ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్‌లు గుర్తించాలి
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:38 AM
జిల్లాలోని వశిష్ఠ, గౌతమి నదుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. గుర్తించిన రీచ్‌ల అనుమతుల మంజూరు కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అమలాపురం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వశిష్ఠ, గౌతమి నదుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. గుర్తించిన రీచ్‌ల అనుమతుల మంజూరు కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పట్టా భూముల్లో ఇసుక మేటల తవ్వకాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అందించిన సర్వే నివేదిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులు మంజూరు కోరుతూ ఏడు దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో ఒక దరఖాస్తుకు సంబంధించిన విస్తీర్ణం కోస్తా తీరప్రాంత జోన్ పరిధిలో ఉందని, మిగిలిన ఆరు దరఖాస్తులకు అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పి.గన్నవరం మండలంలో ఆరు దరఖాస్తులు రాగా వాటిలో ఐదు దరఖాస్తులకు సంబంధించి విస్తీర్ణం సీఆర్‌జెడ్ పరిధిలో ఉందని, వాటికి అనుమతులు తిరస్కరించామన్నారు. కె.గంగవరం మండలంలో ఒక దరఖాస్తు అందిందని, దానికి అనుమతి ఇస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక భవన నిర్మాణ రంగాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులకు సూచించారు. రీచ్‌ల గుర్తింపునకు సమన్వయ శాఖల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి మ్యాప్‌లు జియో కోఆర్డినేటర్స్‌తో సహా అనుమతుల కోసం ప్రయత్నించాలని సూచించారు. గౌతమి నది పరిధిలో నూతనంగా ఏడు లొకేషన్లు గుర్తించామని, వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి భూగర్భ గనుల శాఖ అధికారులకు, మైనింగ్ ప్లాన్ పర్యావరణ అనుమతుల కోసం పంపాలన్నారు. వశిష్ఠ నది పరిధిలో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్‌లను గుర్తించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇసుక తవ్వకాలకు చర్యలు చేపట్టాలన్నారు. అనుమతులు త్వరితగతిన పొందాలని లేనిపక్షంలో జాప్యం చోటు చేసుకుని వర్షాలు వచ్చేనాటికి అనుమతులు వచ్చినా నిరుపయోగం అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి ఎల్.వంశీధర్‌రెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ శంకరరావు, డిస్ర్టిక్ట్ జీఐఎస్ అధికారి కుమార్, గనుల శాఖ రియాల్టీ ఇన్‌స్పెక్టర్ టి.సుజాత పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 12:38 AM