జీబీఎస్ కలకలం..
ABN, Publish Date - Feb 16 , 2025 | 01:00 AM
ఐదేళ్ల బాలికకు గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత లక్షణాలు కనబడడంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనకు ఉపక్రమించింది.
చెన్నైకు బాలిక సీఎస్‌ఎఫ్ నమూనాలు
జీబీఎస్ లక్షణాలున్న బాలిక వద్దకు డీఎంహెచ్‌వో, డీపీవో
ప్రభుత్వ, ప్రైవేటు పీడియాట్రిక్స్ ఆస్పత్రుల్లో నిశిత పరిశీలన
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల బాలికకు గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) అనుమానిత లక్షణాలు కనబడడంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనకు ఉపక్రమించింది. విజయవాడలోని ప్రభుత్వ పాత ఆసుపత్రి పీడియాట్రిక్స్ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో వున్న బాలిక ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని, ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (డీఎస్‌వో) డాక్టర్ నరేంద్రకృష్ణ, తదితరులు తరలి వెళ్లారు. ఇప్పటికే బాలిక నుంచి సేకరించిన సీఎస్‌ఎఫ్ నమూనా లను తుది నిర్ధారణ నిమిత్తం ల్యాబ్ పరీక్షల నిమిత్తం చెన్నైకు పంపించినట్టు డీఎం హెచ్‌వో, డీపీవో తెలిపారు. ల్యాబ్ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే బాలికకు జీబీఎస్ సోకిందీ, లేనిదీ తుది నిర్ధారణ అవుతుందని వివరించారు. నివేదిక రావడానికి రెండువారాల వ్యవధి పట్టవచ్చన్నారు. ఆస్పత్రిలో బాలిక ఆరోగ్యవంతంగా ఉందని వివరించారు. కాగా చింతలపూడి మండలం యర్ర గుంటపల్లిలో బాలిక నివసించే ప్రాంతంలో నలుగురి నుంచి మల పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్ టెస్టులకు పంపామన్నారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసు పత్రి, జిల్లాలోని సీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో పిడియాట్రిక్స్ విభాగాలకు వచ్చే చిన్నపిల్లల్లో ఎవరైనా కండరాల సమస్య లు, జీబీఎస్ అనుమానిత లక్షణాలతో వైద్యం నిమిత్తం వచ్చిఉంటే అటు వంటి వారి వివరాలను పంపాలని సూచించినట్టు వైద్యఆరోగ్యశాఖవర్గాలు వెల్లడించాయి. దీనిపై డీఎంహెచ్‌వో డాక్టర్ మాలిని మాట్లాడుతూ అపరిశుభ్రకరమైన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, కలుషిత నీరుకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాల నిల్వలు లేకుండా చూసుకోవడం, తదితర ముందస్తు జాగ్రత్తలపాటు, ఫిట్‌నెస్ కోసం వ్యాయామం వంటివి చేయడం వల్ల జీబీఎస్‌ను అడ్డుకోవచ్చన్నారు. ఇది అంటువ్యాధి కాదని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డు
ఏలూరు : చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో జీబీ సిండ్రోమ్ అనుమానిత కేసులకు ప్రత్యేక ఐసొలేషన్ వార్డును సిద్ధం చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల శనివారం తెలిపారు. కండరాల బలహీనత, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తులు ఏరియా ఆస్పత్రిలో సంప్రదించాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, బయటి ఆహార పదార్థాలను కొద్దిరోజులు దూరం పెట్టాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని ఆమె సూచించారు.
యర్రగుంటపల్లిలో ఇంటింటా సర్వే
చింతలపూడి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఐదేళ్ల బాలికలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) లక్షణాలు కన్పించడంతో గ్రామంలో మూడు రోజులుగా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ నరేశ్ తెలిపారు. ఆ బాలికను విజయవాడకు చికిత్సకు తరలించామని, ఆమె నివాస పరిసరాల్లోని 50 గృహాల్లో సర్వే నిర్వహించగా ఎవరికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదన్నారు. గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వ హించి శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 01:00 AM