Perni Nani: పేర్ని నానికి షరతులతో ముందస్తు బెయిల్
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:25 AM
రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని.. దర్యాప్తునకు సహకరించాలని, కోరినప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది.
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయం చేశారనే ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని.. దర్యాప్తునకు సహకరించాలని, కోరినప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న, కేసు వివరాలు తెలిసిన వ్యక్తులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బెదిరించడం, భయపెట్టడం వంటివి చేయడానికి వీల్లేదని తేల్చిచెబుతూ న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చారు. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాల శాఖకు లీజుకిచ్చారు. ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్కొంటూ చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా పేర్ని నానిని కూడా 6వ నిందితుడిగా చేర్చారు. దాంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి.. తాజాగా తీర్పు వెలువరించారు. ‘ఈ కేసు మొత్తం సహనిందితుడి నేరాంగీకార వాంగ్మూలం, రెండో నిందితుడిగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానసతేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు సొమ్ము బదిలీ అయిందనే విషయాలపై ఆధారపడి ఉంది. మానసతేజ 2016 నుండి రూ.10 వేల జీతానికి పిటిషనర్ వద్ద పనిచేస్తున్నారు. గోడౌన్‌లో నిల్వ చేసిన బియ్యం బస్తాల తగ్గుదలకు బాధ్యత వహిస్తూ ఏ-1గా ఉన్న పిటిషనర్ భార్య కార్పొరేషన్‌కు రూ.1,70,56,800 చెల్లించారు. ఇది ఆమె చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. బియ్యం గోడౌన్ రోజువారీ వ్యవహారాల్లో పేర్ని నాని జోక్యం ఉందని ఎఫ్‌ఐఆర్‌లో గానీ, రిమాండ్ రిపోర్ట్‌లో గానీ ఎలాంటి ప్రస్తావనా లేదు. సొమ్మును ఇప్పటికే కార్పొరేషన్‌కు చెల్లించినందున కస్టోడియల్ విచారణ అవసరం లేదు. ఆయనకు స్థిరనివాసం ఉంది. విదేశాలకు పారిపోయే అవకాశం లేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని అందులో స్పష్టం చేశారు.
Updated Date - Mar 08 , 2025 | 05:25 AM