High Court: సీఆర్‌జెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:58 AM
సీఆర్‌జెడ్ అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని, కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.
భీమిలి పరిధిలో గుర్తించేందుకు కమిటీ
దీనిపై నివేదిక సమర్పించండి: హైకోర్టు
అధికారుల అలసత్వంపై మండిపాటు
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకొనే వ్యవహారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంపై హైకోర్టు మండిపడింది. సీఆర్‌జెడ్ అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని, కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది. భీమిలి తీర ప్రాంతంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గుర్తించేందుకు ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. నిబద్ధత కలిగిన అధికారుల బృందంలో సర్వే చేయించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను కోర్టు ముందు ఉంచాలని అధికారులకు స్పష్టం చేసింది. నివేదిక సమర్పించడంలో విఫలమైతే తదుపరి విచారణకు కోర్టు ముందు ఆన్‌లైన్ ద్వారా హాజరుకావాలని ఏపీసీజెడ్‌ఎంఏ మెంబర్ సెక్రటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్‌లకు స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి సర్వేను భీమిలి పరిధికే పరిమితం చేస్తున్నామని, ఆ తరువాత భీమిలి బీచ్ నుంచి విశాఖ ఆర్‌కే బీచ్ వరకు సర్వేకు ఆదేశిస్తామని తెలిపింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. భీమునిపట్నం పరిధిలోని సీఆర్‌జెడ్-1 ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి శాశ్వత కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా... జీవీఎంసీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై మరోపిల్ దాఖలు చేసిన గ్రామాభివృద్ధిసేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు తరఫున న్యాయవాది ఎన్.జాయ్, ఏపీసీజెడ్‌ఎంఏ తరఫున ప్రభుత్వ న్యాయవాది సోమరాజు, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..
Updated Date - Feb 06 , 2025 | 04:58 AM