ఆయన తీరు మారదు!
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:52 AM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దూకుడు టీడీపీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ఇప్పటికిప్పుడే రాజకీయాల్లో ఎదగాలనే నాయకుల తరహాలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ తాను బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కొలికపూడి విస్మరిస్తున్నారు. దీంతో తరచూ తాను వివాదాల్లో కూరుకుపోతూ... పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని నాయకులు ఆరోపిస్తున్నారు. కొలికపూడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
-పదే పదే వివాదాల్లో తిరువూరు ఎమ్మెల్యే
-టీడీపీ క్యాడర్‌ను పక్కన పెట్టేసి వైసీపీ నాయకులకు దన్ను
-ఎమ్మెల్యే వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందంటున్న నేతలు
-పార్టీ అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దూకుడు టీడీపీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ఇప్పటికిప్పుడే రాజకీయాల్లో ఎదగాలనే నాయకుల తరహాలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ తాను బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కొలికపూడి విస్మరిస్తున్నారు. దీంతో తరచూ తాను వివాదాల్లో కూరుకుపోతూ... పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని నాయకులు ఆరోపిస్తున్నారు. కొలికపూడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి):
బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డిపై చెప్పుతో దాడి చేయడంతో కొలికపూడి పేరు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా సాగి ఆయన్ను ఎమ్మెల్యేను చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొలికపూడి తన దుందుడుకు నైజాన్ని వదల్లేదు. వాస్తవానికి కొలికపూడి గుంటూరు జిల్లా తాడికొండ వాసి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా తిరువూరు టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అంతకు ముందు ఐదు సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న శావల దేవదతను పక్కన పెట్టి మరీ కొలికపూడికి ఎమ్మెల్యే టికెట్‌ను పార్టీ అధిష్ఠానం కేటాయించింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కొలికపూడి వైఖరిలో రోజురోజుకి తేడా వస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే..
ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గత ఏడాది జూలైలో ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయకుడు పంచాయతీ స్థలం ఆక్రమించి, భవనం నిర్మిస్తున్నాడంటూ ఆ భవనం వద్దకు వెళ్లి దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్నపళంగా భవనాన్ని పడగొట్టలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఆయన ససేమిరా అంటూ అక్కడే భైఠాయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీనివాస్‌ను పిలిపించుకుని మందలించారు. ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధిని అందరి ముందు దూషించడంతో ఆ ప్రజాప్రతినిధి సతీమణి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్రస్థాయిలో సంచలనం రేకెత్తించింది. ఈ ఉదంతం చల్లారకముందే మద్యం షాపుల వారిపై తన ప్రతాపం చూపారు. ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసేశారు. తాజాగా ఎస్టీ మహిళ అని కూడా చూడకుండా వార్డు సభ్యురాలిపై దాడి చేయడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
అక్రమ మైనింగ్‌కు అండగా
తిరువూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రజాప్రతినిధి అండ లేకుండా ఇక్కడ మైనింగ్ చేయడం అసాఽధ్యం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై వార్తలు రాసినందుకు ‘ఆంధ్రజ్యోతి’పై తన అక్కసు వెళ్లగక్కారు. తిరువూరు చరిత్రలో మొట్టమొదటి సారి జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీ తీసే పరిస్థితి కల్పించుకున్నారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని వారికి బేషరతు క్షమాపణలు చెప్పారు. తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ వారితో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. వైసీపీ వారే నియోజకవర్గంలో మైనింగ్‌లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కొద్ది రోజుల క్రితం పెద్ద సంఖ్యలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేశారు.
నోటికి ఎంత వస్తే అంత..?
కొలికపూడి నోటికి అదుపు ఉండదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి వివాదాలకు కారణమవుతుంటారు. తాను సొంత నిధులతో కాల్వ పూడిక తీయిస్తే రైతులు తనకు సంఘీభావం తెలపడానికి రాలేదంటూ కొలికపూడి రెచ్చిపోయారు. రైతులను కుక్కల కంటే హీనంగా పోలుస్తూ ‘కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది.. ఇక్కడ కొందరు రైతులకు విశ్వాసం ఉండదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో సమావేశంలో.. ‘నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంభిచొచ్చు, నేను అలా కాదు నేను అంత మంచోడిని కాదు’ అంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ‘రానున్న సహకార ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేస్తా, బీసీలను అందలం ఎక్కించడానికి ఒకడొచ్చాడు’ అంటూ పార్టీ అధినేత సామాజికవర్గాన్ని అణచివేస్తా అంటూ కొలికపూడి వ్యాఖ్యానించడం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. టీడీపీ ఆవిర్భావం నుంచే బీసీలకు పెద్దపీట వేస్తూ వచ్చిందన్న సంగతి విస్మరించి కులాల నడుమ చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై పలువురు పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాలను ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా సభల్లో ప్రస్తావించడం.. పార్టీ కంటే నేనే సుప్రీం అనే తరహాలో కొలికపూడి వ్యవహరిస్తుండటం పార్టీ అధిష్ఠానానికి తీవ్ర తలనొప్పులు తెస్తోంది. కొలికపూడి తీరుతో నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఆయనపై అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే కష్టమని నియోజకవర్గ నేతలు కోరుతున్నారు.
Updated Date - Jan 13 , 2025 | 12:53 AM