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):
భర్త ఉరివేసుకుని చనిపోగా, భార్య మంచంపై విగతజీవిగా పడి ఉన్న ఘటన చల్లపల్లిలో సోమవారం ఉదయం సంచలనం రేపింది. ఈ మరణాల వెనుక కారణాలు ఏమిటన్నది మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే... నాగాయలంక మండలం తలగడదీవి గ్రామానికి చెందిన దారపురెడ్డి జమున(39) గత కొన్నేళ్లుగా చల్లపల్లిలో నివసిస్తోంది. పదిహేనేళ్ల కిందటే భర్త చనిపోగా, అప్పటికే ఆమెకు ఆనంద్ అనే కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయిన తర్వాత వరుసకు మేనమామ అయ్యే తలగడదీవి గ్రామానికి చెందిన బండ్రెడ్డి సాంబశివరావు(45)ను రెండవ వివాహం చేసుకుంది. సాంబశివరావు సైతం భార్యకు విడాకులు ఇచ్చి ఉండటంతో జమునను వివాహం చేసుకున్నాడు. మొదటి సంబంధానికి ఓ కుమార్తె ఉండగా, పెళ్లికాని సోదరి, కుమార్తెతో కలిసి స్వగ్రామంలో ఉంటున్నాడు. సెంట్రింగ్ మేసి్త్రగా పనులు చేసే సాంబశివరావు తలగడదీవిలో నివసిస్తూ అప్పుడప్పుడూ చల్లపల్లి వచ్చి వెళుతుంటాడు. జమున మచిలీపట్నంలోని ఏఆర్‌టీ సెంటరులో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఆనంద్ చల్లపల్లిలోని ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నాడు.
గదిలో విగతజీవులై పడి ఉన్న భార్యాభర్తలు...
ప్రధాన రహదారి పక్కనే (షాబుల్ బజారు ఎదురుగా) బంగారు దుకాణాల వెనుక ఇంటిలో జమున అద్దెకు ఉంటుంది. ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం సాంబశివరావు చల్లపల్లి వచ్చాడు. కుమారుడు ఆనంద్ స్థానిక నారాయణరావు నగర్ కాలనీలో ప్రతిష్టామహోత్సవాలు ఉండటంతో ఆ పనుల్లో ఉండి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లిపోయాడు. ఇంటి గదిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెంది ఉండటాన్ని డాబాపై అద్దెకుండే వారు గమనించారు. సెల్‌ఫోన్ చార్జర్ తీసుకుని ఇవ్వకపోవడంతో చార్జర్ కోసం ఉదయం ఇంటి తలుపుకొట్టగా, ఎంతకీ తలుపు తీయకపోవటంతో కిటికీలో నుంచీ లోపలకు చూడటంతో మంచంపై ఒకరు, ఉరివేసుకుని ఒకరు ఉండటాన్ని చూసి ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపు బలవంతంగా తోసి లోపలకు వెళ్లిచూశారు. భార్యాభర్తలు ఇద్దరూ అప్పటికే మృతి చెంది ఉండటంతో కొడుకు ఆనంద్, పోలీసులకు సమాచారం అందించారు.
ఇద్దరిదీ ఆత్మహత్యేనా!?
భార్యాభర్తల ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించారా.. లేక భార్య జమున మరణం అనుమానాస్పదమా అన్నది తెలియాల్సి ఉంది. సాంబశివరావు ఉరి వేసుకుని చనిపోయి ఉండగా, జమున మాత్రం మంచంపై నిద్రిస్తున్నట్లుగానే చనిపోయి ఉంది. మెడపై చిన్నగాటు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ గాయాలేమీ లేకపోవటం, గదిలో ఎటువంటి ఘర్షణ జరిగిన ఆనవాళ్లు లేకపోవడంతో భార్య మృతిపైనా బంధువులెవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. నిద్రమాత్రలు తీసుకుని మరణించి ఉంటుందా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. భార్యాభర్తల ఇరువురి నడుమా ఎలాంటి గొడవలూ లేవని మరణాలపై అనుమానాలేమీ లేవని మృతదేహాలను స్వగ్రామం తీసుకువెళ్లిపోతామంటూ తొలుత బంధువర్గం సిద్ధపడింది. పోలీసులు సైతం భార్య మృతిపై స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. శవపరీక్ష నివేదిక ఆధారంగానే ఓ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. డబ్బుల విషయమై ఇరువురి నడుమా ఏమైనా వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. భార్యను హత్యచేసి భయపడి తానూ చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. శవపరీక్ష నివేదిక తర్వాతే జమున మృతి ఆత్మహత్యా, హత్యా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.
గత నెలలో 2వ తేదీనే వచ్చాడు..
గత నెలలో రెండవ తేదీన వచ్చిన సాంబశివరావు ఈ నెలలోనూ రెండవ తేదీ ఆదివారమే చల్లపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. జీతం డబ్బులేమైనా తీసుకువెళ్లేందుకు వచ్చాడా, ఆ విషయమై ఇరువురి నడుమా గొడవలు జరుగుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. జమున మృతికి స్పష్టమైన కారణాలు తెలిస్తేనే మరణాల మిస్టరీ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన అవనిగడ్డ డీఎస్పీ టి.విద్యశ్రీ మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. మచిలీపట్నం నుంచి క్లూస్ టీమ్ ఆధారాల కోసం అన్వేషించారు. చల్లపల్లి ఎస్‌ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - Feb 04 , 2025 | 12:49 AM